Ind vs Aus Final Tarot Prediction: వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా గెలుస్తుందా.. ఆ ప్రముఖ జ్యోతిష్యురాలు ఏం చెప్పారంటే?
19 November 2023, 8:53 IST
- Ind vs Aus Final Tarot Prediction: వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాపై టీమిండియా గెలుస్తుందా? ఈ ప్రశ్నకు ప్రముఖ జ్యోతిష్యురాలు రోసీ జస్రోతియా సమాధానం ఇచ్చారు. ఆమె ప్రకారం గెలిచేది ఇండియానే.
వరల్డ్ కప్ ట్రోఫీతో ఇండియా, ఆస్ట్రేలియా కెప్టెన్లు రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్
Ind vs Aus Final Tarot Prediction: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో గెలిచేది ఎవరు? జట్ల బలాబలాలు, వాతావరణం, పిచ్.. ఇలాంటివన్నీ అంచనా వేసి క్రికెట్ పండితులు విజేతను అంచనా వేస్తారు. కానీ గ్రహాలు ఏం చెబుతున్నాయి? ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలిచేది ఎవరు? దీనికి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యురాలు రోసీ జస్రోతియా ఓ ఆసక్తికర విషయం చెప్పారు.
గెలిచేది టీమిండియానే.. కానీ..
టారో కార్డ్ ఎక్స్‌పర్ట్ కూడా అయిన రోసీ.. ఈ ఫైనల్లో విజేత టీమిండియానే అని తేల్చేశారు. టారో కార్డ్ రీడింగ్ చేసే ఆమె.. వాటి ప్రకారం కాస్త కష్టమ్మీద అయినా సరే ట్రోఫీ ఇండియన్ టీమ్ చేతికి చిక్కుతుందని చెప్పడం గమనార్హం. "టారో రీడింగ్ ప్రకారం.. ఇవాళ జడ్జ్‌మెంట్ కార్డ్ ఇండియా పేరు చెబుతోంది. జడ్జ్‌మెంట్ కార్డ్ అంటే ఓ పాజిటివ్ కార్డు. అయితే ఈ మ్యాచ్ గెలవడం ఇండియాకు అంత సులువు కాదని కూడా ఈ టారో రీడింగ్ స్పష్టం చేస్తోంది.
ఆస్ట్రేలియా నుంచి గట్టి పోటీ తప్పదు. అంటే ఓ పాము తలపై నుంచి నాగమణిని తీయడం ఎంత కష్టమో ఈ ఫైనల్ గెలవడం కూడా అంతే కష్టం. కాకపోతే ఈసారి ఇండియాకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ నాగమణిని ఇండియా దక్కించుకోవడం ఖాయం" అని రోసీ జస్రోతియా చెప్పారు.
ఊపు మీదున్న టీమిండియా
ఈ వరల్డ్ కప్ లో టీమిండియా స్పీడు చూస్తుంటే ఫైనల్లో కప్పు గెలవడం ఖాయమని అభిమానులు కూడా ఓ అంచనాకు వచ్చేశారు. మొదటి మ్యాచ్ లో ఇదే ఆస్ట్రేలియాను చిత్తు చేసి టోర్నీని ఘనంగా ప్రారంభించిన ఇండియన్ టీమ్.. తర్వాత వరుసగా మరో 9 మ్యాచ్ లు గెలిచి ఫైనల్ చేరింది. ఈ మెగా టోర్నీలో ఓటమెరగని ఏకైక టీమ్ మనదే.
అయితే 2003లోనూ ఇలాగే జరిగింది. ఆ వరల్డ్ కప్ లోనూ గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా ఫైనల్ వరకూ తిరుగులేని జట్టుగా దూసుకొచ్చింది. లీగ్ స్టేజ్ లో ఒక్క ఆస్ట్రేలియాతోనే ఓడిన ఇండియన్ టీమ్.. ఫైనల్లో మరోసారి అదే ఆస్ట్రేలియాకు తలవంచింది. ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఫైనల్లో ఓడించడం ఎలాంటి జట్టుకైనా అంత తేలిక కాదు.
ఒకేసారి ఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా
ఇప్పటి వరకూ వన్డే వరల్డ్ కప్ ను ఐదుసార్లు గెలిచిన ఆస్ట్రేలియా.. ఒక్క 1996లో మాత్రమే ఓడిపోయింది. అప్పుడు ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంక తొలిసారి విశ్వ విజేతగా నిలిచింది. అంతకుముందు 1987లో ఇంగ్లండ్ ను ఓడించి తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత 1999లో పాకిస్థాన్ ను, 2003లో ఇండియాను, 2007లో శ్రీలంకను, 2015లో న్యూజిలాండ్ ను చిత్తు చేసి ఛాంపియన్ గా నిలిచింది.
1996 తర్వాత ఫైనల్ చేరిన ప్రతిసారీ ఆస్ట్రేలియాదే విజయం. ఇదే టీమిండియాను కాస్త కలవరపెట్టే విషయం. 1983, 2011లో కప్పు గెలిచిన ఇండియన్ టీమ్.. ఈ వరల్డ్ కప్ లో మాత్రం తిరుగులేని ఫామ్ లో ఉంది. గతంలో ఎప్పుడూ ఇంత బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న ఇండియన్ టీమ్ లేదంటే అతిశయోక్తి కాదు. ఆ లెక్కన ఆ జ్యోతిష్యురాలు చెప్పినట్లు కాస్త కష్టమ్మీద అయినా సరే ఆస్ట్రేలియాను చిత్తు చేసి ట్రోఫీ గెలిచే సత్తా ఇండియన్ టీమ్ కు ఉందనడంలో సందేహం లేదు.