India in World Cup finals: వరల్డ్ కప్ ఫైనల్స్‌లో టీమిండియా.. ఆ మూడు ఫైనల్స్‌లో ఏం జరిగిందో చూడండి
India in World Cup finals: వరల్డ్ కప్ ఫైనల్స్‌లో టీమిండియా రికార్డు ఎలా ఉంది? వరల్డ్ కప్ 2023 ఫైనల్లో మరోసారి ఆస్ట్రేలియాతో ఇండియన్ టీమ్ తలపడుతున్న వేళ.. గతంలో ఆడిన మూడు ఫైనల్స్‌లో ఏం జరిగిందో చూడండి.
India in World Cup finals: వరల్డ్ కప్ 2023లో మరోసారి టీమిండియా ఫైనల్ చేరింది. 20 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతోనే మళ్లీ ఫైనల్ ఆడబోతోంది. 2003లో ఎదురైన చేదు అనుభవానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ వరల్డ్ కప్ లో పదికి పది మ్యాచ్ లూ గెలిచి ఓటమెరగని జట్టుగా దూసుకెళ్తున్న ఇండియన్ టీమ్ ఫైనల్లోనూ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
అయితే ఇప్పటి వరకూ రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా.. మొత్తంగా మూడుసార్లు ఫైనల్ చేరింది. అందులో 1983, 2011లలో కప్పు గెలవగా.. 2003లో మాత్రం ఇండియా ఓడిపోయింది. మరి ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఇండియన్ టీమ్ కప్పు గెలుస్తుందా లేక ఒత్తిడికి చిత్తై ఆస్ట్రేలియాకు ఆరోసారి కప్పు అప్పగిస్తుందా చూడాలి. అంతకుముందు గత మూడుసార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ చేరినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.
1983 వరల్డ్ కప్: 83 రన్స్‌తో గెలిచిన ఇండియా
1983 వరల్డ్ కప్ లో తొలిసారి ఇండియా ఫైనల్ చేరింది. ఎలాంటి అంచనాలు లేకుండా, సెమీస్ చేరితేనే చాలా గొప్ప అని అందరూ అనుకుంటున్న సందర్భంలో ఈ వరల్డ్ కప్ లోకి ఎంటరైన ఇండియన్ టీమ్.. ఏకంగా కప్పు గెలిచి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. అప్పటికే రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయిన వెస్టిండీస్ ను ఫైనల్లో 43 పరుగులతో చిత్తు చేసిన కపిల్ డెవిల్స్.. ట్రోఫీ గెలిచారు.
ఆ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా.. కేవలం 183 పరుగులకే కుప్పకూలింది. ఆ సయమంలో ఇండియా గెలుస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు. గ్రీనిడ్జ్, హేన్స్, వివ్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్, లారీ గోమ్స్ లాంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న వెస్టిండీస్ ను కేవలం 140 పరుగులకే కుప్పకూల్చి 43 రన్స్ తో గెలిచింది. ఇండియన్ క్రికెట్ ను సమూలంగా మార్చేసిన చరిత్రాత్మక విజయం అది.
2003 వరల్డ్ కప్, 125 రన్స్ తో ఓడిన ఇండియా
ఇక సరిగ్గా 20 ఏళ్లకు ఇండియా మరోసారి ఫైనల్ చేరింది. గంగూలీ కెప్టెన్సీలో ఆ వరల్డ్ కప్ లోనూ ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్లింది. లీగ్ స్టేజ్ లో కేవలం ఆస్ట్రేలియాతోనే ఓడింది. సెమీస్ లో కెప్టెన్ గంగూలీ సెంచరీతో కెన్యాను చిత్తు చేసింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా రూపంలో పెద్ద అడ్డంకే ఏర్పడింది. ఫైనల్ ను పూర్తి ఏకపక్షంగా మార్చేసిన ఆసీస్.. ఏకంగా 125 రన్స్ తో గెలిచింది.
ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ (121 బంతుల్లో 140) సెంచరీతో 359 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత చేజింగ్ లో ఇండియా మొదటి ఓవర్లోనే సచిన్ వికెట్ కోల్పోయింది. చివరికి 234 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెహ్వాగ్ ఒక్కడే 82 రన్స్ తో రాణించాడు.
2011 వరల్డ్ కప్.. 6 వికెట్లతో గెలిచిన టీమిండియా
1983లో తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, 2003 చేదు అనుభవం వేధిస్తున్న వేళ 2011లోనూ స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ చేరింది టీమిండియా. ఈసారి ధోనీ కెప్టెన్సీలో ఫైనల్లో శ్రీలంకతో తలపడింది. ముంబైలోని వాంఖడేలో జరిగిన ఈ ఫైనల్లో ఇండియా 6 వికెట్లతో గెలిచి 28 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జయవర్దనె సెంచరీతో 6 వికెట్లకు 274 రన్స్ చేసింది. చేజింగ్ లో సెహ్వాగ్ డకౌట్, సచిన్ 18 పరుగులకే ఔటయ్యారు. ఈ సమయంలో గంభీర్, కోహ్లి మూడో వికెట్ కు 83 పరుగులు జోడించి ఆదుకున్నారు. తర్వాత ధోనీ నాలుగో వికెట్ కు గంభీర్ తో కలిసి 109 రన్స్ జోడించారు. గంభీర్ 97, ధోనీ 91 రన్స్ చేయడంతో ఇండియా 6 వికెట్లతో గెలిచింది.