Ind vs Afg T20 world cup 2024: దంచికొట్టిన సూర్యకుమార్ యాదవ్.. ఆప్ఘనిస్థాన్‌పై టీమిండియా భారీ స్కోరు
20 June 2024, 21:54 IST
- Ind vs Afg T20 world cup 2024: సూర్యకుమార్ యాదవ్ మెరుపు హాఫ్ సెంచరీ చేయడంతో ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు చేసింది. రోహిత్, కోహ్లి మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు.
దంచికొట్టిన సూర్యకుమార్ యాదవ్.. ఆప్ఘనిస్థాన్‌పై టీమిండియా మోస్తరు స్కోరు
Ind vs Afg T20 world cup 2024: ఆఫ్ఘనిస్థాన్ తో జరుగుతున్న సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా ఓ మోస్తరు స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ మెరుపు హాఫ్ సెంచరీతో ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 రన్స్ చేసింది. సూర్య హాఫ్ సెంచరీ చేయగా.. హార్దిక్ పాండ్యా 32 పరుగులతో రాణించాడు. కోహ్లి, రోహిత్ మరోసారి నిరాశపరిచారు. చివరి ఓవర్లో అక్షర్ పటేల్ రెండు బౌండరీలు బాదాడు.
సూర్యకుమార్ మెరుపులు
టాపార్డర్ లో రోహిత్, కోహ్లి, రిషబ్ పంత్ విఫలమైనా.. సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించాడు. తనదైన స్టైల్లో గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతూ ఆఫ్ఘన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అతడు కేవలం 28 బంతుల్లో 53 రన్స్ చేశాడు. సూర్య ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. అతడు కొట్టిన మూడు సిక్స్ లు భారీవే కావడం విశేషం.
90 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమయంలో హార్దిక్ పాండ్యాతో కలిసి సూర్య ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాకు మంచి స్కోరు అందించింది. అయితే అతడు 17వ ఓవర్ చివరి బంతికి ఔటవడంతో మరింత భారీ స్కోరు చేసే అవకాశం కోల్పోయింది. మరోవైపు హార్దిక్ కూడా ఫర్వాలేదనిపించాడు. పాండ్యా 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 32 రన్స్ చేశాడు. కానీ అతడు కూడా 18వ ఓవర్లోపే ఔటయ్యాడు. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇండియన్ టీమ్ ఊహించిన స్కోరు సాధించలేకపోయింది.
కోహ్లి, రోహిత్ మళ్లీ విఫలం
టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లోనూ రోహిత్ తో కలిసి విరాట్ ఓపెనింగ్ చేశాడు. ఈ మెగా టోర్నీలో లీగ్ స్టేజ్ లో ఇదే స్థానంలో వచ్చి మూడు మ్యాచ్ లలో కేవలం 5 రన్స్ చేసిన విరాట్.. ఈ మ్యాచ్ లో కాస్త ఊపు మీదున్నట్లు కనిపించినా.. 24 బంతుల్లో 24 రన్స్ చేసి ఔటయ్యాడు. అటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా లెఫ్టామ్ పేసర్ ఫజల్ హక్ ఫరూకీ బౌలింగ్ లో ఇబ్బంది పడుతూ 13 బంతుల్లో 8 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
మూడో స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ కూడా నిరాశ పరిచాడు. 11 బంతుల్లో 20 రన్స్ చేశాడు. ఒకదశలో వరుసగా మూడు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఇక శివమ్ దూబె 10 పరుగులే చేశాడు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫరూఖీ 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.
ఇక ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా 4 ఓవర్లలో 26 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీయడం విశేషం. నవీనుల్ హక్ కు ఒక వికెట్ పడగా.. చివరి బంతికి అక్షర్ పటేల్ (12) రనౌటయ్యాడు.