T20 World Cup Pakistan: ఫ్లోరిడాలో భారీ వర్షాలు.. పాకిస్థాన్ జట్టులో గుబులు
13 June 2024, 16:51 IST
- T20 World Cup 2024 - Pakistan Team: టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఏలో తదుపరి మూడు మ్యాచ్‍లు ఫ్లోరిడాలో జరగనున్నాయి. అయితే, అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పాకిస్థాన్ జట్టులో ఎలిమినేషన్ గుబులు పెరిగింది.
T20 World Cup Pakistan: ఫ్లోరిడాలో భారీ వర్షాలు.. పాకిస్థాన్ జట్టులో గుబులు
T20 World Cup 2024: భారీ అంచనాలతో టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టుకు గ్రూప్ దశలోనే ఎలిమినేషన్ గండం పొంచి ఉంది. ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్‍లో అమెరికా చేతిలో పరాభవం పొందింది బాబర్ ఆజమ్ సేన. ఆ తర్వాత భారత్ చేతిలో ఓడిపోయింది. కెనడాపై విజయం సాధించి ఎట్టకేలకు పాక్ బోణీ కొట్టింది. దీంతో సూపర్-8 ఆశలను సజీవంగా నిలుపుకుంది. అయితే, పాకిస్థాన్ సూపర్-8 చేరాలంటే తదుపరి ఐర్లాండ్‍తో ఆ జట్టు భారీగా గెలువాలి.. ఐర్లాండ్‍తో మ్యాచ్‍లో అమెరికా ఓడాలి. అయితే, ఈ మ్యాచ్‍ల్లో ఏ ఒక్కటి రద్దయినా పాక్ టోర్నీ నుంచి ఔట్ అవుతుంది. ఇప్పుడు ఆ జట్టును ఇదే భయం వెంటాడుతోంది.
గ్రూప్-ఏ సమీకరణాలు ఇలా..
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో 20 జట్లు ఐదు గ్రూప్‍లుగా తలపడుతున్నాయి. గ్రూప్ దశలో ప్రతీ గ్రూప్‍లో టాప్‍లో నిలిచే రెండు జట్లు సూపర్-8 చేరతాయి. గ్రూప్ స్టేజీలో ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్‍లు ఆడుతుంది. గ్రూప్-ఏలో భారత్ ఇప్పటికే మూడు మ్యాచ్‍ల్లో అన్ని గెలిచి సూపర్-8 చేరింది. అమెరికా మూడు మ్యాచ్‍ల్లో రెండు గెలిచి ప్రస్తుతం రెండో ప్లేస్‍లో ఉంది. పాకిస్థాన్ మూడింట ఒకటి మాత్రమే గెలిచి మూడో స్థానంలో ఉంది. కెనడా, ఐర్లాండ్‍కు ఇప్పటికే సూపర్-8 అవకాశాలు చేజారాయి. గ్రూప్-ఏ దశలో ఇంకా మూడు మ్యాచ్‍లు జరగాల్సి ఉంది. ఆ మూడు ఫ్లోరియాడాలోని లౌడర్‌హిల్ వేదికగా ఉంది.
ఫ్లోరిడాలో జరగనున్న మ్యాచ్‍లు
జూన్ 14: అమెరికా vs ఐర్లాండ్
జూన్ 15: భారత్ vs కెనడా
జూన్ 16: పాకిస్థాన్ vs ఐర్లాండ్
ఫ్లోరిడాలో భారీగా వర్షాలు
అమెరికాలోని ఫ్లోరిడాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. రానున్న వారం రోజులు కూడా జోరుగా వానలు కురిసే ఛాన్స్ ఉంది వాతావరణ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. జూన్ 12న నేపాల్‍తో అక్కడ జరగాల్సిన గ్రూప్-డీ మ్యాచ్ రద్దవటంతో శ్రీలంక కష్టాల్లో పడింది. ఇప్పుడు, పాకిస్థాన్‍కు కూడా గండం ఉంది.
రద్దయితే పాక్ ఇంటికే..
గ్రూప్-ఏలో ప్రస్తుతం అమెరికా రెండు మ్యాచ్‍లు గెలిచి నాలుగు పాయింట్లతో రెండో ప్లేస్‍లో ఉండగా.. ఓ మ్యాచ్ మాత్రమే గెలిచిన పాక్ మూడో ప్లేస్‍లో ఉంది. పాకిస్థాన్ సూపర్-8 చేరాలంటే ఆ జట్టు ఐర్లాండ్‍పై గెలువాలి. అలాగే, ఐర్లాండ్‍తో జరిగి మ్యాచ్‍లో అమెరికా ఓడాలి. ఫ్లోరిడాలో వర్షం వల్ల ఒకవేళ ఈ రెండు మ్యాచ్‍ల్లో ఏది రద్దయినా పాకిస్థాన్ ఇక గ్రూప్ దశలోనే ఇంటికి వెళుతుంది. ఐర్లాండ్‍తో ఒకవేళ అమెరికా ఓడినా.. ఐర్లాండ్‍పై పాక్ భారీగా గెలిచి నెట్ రన్‍రేట్ మెరుగుపరుచుకుంటేనే సూపర్-8 చేరుతుంది.
ప్రస్తుతం పాకిస్థాన్‍కు వర్షం గుబులు పట్టుకుంది. వాన వల్ల ఏ మ్యాచ్‍లు రద్దు కాకూడదని కోరుకుంటోంది. గత ఎడిషన్‍లో ఫైనల్ వరకు చేరిన పాకిస్థాన్ ప్రస్తుతం 2024 ప్రపంచకప్‍లో గ్రూప్ దశలోనే ఆపసోపాలు పడి ఎలిమినేషన్ అంచుల్లో నిలబడింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో గ్రూప్ దశ తర్వాత సూపర్-8, సెమీఫైనల్స్, ఫైనల్ అన్నీ వెస్టిండీస్‍లోనే జరగనున్నాయి. కాగా, గ్రూప్-సీలో వరుసగా మూడు మ్యాచ్‍లు గెలిచిన వెస్టిండీస్ ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించేసింది.
టాపిక్