తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Harbhajan On Dhoni: నేను ధోనీతో మాట్లాడటం లేదు.. పదేళ్లవుతోంది: హర్భజన్ షాకింగ్ కామెంట్స్

Harbhajan on Dhoni: నేను ధోనీతో మాట్లాడటం లేదు.. పదేళ్లవుతోంది: హర్భజన్ షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

04 December 2024, 9:29 IST

google News
    • Harbhajan on Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీతో తాను మాట్లాడక పదేళ్లవుతోందని అన్నాడు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్లలో సభ్యుడైన భజ్జీ.. తరచూ ఈ విజయాల్లో ధోనీకి మాత్రమే క్రెడిట్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఉంటాడు.
నేను ధోనీతో మాట్లాడటం లేదు.. పదేళ్లవుతోంది: హర్భజన్ షాకింగ్ కామెంట్స్
నేను ధోనీతో మాట్లాడటం లేదు.. పదేళ్లవుతోంది: హర్భజన్ షాకింగ్ కామెంట్స్ (BCCI-AP)

నేను ధోనీతో మాట్లాడటం లేదు.. పదేళ్లవుతోంది: హర్భజన్ షాకింగ్ కామెంట్స్

Harbhajan on Dhoni: ధోనీతో తనకున్న విభేదాలపై హర్భజన్ సింగ్ మరోసారి స్పందించాడు. అసలు కారణమేంటో తెలియదు కానీ.. పదేళ్లుగా తాను ధోనీతో మాట్లాడటం లేదని భజ్జీ చెప్పడం గమనార్హం. అతని తాజా కామెంట్స్ చూస్తుంటే.. ఇద్దరి మధ్యా తెర వెనుక చాలానే జరిగినట్లు స్పష్టమవుతోంది. ధోనీ, హర్భజన్ కలిసి చివరిసారి ఇండియా తరఫున 2015లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ లో ఆడారు.

ధోనీతో మాట్లాడక పదేళ్లవుతోంది: హర్భజన్

హర్భజన్ సింగ్ ఈ మధ్యే న్యూస్ 18తో మాట్లాడాడు. ఈ సందర్భంగా తాను ధోనీతో మాట్లాడని విషయాన్ని వెల్లడించాడు. "లేదు, నేను ధోనీతో మాట్లాడను. నేను సీఎస్కేకు ఆడే సమయంలో మాత్రమే మాట్లాడాను. లేదంటే మేము మాట్లాడుకోలేదు.

పదేళ్లకుపైనే అవుతోంది. దీనికి కారణమేంటో నాకు తెలియదు. బహుషా అతనికి తెలిసి ఉంటుంది. సీఎస్కేకు ఆడే సమయంలో అది కూడా కేవలం గ్రౌండ్లోనే మాట్లాడుకునే వాళ్లం. ఆ తర్వాత అతడు నా రూమ్ కు రాలేదు. నేను అతని రూమ్ కు వెళ్లలేదు" అని హర్భజన్ తెలిపాడు.

ఆ ఇద్దరితోనూ మాట్లాడతాను

తన మాజీ టీమ్మేట్స్ యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రాలతోనే తాను రెగ్యులర్ గా మాట్లాడతానని హర్భజన్ చెప్పాడు. ధోనీపై నేరుగా ఎలాంటి ఆరోపణలు చేయలేదు కానీ.. తమ మధ్య సంబంధాలు సరిగా లేవని మాత్రం పరోక్షంగా వెల్లడించాడు. "అతనితో నాకు ఎలాంటి వైరం లేదు. అతడేమైనా నా గురించి అనాలనుకుంటే అనొచ్చు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే ఇప్పటికే చెప్పి ఉండేవాడు. నేనెప్పుడూ అతనికి ఫోన్ చేయలేదు.

నా కాల్స్ తీసుకునే వాళ్లకే నేను ఫోన్ చేస్తాను. లేదంటే నాకు అసలు టైమ్ ఉండదు. నేను ఫ్రెండ్స్ గా ఉన్నవాళ్లతోనే టచ్ లో ఉంటాను. రిలేషన్షిప్ అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. నేను నిన్ను గౌరవిస్తే నువ్వు కూడా నన్ను గౌరవించాలి. లేదంటే స్పందించాలి. నేను ఒకటి, రెండుసార్లు కాల్ చేసినా స్పందించకపోతే ఇక వదిలేస్తాను" అని హర్భజన్ అన్నాడు.

2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన సమయంలో ధోనీ కెప్టెన్ గా ఉండగా.. హర్భజన్ టీమ్ లో సభ్యుడిగా ఉన్నాడు. ఈ రెండు విజయాల్లోనూ క్రెడిట్ మొత్తం ధోనీకే ఇవ్వడంపై గతంలో హర్భజన్ చాలాసార్లు అభ్యంతరం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఇప్పుడు ధోనీతో తనకు విభేదాలు ఉన్నాయని చెప్పకనే చెప్పాడు.

తదుపరి వ్యాసం