Gavaskar warns Team India: ఆస్ట్రేలియాతో జాగ్రత్త: టీమిండియాకు గవాస్కర్ వార్నింగ్
17 November 2023, 21:02 IST
- Gavaskar warns Team India: ఆస్ట్రేలియాతో జాగ్రత్త అంటూ వరల్డ్ కప్ 2023 ఫైనల్ కు ముందు టీమిండియాకు గవాస్కర్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఫైనల్లో ఇండియానే ఫేవరెట్ అంటూనే అతడు ఈ హెచ్చరిక జారీ చేయడం గమనార్హం.
వరల్డ్ కప్ 2023 ఫైనల్ కోసం నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలు పెట్టిన టీమిండియా
Gavaskar warns Team India: ఆస్ట్రేలియాతో టీమిండియా వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో తలపడుబోతున్న వేళ రోహిత్ సేనకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వార్నింగ్ ఇచ్చాడు. వరల్డ్ కప్ ఫైనల్ ఆదివారం (నవంబర్ 19) జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమే ఫేవరెట్ అని స్పష్టం చేసిన సన్నీ.. అదే సమయంలో ఆస్ట్రేలియాను తేలిగ్గా తీసుకోవద్దని చెప్పాడు.
2003 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడిన ఇండియా, ఆస్ట్రేలియా మళ్లీ 20 ఏళ్ల తర్వాత మరో ట్రోఫీ కోసం ఫైట్ చేయనున్నాయి. అప్పటిలాగే ఇప్పుడు కూడా ఇండియా లీగ్ స్టేజ్, సెమీఫైనల్లో ప్రత్యర్థులను పూర్తిగా డామినేట్ చేసింది. అప్పుడు లీగ్ స్టేజ్ లో ఆస్ట్రేలియాతోనే ఓ మ్యాచ్ ఓడిపోగా.. ఈసారి అసలు ఓటమెరగని జట్టుగా సెమీస్ లో అడుగుపెట్టి.. అక్కడా న్యూజిలాండ్ ను చిత్తు చేసింది.
ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం: గవాస్కర్
ఫైనల్ కు ముందు ఇండియా టుడేతో గవాస్కర్ మాట్లాడాడు. "రెండు బెస్ట్ టీమ్స్ ఫైనల్ ఆడబోతున్నాయి. ఇండియా లీగ్ స్టేజ్ లో 9 మ్యాచ్ లూ గెలిచింది. తర్వాత సెమీఫైనల్లోనూ అదే రిపీట్ చేసింది. ఆస్ట్రేలియా మొదట్లో తడబడింది. కానీ తర్వాత చాలా బలంగా పుంజుకుంది. కొన్ని మ్యాచ్ లలో అసాధ్యమనుకున్న స్థాయి నుంచి గెలిచింది" అని గవాస్కర్ అన్నాడు.
"ఇండియా కచ్చితంగా ఫేవరెట్సే. వాళ్లు ఆడుతున్న తీరు అలా ఉంది. కానీ ఆస్ట్రేలియన్లను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఎలా ఆడాడో చూశాం. అతడు తగ్గేదే లేదన్నట్లు ఆడాడు. ఆస్ట్రేలియన్ల విషయానికి వస్తే వాళ్లకు దేశంపై ఉన్న ప్రేమ, దేశం కోసం ఏదైనా చేయాలన్న తపనను ఎప్పుడూ తీసిపారేయలేం" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.
సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ ను ఇండియా 70 పరుగులతో చిత్తు చేయగా.. ఆస్ట్రేలియా చాలా కష్టమ్మీద 3 వికెట్లతో సౌతాఫ్రికాపై గెలిచింది. ఈ రెండు టీమ్స్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ ఆడనున్నాయి. అయితే ఇప్పటి వరకూ వరల్డ్ కప్ లలో ఆరుసార్లు ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా.. కేవలం 1996లో మాత్రమే శ్రీలంక చేతుల్లో ఓడింది. మిగతా ఐదుసార్లూ విజేతగా నిలిచింది. ఇదొక్కటే టీమిండియాను కలవరపెట్టే రికార్డు.
టాపిక్