Gavaskar on jadeja: వార్న్ చెప్పినట్లు జడేజా ఓ రాక్‌స్టారే.. అతని ఫామ్‌పై ఆందోళన వద్దు: గవాస్కర్
03 October 2023, 9:04 IST
- Gavaskar on jadeja: వార్న్ చెప్పినట్లు జడేజా ఓ రాక్‌స్టారే.. అతని ఫామ్‌పై ఆందోళన వద్దు అని అన్నాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. కొంతకాలంగా జడేజా తన స్థాయి ఆటతీరు ప్రదర్శించడం లేదన్న విషయం తెలిసిందే.
రవీంద్ర జడేజా
Gavaskar on jadeja: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ప్రశంసల వర్షం కురిపించాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. అతని ఫామ్ పై ఆందోళన అవసరం లేదని తేల్చి చెప్పాడు. అతడో రాక్ స్టార్ అని అనడం విశేషం. కొంతకాలంగా టీమిండియా వరుస విజయాలు సాధిస్తున్నా.. జడేజా మాత్రం అటు బ్యాట్‌తో, ఇటు బంతితో విఫలమవుతూనే ఉన్నాడు.
2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై ఇండియాను గెలిపించడానికి ధోనీతో జడేజా ఆడిన ఇన్నింగ్స్ తో అతడు టీమ్ లో ఓ కీలకమైన ఆల్ రౌండర్ గా ఎదిగాడు. తర్వాత నాలుగేళ్ల పాటు అటు టెస్టులు, ఇటు వన్డేల్లో ఎంతో మెరుగయ్యాడు. అయితే వరల్డ్ కప్ కు ముందు జడేజా ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. మిగతా టీమంతా సెట్ అయినా.. జడ్డూ విషయంలోనే ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు.
సర్జరీ తర్వాత వచ్చిన జడేజా వన్డేల్లో 12 ఇన్నింగ్స్ లో కేవలం 189 రన్స్ మాత్రమే చేశాడు. అయినా ఇన్నాళ్లుగా జట్టులో ఓ కీలక ప్లేయర్ గా ఎదిగిన జడేజాకు తుది జట్టులో ఆటోమేటిగ్గా స్థానం లభిస్తూనే ఉంటుంది. దీనికి కారణం ఏంటో చెప్పాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. అంతేకాదు అతని ఫామ్ పై ఆందోళన అవసరం లేదని భరోసా ఇస్తున్నాడు.
హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడిన సన్నీ జడేజా గురించి మాట్లాడుతూ.. "ఏమాత్రం ఆందోళన అవసరం లేదు. అతనికున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుంటే అదేమంత పెద్ద విషయం కాదు. వికెట్ల మధ్య అతడు పరుగెత్తే తీరు ముఖ్యమైనది. మనం తరచూ అది పెద్దగా పట్టించుకోం. కానీ అతడు నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉంటే.. మరో బ్యాటర్ ఒకటిని రెండు పరుగులుగా చేయడంలో సాయపడతాడు. ఆ చిన్న విషయాలే ముఖ్యమైనవి. అందుకే రవీంద్ర జడేజా విషయంలో నాకు ఎలాంటి ఆందోళనా లేదు. అతడో టాప్ ప్లేయర్. అద్భుతమైన ప్లేయర్. షేన్ వార్న్ అప్పట్లో చెప్పినట్లు అతడో రాక్ స్టార్" అని అనడం విశేషం.
టీ20ల్లో జడేజా ఇప్పటి వరకూ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఇక వన్డేల్లోనే చివరిసారి డిసెంబర్ 2020లో ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేశాడు. ఇక స్వదేశంలో అయితే 2013 తర్వాత వన్డేల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. టెస్టుల్లో నమ్మదగిన ఆల్ రౌండర్ గా ఎదిగిన జడేజా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం ముఖ్యంగా బ్యాట్ తో చెప్పుకోదగిన ప్రదర్శన చేసింది మాత్రం లేదనే చెప్పాలి.