World Cup 2023: వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి? ఎవరికి ఛాన్స్ ఉంది?-world cup 2023 semi finals qualification scenarios cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  World Cup 2023: వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి? ఎవరికి ఛాన్స్ ఉంది?

World Cup 2023: వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి? ఎవరికి ఛాన్స్ ఉంది?

Hari Prasad S HT Telugu
Oct 02, 2023 02:35 PM IST

World Cup 2023: వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి? ఎవరికి ఛాన్స్ ఉంది? అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో టోర్నీ ఫార్మాట్ ఒకసారి చూద్దాం.

వరల్డ్ కప్ ట్రోఫీ
వరల్డ్ కప్ ట్రోఫీ (Hindustan Times)

World Cup 2023: వరల్డ్ కప్ 2023 ప్రారంభం కావడానికి మరో మూడు రోజులే ఉంది. ఈసారి ట్రోఫీ కోసం పది టీమ్స్ పోటీ పడుతున్నాయి. వీటిలో 8 టీమ్స్ నేరుగా అర్హత సాధించగా.. శ్రీలంక, నెదర్లాండ్స్ మాత్రం అర్హత టోర్నీ ద్వారా వచ్చాయి.

రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ స్టేజ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ టీమ్ సెమీఫైనల్ చేరాలంటే లీగ్ స్టేజ్ లో ఎన్ని మ్యాచ్ లు గెలవాలి? 2019 వరల్డ్ కప్ లో ఏం జరిగింది? వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.

వరల్డ్ కప్ 2023 గ్రూప్ ఫార్మాట్

వరల్డ్ కప్ 2023 కూడా వరల్డ్ కప్ 2019 ఫార్మాట్లోనే జరగబోతోంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే లీగ్ స్టేజ్ లో మొత్తం 10 టీమ్స్ తలపడతాయి. ప్రతి టీమ్ మిగతా 9 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే లీగ్ స్టేజ్ లో మాత్తం 45 మ్యాచ్ లు జరుగుతాయి.

గ్రూప్ స్టేజ్ లో టాప్ 4లో నిలిచే టీమ్స్ సెమీఫైనల్ చేరతాయి. లీగ్ స్టేజ్ లో టాప్ టీమ్.. నాలుగో స్థానంలో నిలిచిన టీమ్ తో సెమీస్ ఆడుతుంది. ఇక మరో సెమీఫైనల్లో రెండు, మూడు స్థానాల్లోని టీమ్స్ ఆడతాయి. రెండు సెమీఫైనల్స్ లో గెలిచిన టీమ్స్ నవంబర్ 19న జరిగే ఫైనల్లో తలపడతాయి.

సెమీస్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?

లీగ్ స్టేజ్ లో ప్రతి టీమ్ 9 మ్యాచ్ లు ఆడుతుంది. 2019 వరల్డ్ కప్ జరిగిన విధానం చూస్తే.. 9 మ్యాచ్ లలో కనీసం 7 గెలిస్తే సెమీ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. 2019 వరల్డ్ కప్ లో ఇండియా, ఆస్ట్రేలియా తాము ఆడిన 9 మ్యాచ్ లలో 7 గెలిచి, 2 ఓడి సెమీఫైనల్ కు అర్హత సాధించాయి. ఈ రెండే టాప్ 2లో నిలిచాయి. కనీసం ఆరు గెలిచిన టీమ్స్ కూడా సెమీ ఫైనల్ రేసులో ఉంటాయి.

ఒకవేళ లీగ్ స్టేజ్ లో సెమీఫైనల్ కు అర్హత సాధించే క్రమంలో జట్ల పాయింట్ల సమమైతే.. వాళ్లు సాధించిన విజయాలను మొదట పరిగణనలోకి తీసుకుంటారు. అవి కూడా సమమైతే.. నెట్ రన్‌రేట్ చూస్తారు. 2019 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ను వెనక్కి నెట్టి న్యూజిలాండ్ నాలుగో స్థానంతో సెమీఫైనల్ కు అర్హత సాధించింది. న్యూజిలాండ్, పాకిస్థాన్ 11 పాయింట్లు, ఐదేసి విజయాలతో సమంగా నిలవగా.. నెట్ రన్ రేట్ ఆధారంగా న్యూజిలాండ్ ముందడుగు వేసింది.

సెమీస్ ఛాన్స్ ఎవరికి?

ఈసారి మొత్తం 10 టీమ్స్ సెమీఫైనల్ బెర్త్ కోసం లీగ్ స్టేజ్ లో తలపడతాయి. అయితే వీటిలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తోపాటు ఆతిథ్య ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లేదా పాకిస్థాన్ జట్లు సెమీస్ చేరే అవకాశం ఉన్నట్లు క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి టీమ్స్ ను కూడా తక్కువ అంచనా వేయలేం.

Whats_app_banner