Gavaskar on India: పాకిస్థాన్‌ను బట్టలు ఉతికినట్లు ఉతికారేశారు: గవాస్కర్
13 September 2023, 21:03 IST
- Gavaskar on India: పాకిస్థాన్‌ను బట్టలు ఉతికినట్లు ఉతికారేశారు అంటూ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్థాన్ ను ఇండియా ఏకంగా 228 పరుగులతో చిత్తు చేసిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ ను చిత్తు చేసిన తర్వాత టీమిండియా
Gavaskar on India: ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్థాన్ ను ఇండియా చిత్తు చిత్తుగా ఓడించడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దాయాదిని మనవాళ్లు బట్టలు ఉతికినట్లు ఉతికారేశారు అని అతడు అనడం గమనార్హం. ఈ మ్యాచ్ లో ఇండియా ఏకంగా 228 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే. వన్డేల్లో పాకిస్థాన్ పై పరుగుల పరంగా భారత్ కు ఇదే అతిపెద్ద విజయం.
357 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్థాన్ కేవలం 128 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంపై ఇండియా టుడేతో గవాస్కర్ మాట్లాడాడు. "అతిపెద్ద విజయం గురించి పక్కనపెట్టండి. పూర్తిగా ఉతికేశారు. ధోబీ ఘాట్ లో బట్టలు ఎలా ఉతుకుతామో అలా ఉతికేశారు.
మంచి టీమ్ అయితే గత మ్యాచ్ ఫలితం మీపై ఎలాంటి ప్రభావం చూపకూడదు. ఒకవేళ దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తే తర్వాతి మ్యాచ్ పై దృష్టి సారించలేరు. పాకిస్థాన్ ఆ తప్పు చేస్తుందని నేను అనుకోవడం లేదు" అని శ్రీలంకతో పాకిస్థాన్ మ్యాచ్ కు ముందు గవాస్కర్ అన్నాడు.
ఈ మ్యాచ్ లో గాయాల నుంచి కోలుకొని వచ్చిన కేఎల్ రాహుల్, బుమ్రా అదరగొట్టారు. దీనిపైనా గవాస్కర్ స్పందించాడు. "కేఎల్ రాహుల్ సెంచరీ చేయడంతోపాటు వికెట్ కీపింగ్ కూడా చేశాడు. అతని ఫిట్‌నెస్ పై చర్చ జరుగుతున్న సమయంలో అతడు తానేంటో నిరూపించాడు.
తాను పూర్తి ఫిట్ గా ఉన్నట్లు చూపించాడు. బుమ్రా కూడా మంచి రిథమ్ లో కనిపించాడు. అతని రనప్ బాగుంది. బంతిని రెండు వైపులా స్వింగ్ చేశాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్ అయిన బాబర్ ఆజం కూడా అతని బౌలింగ్ లో ఆడలేకపోయాడు" అని గవాస్కర్ అన్నాడు.