Asia Cup 2023 IND vs SL: అదరగొట్టిన భారత బౌలర్లు.. లంకపై గెలుపు.. ఆసియాకప్ ఫైనల్‍కు రోహిత్‍సేన
Asia Cup 2023 IND vs SL: ఆసియాకప్ సూపర్-4లో శ్రీలంకపై టీమిండియా అదిరే విజయం సాధించింది. దీంతో ఆసియాకప్ 2023 ఫైనల్‍కు చేరింది.
Asia Cup 2023 IND vs SL: బౌలర్లు సత్తాచాటడంతో ఆసియాకప్ 2023 టోర్నీ సూపర్-4 మ్యాచ్‍లో శ్రీలంకపై భారత్ అద్భుత విజయం సాధించింది. నేడు (సెప్టెంబర్ 12) కొలంబోలో జరిగిన మ్యాచ్‍లో 41 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. దీంతో ఆసియాకప్ 2023 టోర్నీ ఫైనల్‍కు చేరింది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (53) అర్ధ శతకంతో రాణించగా.. కేఎల్ రాహుల్ (39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో దినుత్ వెల్లలాగే ఐదు వికెట్లతో అదరగొట్టగా.. చరిత్ అసలంక నాలుగు వికెట్లతో రాణించాడు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించటంతో శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. భారత స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో అద్భుత ప్రదర్శన చేయగా.. జస్‍ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, పాండ్యా చెరో వికెట్ తీశారు. స్వల్ప లక్ష్యాన్ని అద్భుతంగా కాపాడి జట్టును గెలిపించారు టీమిండియా బౌలర్లు. బౌలింగ్‍లో సత్తాచాటిన దునిత్ వెల్లలాగే (42 నాటౌట్) బ్యాటింగ్‍లోనూ రాణించినా శ్రీలంక గెలువలేకపోయింది. ధనంజయ డిసిల్వ (41) ఆకట్టుకున్నా మిగిలిన లంక బ్యాటర్లు వారు విఫలమయ్యారు. ఈ గెలుపుతో సూపర్-4లో నాలుగు పాయింట్లతో టాప్‍కు చేరి ఆసియాకప్ 2023 ఫైనల్‍లో అడుగుపెట్టింది భారత్.
ఆరంభం అదిరినా..
టాస్ గెలిచి స్పిన్‍కు అనుకూలంగా ఉన్న పిచ్‍పై టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‍మన్ గిల్ (19) తొలి వికెట్‍కు 80 పరుగులు జోడించి మంచి ఆరంభం ఇచ్చారు. శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లగాగే 12వ ఓవర్లో తన తొలి బంతికే గిల్‍ను ఔట్ చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (3)ని పెవిలియన్‍కు పంపాడు. అర్ధ శతకం చేసి జోరు మీదున్న రోహిత్ శర్మను కూడా వెల్లలాగే ఔట్ చేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (39), ఇషాన్ కిషన్ (33) మోస్తరుగా ఆడగా.. హార్దిక్ పాండ్యా (5), రవీంద్ర జడేజా (4), బుమ్రా (5) కుల్‍దీప్ యాదవ్ (0) విఫలమయ్యారు. చివర్లో అక్షర్ పటేల్ (26) విలువైన పరుగులు చేసి జట్టుకు మోస్తరు స్కోరు అందించాడు. లంక స్పిన్నర్ వెల్లలాగే ఐదు వికెట్లతో టీమిండియా టాపార్డర్‌ను కూల్చగా.. చరిత్ అసలంక ఆ తర్వాత నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.
భారత బౌలర్లు భళా
214 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంకను ఆరంభంలో భారత పేసర్లు జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ వణికించాడు. పతుమ్ నిస్సంక (6), కుషాల్ మెండిస్ (15)ను బుమ్రా ఔట్ చేయగా.. దిముత్ కరుణరత్నె (2)ను సిరాజ్ పెవిలియన్‍కు పంపాడు. సదీర సమరవిక్రమ (17), చరిత్ అసలంక (22)ను భారత స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్ ఔట్ చేయటంతో.. శ్రీలంక 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం శనక (9)ను జడేజా పెవిలియన్‍కు పంపటంతో భారత్ విజయం సులువే అని అందరూ అనుకున్నారు.
డిసిల్వ.. వెల్లలాగే టెన్షన్ పెట్టినా..
అయితే, ఆ తర్వాత ధనుంజయ డిసిల్వ (41), దునిత్ వెల్లలాగే (42 నాటౌట్) అద్భుత పోరాటం చేశారు. 63 పరుగుల భాగస్వామ్యం జోడించి టీమిండియాను కంగారు పెట్టారు. 38వ ఓవర్లో జడేజా.. డిసిల్వను ఔట్ చేసి బ్రేక్ త్రూ ఇచ్చాడు. దీంతో భారత్ ఊపిరి పీల్చుకొని.. మళ్లీ పైచేయి సాధించింది. ఆ తర్వాత ఓ ఎండ్‍లో వెల్లలాగే నిలకడగా ఆడినా.. తీక్షణ (2), కసున్ రజిత (1), పతిరణ (0)ను టీమిండియా బౌలర్లు వెనువెంటనే ఔట్ చేశారు. దీంతో 41.3 ఓవర్లలో శ్రీలంక 172 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా 41 పరుగుల తేడాతో గెలిచింది. సూపర్-4లో బంగ్లాదేశ్‍తో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆసియాకప్ 2023 ఫైనల్ చేరింది భారత్.