తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gambhir On Virat Kohli: కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడమేంటి.. అతనికి ఇవ్వాల్సింది: గంభీర్ వింత వాదన

Gambhir on Virat Kohli: కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడమేంటి.. అతనికి ఇవ్వాల్సింది: గంభీర్ వింత వాదన

Hari Prasad S HT Telugu

12 September 2023, 9:26 IST

google News
    • Gambhir on Virat Kohli: కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడమేంటి అంటూ మరోసారి వింత వాదన వినిపించాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. కుల్దీప్ యాదవ్ కు ఇవ్వాల్సిందని అతడు అనడం గమనార్హం.
విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (AP)

విరాట్ కోహ్లి

Gambhir on Virat Kohli: విరాట్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇవ్వడంపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ తో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన కోహ్లి (94 బంతుల్లో 122)ని మించి ఈ అవార్డు అందుకునే ప్లేయర్ మరొకరు లేరని అందరూ భావించారు. కానీ గంభీర్ వాదన మాత్రం మరోలా ఉంది.

కోహ్లికి కాకుండా ఈ అవార్డు ఐదు వికెట్లు తీసుకున్న కుల్దీప్ యాదవ్ కు ఇవ్వాల్సిందని గంభీర్ అభిప్రాయపడటం విశేషం. సీమ్, స్వింగ్ కు అనుకూలిస్తున్న ఇలాంటి పిచ్ పై, అది కూడా స్పిన్ బాగా పాకిస్థాన్ టీమ్ పై ఐదు వికెట్లు తీయడం మాటలు కాదని, అందుకే తన దృష్టిలో కుల్దీప్ తప్ప మరొకరు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు అర్హులు కారని గంభీర్ స్పష్టం చేశాడు.

"నా వరకు కుల్దీప్ యాదవే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. అతను తప్ప మరొకరు లేరు. విరాట్ సెంచరీ చేశాడు. కేఎల్ సెంచరీ చేశాడు. రోహిత్, గిల్ ఫిఫ్టీస్ చేశారన్న విషయం నాకు తెలుసు. కానీ ఇలాంటి సీమింగ్ స్వింగింగ్ వికెట్ పై 8 ఓవర్లలోనే 5 వికెట్లు తీసుకోవడం, అది కూడా స్పిన్ అద్భుతంగా ఆడే పాకిస్థాన్ బ్యాటర్లపై. ఇది గేమ్ ఛేంజింగ్ మూమెంట్.

ఇదేదో స్పిన్ అంతగా ఆడటం రాని ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా అయితే మరో విషయం. పాకిస్థాన్ పై అంటే బౌలర్ సత్తా ఏంటో చూపించింది. బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. వరల్డ్ కప్ కు ముందు ఇది ఇండియన్ క్రికెట్ కు శుభ పరిణాం. ఇద్దరు అటాకింగ్ పేస్ బౌలర్లతోపాటు కుల్దీప్ ఉన్నాడు. ముగ్గురు వికెట్ టేకింగ్ బౌలర్లు ఉన్నారు" అని గంభీర్ అన్నాడు.

అయితే గంభీర్ వాదనతో చాలా మంది ఏకీభవించలేదు. కఠినమైన కొలంబో పిచ్ పై 250-260 పరుగులు కూడా గొప్పే అనుకుంటే ఏకంగా 356 పరుగులు చేయడంలో విరాట్ కోహ్లి పాత్ర మరవలేనిది. పాకిస్థాన్ బౌలర్లను అతడు ఎదుర్కొన్న విధానం అద్భుతం. వాళ్ల పేస్ బౌలర్లు టాప్ ఫామ్ లో ఉన్నారు. స్వింగ్ చేస్తూ, బౌన్స్ చేస్తూ ఇబ్బంది పెట్టారు. అయినా రాహుల్ తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ నిర్మించిన తీరు మరో లెవల్.

ఇంత కీలకమైన మ్యాచ్ లో, పాకిస్థాన్ లాంటి టీమ్ పై సెంచరీ మామూలు విషయం కాదు. కోహ్లి, రాహుల్ సెంచరీలే ఇండియా విజయానికి బాటలు వేశాయి. ఆ తర్వాత తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాకిస్థాన్ బ్యాటర్ల పని పట్టారు ఇండియన్ బౌలర్లు. ఏ రకంగా చూసినా కూడా కోహ్లిని మించి ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు అర్హులైన వ్యక్తి మరొకరు లేరని చెప్పొచ్చు.

తదుపరి వ్యాసం