Gautam Gambhir: సచిన్, గవాస్కర్, కోహ్లి కాదు.. ఇండియా ఆల్‌టైమ్ బెస్ట్ బ్యాటర్ అతడే: గంభీర్
Gautam Gambhir: సచిన్, గవాస్కర్, కోహ్లి కాదు.. ఇండియా ఆల్‌టైమ్ బెస్ట్ బ్యాటర్ యువరాజ్ సింగ్ అని గౌతమ్ గంభీర్ అనడం గమనార్హం. ప్రతి విషయంలోనూ తనదైన సమాధానాలు ఇచ్చే గౌతీ.. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో పెద్ద చర్చకు తెరతీశాడు.
Gautam Gambhir: ఇండియన్ క్రికెట్ ప్రపంచానికి అందించిన అతి గొప్ప బ్యాటర్ ఎవరు? ఈ ప్రశ్నకు చాలా మంది చెప్పే సమాధానం సచిన్ టెండూల్కర్. కొందరు సునీల్ గవాస్కర్ అనొచ్చు. మరికొందరు విరాట్ కోహ్లి పేరు చెప్పొచ్చు. ఇంకొందరు ద్రవిడ్, గంగూలీలాంటి వాళ్ల పేర్లనూ ప్రస్తావించవచ్చు. కానీ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ వాదన మాత్రం మరోలా ఉంది.
ఇండియన్ క్రికెట్ ప్రపంచానికి అందించిన బెస్ట్ బ్యాటర్ యువరాజ్ సింగ్ అని గంభీర్ అనడం గమనార్హం. ది బడా భారత్ షోలో వివేక్ బింద్రా అడిగిన ప్రశ్నకు గౌతీ ఈ సమాధానమిచ్చాడు. నిజానికి ఈ ఇంటర్వ్యూలో ఇండియా తరఫున బెస్ట్ బ్యాటర్ ఎవరు అన్న ప్రశ్నకు విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ అనే ఆప్షన్లు కూడా ఇచ్చాడు.
కానీ గంభీర్ మాత్రం వీళ్లెవరూ కాదు.. యువరాజ్ సింగ్ అని చెప్పడం షాక్ కు గురి చేసింది. గతంలోనూ ఒకసారి యువరాజే బెస్ట్ బ్యాటర్ అని గంభీర్ అన్నాడు. ఇక టీమిండియా బెస్ట్ కెప్టెన్ ఎవరన్న విషయంలోనూ గంభీర్ తన మార్క్ సమాధానమిచ్చాడు. ఇండియా బెస్ట్ కెప్టెన్ ఎవరంటూ కపిల్ దేవ్, గంగూలీ, ధోనీ, కోహ్లి పేర్లను ఆప్షన్లుగా ఇవ్వగా గంభీర్ మాత్రం అనిల్ కుంబ్లే అని చెప్పాడు.
చాలా కాలంగా ఇండియాలో వ్యక్తి పూజ గురించి గంభీర్ తీవ్రమైన కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. 1983 వరల్డ్ కప్ గెలిచినప్పుడు క్రెడిట్ అంతా కపిల్ దేవ్ కు వెళ్లడం, 2011 వరల్డ్ కప్ లో ధోనీనే గెలిపించాడని అనడం గౌతీకి మింగుడుపడటం లేదు. వాళ్లు తమను తాము ప్రమోట్ చేసుకొని క్రెడిట్ తీసుకెళ్లారు కానీ.. ఈ విజయాల్లో వాళ్ల కంటే జట్టులోని ఇతర సభ్యుల పాత్రే ఎక్కువని గంభీర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు.
ఇక ఈ మధ్య కోహ్లి విషయంలోనూ గంభీర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్లో అతనితో గొడవ జరిగినప్పటి నుంచీ గంభీర్ ఎక్కడికి వెళ్లినా కోహ్లి నినాదాలతో అభిమానులు స్టేడియాలను మార్మోగిస్తున్నారు. దీంతో ఈ మధ్య సహనం కోల్పోయిన గంభీర్.. ఆ అభిమానులకు తన మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లిన వీడియో వైరల్ అయింది.