Virat Kohli: సచిన్ రికార్డు బద్దలుకొట్టిన కోహ్లీ.. శతకాలతో చెలరేగిన విరాట్, కేఎల్ రాహుల్.. పాక్ ముందు భారీ టార్గెట్
Virat Kohli IND vs PAK: ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‍లో పాకిస్థాన్‍పై విశ్వరూపం చూపారు భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్. ఈ క్రమంలో కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలుకొట్టాడు. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్ ఉంది.
Virat Kohli IND vs PAK: పాకిస్థాన్‍తో ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‍లో భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (94 బంతుల్లో 122 పరుగులు నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (106 బంతుల్లో 111 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకాలతో విశ్వరూపం చూపారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 356 పరుగుల భారీ స్కోరు చేసింది. రిజర్వ్ డే అయిన నేడు 2 వికెట్లకు 147 పరుగుల (24.1 ఓవర్లు) వద్ద టీమిండియా బ్యాటింగ్‍కు దిగింది. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా 233 పరుగులు జోడించారు కోహ్లీ, రాహుల్. శ్రీలంకలోని కొలంబో స్టేడియంలో బౌండరీల మోత మెగించారు. పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపారు. గాయం నుంచి కోలుకొని నెలల తర్వాత భారత జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్.. సెంచరీతో ఘనంగా తన పునరాగమనాన్ని చాటాడు. పాకిస్థాన్ ముందు 357 పరుగుల భారీ లక్ష్యం ఉంది. కాగా, ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలుకొట్టి చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ. వివరాలివే..
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
వన్డే క్రికెట్‍లో అత్యంత వేగంగా 13వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. 267 ఇన్నింగ్స్‌లోనే (278 మ్యాచ్‍లు) ఈ మైలురాయి చేరాడు. సచిన్ టెండూల్కర్ 321 ఇన్నింగ్స్‌లో 13వేల పరుగుల మార్క్ చేరగా.. విరాట్ 267వ ఇన్నింగ్స్‌లోనే చేరాడు. దీంతో వన్డేల్లో అత్యంత వేగంగా 13వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా సచిన్ రికార్డును బద్దలుకొట్టి చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ.
అలాగే, ఈ మ్యాచ్‍లో శతకం చేసి అదరగొట్టాడు కోహ్లీ. వన్డేల్లో 47వ శతకం నమోదు చేశాడు. ఓవరాల్‍గా 77వ అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేశాడు.
శతకాలతో రఫ్ఫాడించిన కోహ్లీ, రాహుల్
24.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసిన సమయంలో వర్షం పడటంతో ఆదివారం ఆట నిలువగా.. రిజర్వ్ డే అయిన నేడు (సెప్టెంబర్ 11, సోమవారం) అక్కడి నుంచే బ్యాటింగ్ కొనసాగించింది భారత్. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ, 17 రన్స్ రాహుల్ బ్యాటింగ్ కొనసాగించారు. నేడు ఆరంభంలో ఆచితూచి ఆడిన వారిద్దరూ ఆ తర్వాత దుమ్మురేపారు. రాహుల్ దూకుడుగా ఆడగా.. కోహ్లీ కాసేపు అతడికి స్ట్రైక్ ఎక్కువగా ఇచ్చాడు. ఈ క్రమంలో 60 బంతుల్లో రాహుల్ అర్ధ శతకానికి చేరాడు. కోహ్లీ 55 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఆ ఇద్దరూ గేర్ మార్చి బౌండరీల మోత మోగించారు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపారు. దీంతో 45 ఓవర్లలోనే భారత్ స్కోరు 300 పరుగులు దాటింది. ఇక కేఎల్ రాహుల్ 100 బంతుల్లోనే శతకం చేరాడు. ఇక హిట్టింగ్ ధాటి పెంచిన కోహ్లీ 84 బంతుల్లోనే సెంచరీకి చేరాడు. తన మార్క్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. చివరి వరకు వీరు దూకుడుగా ఆడటంతో టీమిండియా 50 ఓవర్లలో 356 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. పాకిస్థాన్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఇక నేడు 25.5 ఓవర్లు వేసిన పాకిస్థాన్ బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. విరాట్, రాహుల్ బాదుడుకు షహిన్, షాదాబ్ సహా పాక్ బౌలర్లు బెంబేలెత్తారు. హరిస్ రావూఫ్‍కు గాయమవడం కూడా పాక్‍కు ఎదురుదెబ్బగా మారింది.