Gambhir on Kohli: కోహ్లి చాలా గొప్ప పని చేశాడు.. ఇక నుంచీ అందరూ అతన్ని ఫాలో అవుతారు: గంభీర్
12 October 2023, 16:02 IST
- Gambhir on Kohli: కోహ్లి చాలా గొప్ప పని చేశాడు.. ఇక నుంచీ అందరూ అతన్ని ఫాలో అవుతారు అని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అనడం విశేషం. ఎప్పుడూ అతన్ని విమర్శించే గౌతీ.. నవీనుల్ హక్ విషయంలో కోహ్లి చేసిన పనిని మెచ్చుకున్నాడు.
నవ్వుతూ మాట్లాడుకుంటున్న నవీనుల్ హక్, విరాట్ కోహ్లి
Gambhir on Kohli: కోహ్లి, గంభీర్.. ఉప్పు, నిప్పుల్లా ఉంటారు. క్రికెట్ ఫీల్డ్ లో పదేళ్ల కిందట మొదలైన వీళ్ల గొడవ కొనసాగుతూనే ఉంది. అయితే అప్పుడప్పుడూ విరాట్ కోహ్లిని మెచ్చుకుంటూ గంభీర్ చేసే కామెంట్స్ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ లో నవీనుల్ హక్ విషయంలో కోహ్లి చేసిన పనిని కూడా గంభీర్ ఆకాశానికెత్తాడు.
ఐపీఎల్లో కోహ్లి, నవీనుల్ హక్ మధ్య గొడవ జరిగిన విషయం తెలుసు కదా. ఆ మ్యాచ్ లో నవీన్ ఆడిన లక్నో టీమ్ కు గంభీరే మెంటార్ కావడంతో అతనితోనూ కోహ్లి గొడవ పడ్డాడు. అయితే తాజాగా ఈ గొడవను గుర్తు చేసుకుంటూ ఆఫ్ఘన్ బౌలర్ అయిన నవీనుల్ హక్ ను స్టేడియంలో ప్రేక్షకులు హేళన చేయడం మొదలుపెట్టారు. దీంతో అలా చేయొద్దంటూ కోహ్లి వాళ్లను వారించాడు.
ఇది అభిమానులనే కాదు గంభీర్ మనసు కూడా గెలుచుకుంది. "కోహ్లి గొప్ప పని చేశాడు. ఇక నుంచి రానున్న మ్యాచ్ లలో ప్రతి ఒక్కరూ కోహ్లి చేసిన పనిని గుర్తంచుకుంటారు. ఎందుకంటే ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ దేశానికైనా, ఐపీఎల్లో అయినా ఆడటానికి చాలా కష్టపడతాడు" అని బ్రాడ్‌కాస్టర్ తో మాట్లాడుతూ గంభీర్ అన్నాడు.
"ఎవరికీ సపోర్ట్ చేయకపోతే ఎవరినీ విమర్శించకండి. మీ ఫేవరెట్ ప్లేయర్ కు మద్దతిచ్చే హక్కు మీకుంది. కానీ మరో ప్లేయర్ ను విమర్శించే హక్కు మీకు లేదు. అభిమానులు స్పందించిన తీరు బాలేదు. ఆ రోజు వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో వీళ్లలో ఎవరికీ తెలియదు. ఆ ఇద్దరు ప్లేయర్స్, టీమ్ మేనేజ్‌మెంట్స్ కే అది తెలుసు.
రానున్న రోజుల్లో అభిమానులు మంచిగా ప్రవర్తిస్తారని అనుకుంటున్నా. వాళ్లు మన దేశానికి ఆడటానికి వస్తున్నారు. మనం మంచి అథితులుగా మంచి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలి. ఇక్కడికి వచ్చే ప్లేయర్స్ మంచి జ్ఞాపకాలనే మోసుకెళ్లాలి" అని గంభీర్ స్పష్టం చేశాడు.
ఈ మ్యాచ్ తర్వాత కోహ్లి, నవీనుల్ నవ్వుతూ ఒకరితో ఒకరు మాట్లాడుతూ కనిపించారు. మరోవైపు నవీనుల్ హక్ ను గంభీర్ కూడా కలిశాడు. అతనితో కలిసి ఫొటోలు దిగాడు. కోహ్లి, నవీన్ నవ్వుతూ మాట్లాడుకోవడం అభిమానులకు బాగా నచ్చింది. చప్పట్లు, కేరింతలతో వాళ్లను అభినందించారు.