Gambhir on Dhoni: ఆ విషయంలో ధోనీకి భవిష్యత్తులోనూ ఎవరూ సరితూగలేరు: మహీపై మరోసారి గంభీర్ పొగడ్తల వర్షం-no one can match ms dhoni captaincy in indian cricket says gautam gambhir ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gambhir On Dhoni: ఆ విషయంలో ధోనీకి భవిష్యత్తులోనూ ఎవరూ సరితూగలేరు: మహీపై మరోసారి గంభీర్ పొగడ్తల వర్షం

Gambhir on Dhoni: ఆ విషయంలో ధోనీకి భవిష్యత్తులోనూ ఎవరూ సరితూగలేరు: మహీపై మరోసారి గంభీర్ పొగడ్తల వర్షం

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 29, 2023 10:16 PM IST

Gautam Gambhir on MS Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‍పై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెనీ విషయంలో మహీని ఆకాశానికి ఎత్తేశాడు. ఆ వివరాలివే..

గౌతమ్ గంభీర్ (Photo: Star Sports)
గౌతమ్ గంభీర్ (Photo: Star Sports)

Gautam Gambhir on MS Dhoni: ఒకప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై పలుసార్లు విమర్శలు చేసిన భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇటీవల కాస్త రూటు మార్చాడు. తరచూ ధోనీని ప్రశంసిస్తున్నాడు. జట్టు కోసం బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానాన్ని మహీ త్యాగం చేశాడని ఇటీవల గంభీర్ అన్నాడు. జట్టు కోసం రికార్డులను ధోనీ పట్టించుకోలేదని పొగిడాడు. ఇప్పుడు మరోసారి ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు గౌతమ్ గంభీర్. కెప్టెన్సీ రికార్డుల విషయంలో భారత క్రికెట్‍లో ఎంఎస్ ధోనీకి ఎవరూ సరితూగలేరని గంభీర్ అన్నాడు. మరిన్ని కామెంట్లు చేశాడు.

ధోనీ కెప్టెన్సీలో భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలను గెలిచిందని, కెప్టెన్‍గా ఇంత కంటే ఘనతను భారత క్రికెట్‍లో ఎవరూ సాధించలేరని తాను అనుకుంటున్నానని గంభీర్ చెప్పాడు. ధోనీ గురించి స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసిన వీడియోలో గంభీర్ ఈ మాటలు చెప్పాడు.

“చాలా మంది కెప్టెన్లు వస్తున్నారు. వెళుతున్నారు. ధోనీ కెప్టెన్సీ, కెప్టెన్సీ రికార్డులను భారత క్రికెట్‍లో ఎవరూ సమం చేయలేరని నేను అనుకుంటున్నా. టెస్టుల్లో నంబర్ వన్ కావొచ్చు.. విదేశాల్లో సిరీస్‍లు గెలవొచ్చు. కానీ మూడు ఐసీసీ ట్రోఫీలు.. అందులో రెండు ప్రపంచకప్‍లు, ఓ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలు ధోనీకి ఉన్నాయి. ఇంతకంటే గొప్ప విజయాలు ఏవీ ఉండవు” అని గంభీర్ చెప్పాడు. మొత్తంగా భారత క్రికెట్‍లో భవిష్యత్తులోనూ ధోనీ కెప్టెన్సీ రికార్డులను ఎవరూ సమం కూడా చేయలేకపోవచ్చని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్‍ టైటిల్‍ను కైవసం చేసుకుంది. అప్పుడు పాకిస్థాన్‍పై ఫైనల్‍లో అర్ధ శతకం చేసి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు గంభీర్. ధోనీ సారథ్యంలో భారత్ 2011 వన్డే ప్రపంచకప్‍ను భారత్ దక్కించుకుంది. 2011 వరల్డ్ కప్ ఫైనల్‍లోనూ 97 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు గంభీర్. 2013లో ధోనీ సారథ్యంలోని టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. ఇక ధోనీ తర్వాత మరే కెప్టెన్ కూడా భారత్‍కు ఐసీసీ ట్రోఫీని గెలువలేకపోయారు. అంతర్జాతీయ క్రికెట్‍కు 2020లో గుడ్‍బై చెప్పాడు ధోనీ.

కాగా, ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. దీంతో టీమిండియా హాట్ ఫేవరెట్‍గా ఉంది. రోహిత్‍సేన ఈ సారి వరల్డ్ కప్ గెలుస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి.

Whats_app_banner