Gambhir on Dhoni: నేను, ధోనీ కాదు.. హర్భజన్ గెలిపించాడు: గంభీర్ షాకింగ్ కామెంట్స్‌పై ఫ్యాన్స్ సీరియస్
04 September 2023, 14:31 IST
- Gambhir on Dhoni: నేను, ధోనీ కాదు.. హర్భజన్ గెలిపించాడు అంటూ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేయడంపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ధోనీ విషయంలో అలా, భజ్జీ విషయంలో ఇలా మాట్లాడతావా అంటూ గంభీర్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
గౌతమ్ గంభీర్, ఎమ్మెస్ ధోనీ
Gambhir on Dhoni: 2011 వరల్డ్ కప్ విషయంలో ఎన్నోసార్లు గంభీర్ ఎలా స్పందించాడో మనం చూశాం. ఆ వరల్డ్ కప్ ఇండియా గెలవడంలో క్రెడిట్ అంతా ధోనీకే ఇస్తున్నారంటూ అతడు తరచూ తన అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడు. చివర్లో ఓ సిక్స్ కొట్టి గెలిపిస్తే దాని గురించే మాట్లాడుకుంటారా.. అసలు గెలిపించింది యువరాజ్ కదా అని గంభీర్ చాలాసార్లు అన్నాడు.
కానీ ఇప్పుడు మరో మ్యాచ్ విషయంలో మాత్రం చివర్లో రన్స్ చేసిన వాళ్లే గెలిపించినట్లు అని గంభీర్ అనడం అభిమానులను షాక్ కు గురి చేసింది. ధోనీ విషయంలో అలా.. ఇప్పుడిలా మాట్లాడతావా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా 2010లో ఈ రెండు టీమ్స్ మధ్యే జరిగిన మ్యాచ్ గురించి ప్రస్తావన వచ్చింది.
ఆ మ్యాచ్ లో 268 రన్స్ చేజ్ చేసి ఇండియా గెలిచింది. ఆ విజయంలో ధోనీ, గంభీర్ భాగస్వామ్యం కీలకపాత్ర పోషించింది. సచిన్, సెహ్వాగ్ వికెట్లను త్వరగా కోల్పోయిన ఇండియాను 102 పరుగుల భాగస్వామ్యంతో ఈ ఇద్దరూ ఆదుకున్నారు. ఈ మ్యాచ్ స్కోరుకార్డును చూపించగా.. ఆ మ్యాచ్ ను తాను, ధోనీ గెలిపించలేదని, హర్భజన్ గెలిపించాడని అనడం విశేషం.
"నేను గెలిపించలేదు హర్భజన్ సింగ్ గెలిపించాడు. నేను, ధోనీ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. కానీ చివర్లో రన్స్ చేసిన వాళ్లే టీమ్ ను గెలిపించినట్లు. ఆ మ్యాచ్ లో షోయబ్ అక్తర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. వెలుతురు సరిగా లేదు" అంటూ గంభీర్ చెబుతూ వెళ్లాడు. గంభీర్ చేసిన ఈ కామెంట్స్ చూసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు.
మరి 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ చేసింది కూడా ఇదే కదా.. అతడు కీలక ఇన్నింగ్స్ ఆడి 91 రన్స్ చేయడమే కాదు సిక్స్ కొట్టి గెలిపించాడు. కానీ ఆ మ్యాచ్ మాత్రం ధోనీ గెలిపించినట్లు ఎలా అవుతుందని, అతనికి అనవసరంగా క్రికెట్ ఇచ్చారని గంభీర్ అంటున్నాడు. ఈ మ్యాచ్ సందర్భంగానూ అదే విషయాన్ని మరోసారి గంభీర్ చెప్పాడు.
1983లోనూ వరల్డ్ కప్ గెలిచినప్పుడు కపిల్ దేవ్ పేరు ఒక్కటే మార్మోగిపోయిందని, 2007, 2011 వరల్డ్ కప్ లలోనూ అదే జరిగిందని గంభీర్ అన్నాడు. ఇండియాలో మీడియా మొత్తం ఒక వ్యక్తి గురించే మాట్లాడటం తప్ప టీమ్ గురించి మాట్లాడలేదని అతడు అభిప్రాయపడ్డాడు.