Gautam Gambhir Virat Kohli: విరాట్ కోహ్లీపై గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్.. అలానా ఆడేదంటూ!
Gautam Gambhir On Virat Kohli: సెప్టెంబర్ 2న పల్లెకెలెలో జరిగిన ఇండియా-పాకిస్తాన్ ఆసియా కప్ 2023 మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. కానీ, ఈ మ్యాచ్‍లో అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ భారీగా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శలతో అస్త్రాలు సంధించాడు.
IND vs PAK Asia Cup 2023: ఎంతగానో ఎదురుచూసిన ఆసియా కప్ 2023 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంక లోని పల్లెకెలెలో శనివారం నాడు ఇంట్రెస్టింగ్‍గా సాగింది. భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగలు చేసి ఆలౌట్ అయింది. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది. దీంతో పాకిస్థాన్ సూపర్ ఫోర్‍లోకి చేరింది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‍కు వరుణుడు ఇబ్బంది కలిగించాడు. అప్పటివరకు మెరుపు వేగంతో ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వర్షంతో వచ్చిన బ్రేక్ తర్వాత ఘోరంగా విఫలమయ్యారు.
భారీ మూల్యం
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది చేతిలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ క్లీన్ బౌల్డ్ అయి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. రోహిత్, విరాట్ ఇలా ఒకేసారి బౌల్డ్ అవడం ఇదే తొలిసారి. అయితే గత మ్యాచ్‍లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‍పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శలు ఎక్కుపెట్టాడు. చెత్త షాట్ సెలక్షన్‍తో విరాట్ భారీ మూల్యం చెల్లించుకున్నాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. షాహీన్ ఆఫ్రిది వంటి బౌలింగ్‍లో జాగ్రత్తగా ఆడాలిగా అంటూ చురకలు అంటించాడు.
పాక్-ఇండియా ఆసియా కప్ 2023 మ్యాచ్ తర్వాత కామెంటేటర్లు గంభీర్, వకార్ యూనిస్, మాథ్యూ హెడెన్ మధ్య రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటతీరుపై ఆసక్తికర డిబెట్ సాగింది. షాహీన్ షా వేసిన అద్భుతమైన బాల్‍కు రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. కానీ కోహ్లీ మాత్రం రాంగ్ సెలక్షన్‍తో దెబ్బతిన్నాడు అని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు.
ఆ క్లారిటీ లేదా
"అసలు అది ఏం షాట్?. ఫార్వర్డ్ కాదు. బ్యాక్ కాదు. సాధారణ షాట్. షాహీన్షా ఆఫ్రిది బౌలింగ్‍లో ఇలాగేనా ఆడేది? ఫార్వర్డ్ షాట్ ఆడాలా, లేదంటే వెనక్కి వెళ్లాలా అనే విషయంలో ఆ మాత్రం క్లారిటీ లేదా?" అని విరాట్ కోహ్లీపై గౌతమ్ గంభీర్ విరుచుకుపడ్డాడు. వకార్ యూనిస్ మాత్రం అది దురదృష్టవశాత్తు విరాట్ కోహ్లీ బౌల్డ్ అయ్యాడని, ఏది ఏమైనా ఆఫ్రిది అద్భుతంగా బౌలింగ్ చేశాడని తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో వకార్ యూనిస్‍తో హెడెన్ ఏకీభవించాడు.
ఇదిలా ఉంటే షాహీన్ షా వేసిన బంతిని థర్డ్ మ్యాన్ దిశగా తరలించే క్రమంలో విరాట్ కోహ్లీ ఫ్లిక్ చేయగా.. ఇన్‍సైడ్ ఎడ్జ్ తీసుకున్న బాల్ స్టంప్స్ ను తాకింది. దీంతో విరాట్ కోహ్లీ 4 పరుగుల వ్యక్కిగత స్కోర్ వద్ద పెవిలియన్‍కు చేరాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 11, శుభ్‍మన్ గిల్ 10, శ్రేయస్ అయ్యర్ 14 పరుగులు చేశారు. 66 రన్స్ కే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఇషాన్ కిషన్ (82), హార్ధిక్ పాండ్యా (87) ఆదుకున్నారు.