Ben Stokes: డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కు గట్టి దెబ్బ.. టీ20 వరల్డ్ కప్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ ఔట్
02 April 2024, 16:19 IST
- Ben Stokes: డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఆ టీమ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ టీ20 వరల్డ్ కప్ నుంచి దూరమవుతున్న అనౌన్స్ చేసి ఆ టీమ్ సెలెక్టర్లకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టాడు.
టీ20 వరల్డ్ కప్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఔట్
Ben Stokes: ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తాను టీ20 వరల్డ్ కప్ 2024 ఆడటం లేదని స్పష్టం చేశాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు వెల్లడించాడు. 2022లో ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్.. ఇప్పుడు టైటిల్ డిఫెన్స్ కు లేకపోవడం ఆ టీమ్ కు మింగుడు పడనిదే.
ఇంగ్లండ్‌కు బెన్ స్టోక్స్ షాక్
డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో టీ20 వరల్డ్ కప్ 2024 బరిలోకి దిగబోతోంది ఇంగ్లండ్ టీమ్. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్ లో ఫైనల్లో పాకిస్థాన్ పై ఇంగ్లిష్ టీమ్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ ఫైనల్లో బెన్ స్టోక్సే 52 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఇప్పుడు తనకు తానుగానే ఫిట్‌నెస్ కారణాలు చెబుతూ ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ నుంచి అతడు తప్పుకున్నాడు.
స్టోక్స్ స్థానంలో అలాంటి ప్లేయర్ ను ఎంపిక చేయడం ఇంగ్లండ్ సెలెక్టర్లకు పెద్ద తలనొప్పే అని చెప్పాలి. గతేడాది తన మోకాలి గాయానికి సర్జరీ వాయిదా వేసి, వన్డే రిటైర్మెంట్ కు గుడ్ బై చెప్పి ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ ఆడాడు స్టోక్స్. అయితే ఆ మెగా టోర్నీలో ఇంగ్లండ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. దీంతో నవంబర్ లో స్టోక్స్ మోకాలి సర్జరీ చేయించుకున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ నుంచి కూడా అతడు తప్పుకున్నాడు. తన పనిభారాన్ని తగ్గించుకోవడంతో ఫిట్‌నెస్ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పి షాకిచ్చాడు.
ఆల్ రౌండర్ పాత్ర కోసమే..
రాబోయే భవిష్యత్తులో తాను కోరుకుంటున్న పూర్తిస్థాయి ఆల్ రౌండర్ పాత్రను సమర్థవంతంగా పోషించడానికే ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నానని.. ఇది తాను చేసే త్యాగమని స్టోక్స్ చెప్పడం విశేషం. ఈ మధ్యే స్టోక్స్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ టీమిండియా చేతుల్లో దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ లో 1-4 తేడాతో ఇంగ్లండ్ ఓడింది.
తన నిర్ణయంపై స్టోక్స్ మంగళవారం (ఏప్రిల్ 2) స్పందించాడు. "క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలోనూ ఆల్ రౌండర్ గా నా పూర్తిస్థాయి పాత్రను సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా నేను నా బౌలింగ్ ఫిట్‌నెస్ పై దృష్టి సారిస్తున్నాను. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడం ఓ త్యాగంలాంటిదే. ఈ త్యాగం నేను భవిష్యత్తులో కావాలని అనుకుంటున్న పూర్తిస్థాయి ఆల్ రౌండర్ ను తెరపైకి తెస్తుందని ఆశిస్తున్నాను" అని స్టోక్స్ అన్నాడు.
టీ20 వరల్డ్ కప్ 2024 ఈ ఏడాది జూన్ 1 నుంచి జూన్ 29 వరకు కరీబియన్ దీవులు, అమెరికాలో జరగనున్న విషయం తెలిసిందే. దీనికోసం వచ్చే నెల మొదట్లోనే జట్లను ప్రకటించాల్సి ఉంది.