Djokovic to Kohli: ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్న కోహ్లి, జోకొవిచ్ ఫ్రెండ్‌షిప్ మెసేజెస్
15 January 2024, 11:38 IST
- Djokovic to Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జోకొవిచ్ మధ్య నడుస్తున్న ఫ్రెండ్షిప్ మెసేజెస్ ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తున్నాయి. ఇద్దరం కలిసి ఆడే రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు తాజాగా జోకొవిచ్ ట్వీట్ చేశాడు.
నొవాక్ జోకొవిచ్, విరాట్ కోహ్లి
Djokovic to Kohli: విరాట్ కోహ్లి, జోకొవిచ్ మధ్య రెండు రోజులుగా మెసేజ్‌లు ఎక్స్‌ఛేంజ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం సిద్ధమవుతున్న నొవాక్ గురించి ఈ మధ్యే కోహ్లి మాట్లాడిన వీడియో వైరల్ అయింది. గత కొన్నేళ్లుగా ఇద్దరం మాట్లాడుకుంటున్నామని, అయితే ఎప్పుడూ కలవలేదని అంటున్న ఆ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.
అందులో అసలు తమ ఇద్దరి మధ్య పరిచయం ఎలా మొదలైందో విరాట్ కోహ్లి చెప్పాడు. కొన్నేళ్ల కిందట తాను ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు జోకొవిచ్ ప్రొఫైల్ చూశానని, అప్పుడే అతనికి వ్యక్తిగతంగా మెసేజ్ చేసినట్లు తెలిపాడు. అది చూసి నొవాక్ కూడా రిప్లై ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందని, అప్పటి నుంచీ ఇద్దరి మధ్య మెసేజ్ లు నడుస్తున్నట్లు చెప్పాడు.
కలిసి ఆడదాం: జోకొవిచ్
బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో కోహ్లి తన గురించి చేసిన కామెంట్స్ చూసిన జోకొవిచ్.. సోషల్ మీడియా ఎక్స్ ద్వారా స్పందించాడు. విరాట్ కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. "విరాట్ కోహ్లి.. నా గురించి ఈ మాటలు చెప్పినందుకు థ్యాంక్స్. మనం ఇద్దరం కలిసి ఆడే రోజు కోసం ఎదురు చూస్తున్నాం" అని జోకొవిచ్ ట్వీట్ చేయడం విశేషం.
అయితే అతడు కలిసి ఆడదాం అన్నది క్రికెటా లేక టెన్నిసా అన్నది మాత్రం చెప్పలేదు. నిజానికి తాను, కోహ్లి కొన్నేళ్లుగా మెసేజ్‌లు చేసుకుంటున్న విషయాన్ని జోకొవిచే ఈ మధ్య చెప్పాడు. ఫోన్లలో మెసేజ్ లు చేసుకుంటున్నా వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని అన్నాడు. దీనిపై కోహ్లి స్పందిస్తున్న వీడియోను ఆఫ్ఘనిస్థాన్ తో టీమిండియా రెండో టీ20కి ముందు బీసీసీఐ షేర్ చేసింది.
"నేను నొవాక్ తో టచ్ లోకి రావడం అనుకోకుండా జరిగిపోయింది. ఇన్‌స్టాలో నేను అతని ప్రొఫైల్ చూస్తున్నప్పుడు నొవాక్ కు మెసేజ్ చేశాను. ఏదో అలా హలో చెప్పాలని అనుకున్నాను. ఆ వెంటనే అతని నుంచి రెస్పాన్స్ వచ్చింది.
మొదట అతడేనా లేక ఫేక్ ప్రొఫైల్ నుంచి వచ్చిందా అనుకున్నాను కానీ అది అతడే. అప్పటి నుంచీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. నేను 50వ సెంచరీ చేసినప్పుడు కూడా అతడు తన ఇన్‌స్టా స్టోరీలో అభినందనలు తెలిపాడు" అని జోకొవిచ్ గురించి కోహ్లి చెప్పాడు.
నొవాక్ జోకొవిచ్ ఓవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్ తో బిజీగా ఉండగా.. కోహ్లి ఆఫ్ఘనిస్థాన్ తో టీ20 సిరీస్ ఆడుతున్నాడు. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్ ఆడిన కోహ్లి 16 బంతుల్లో 29 రన్స్ చేశాడు. అటు జోకొవిచ్ కూడా తొలి రౌండ్ లో గెలిచి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు.
కోహ్లి, జోకొవిచ్ ఇద్దరూ వాళ్ల స్పోర్ట్స్ లో లెజెండ్సే. 24 గ్రాండ్‌స్లామ్స్ తో జోకొవిచ్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటే.. ఇటు కోహ్లి వన్డే క్రికెట్ లో 50వ సెంచరీతో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఇద్దరు టాప్ ప్లేయర్స్ ఇలా ఒకరినొకరు ప్రశంసించుకోవడం నిజంగా విశేషమే.