Djokovic wins US Open 2023: టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన జోకొవిచ్.. యూఎస్ ఓపెన్ గెలిచిన సెర్బియన్ సెన్సేషన్-djokovic wins us open 2023 title his 24th grand slam title ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Djokovic Wins Us Open 2023: టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన జోకొవిచ్.. యూఎస్ ఓపెన్ గెలిచిన సెర్బియన్ సెన్సేషన్

Djokovic wins US Open 2023: టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన జోకొవిచ్.. యూఎస్ ఓపెన్ గెలిచిన సెర్బియన్ సెన్సేషన్

Hari Prasad S HT Telugu
Sep 11, 2023 07:51 AM IST

Djokovic wins US Open 2023: టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు నొవాక్ జోకొవిచ్. ఆదివారం రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్ గెలిచిన ఈ సెర్బియన్ సెన్సేషన్ తన కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు.

యూఎస్ ఓపెన్ గెలిచిన తర్వాత నొవాక్ జోకొవిచ్
యూఎస్ ఓపెన్ గెలిచిన తర్వాత నొవాక్ జోకొవిచ్ (REUTERS)

Djokovic wins US Open 2023: టెన్నిస్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు సెర్బియన్ సెన్సేషన్ నొవాక్ జోకొవిచ్. రష్యన్ ప్రత్యర్థి మెద్వెదెవ్ పై ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు యూఎస్ ఓపెన్ 2023 టైటిల్ గెలిచి ఓ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. 1968లో టెన్నిస్ ఓపెన్ ఎరా ప్రారంభమైన తర్వాత అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన రికార్డును సమం చేశాడు.

జోకొవిచ్ కు కెరీర్లో ఇది 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఈ క్రమంలో అతడు లెజెండరీ ప్లేయర్ సెరెనా విలియమ్స్ ను మించిపోగా.. 24 టైటిల్స్ తో ఉన్న మార్గరెట్ కోర్ట్ ను సమం చేశాడు. అయితే ఆమె గెలిచిన 24 టైటిల్స్ లో 13 ఓపెన్ ఎరా కంటే ముందే ఉన్నాయి. ఇక జోకొవిచ్ కు ఇది నాలుగో యూఎస్ ఓపెన్ టైటిల్. ఆదివారం (సెప్టెంబర్ 10) రాత్రి జరిగిన ఫైనల్లో మెద్వెదెవ్ పై అతడు 6-3, 7-6, 6-3తో వరుస సెట్లలో గెలిచాడు.

ప్రతీకారం తీర్చుకున్న జోకొవిచ్

రెండేళ్ల కిందట కూడా యూఎస్ ఓపెన్ గెలిచి 1969లో రాడ్ లేవర్ తర్వాత కేలండర్ గ్రాండ్‌స్లామ్ గెలిచిన ప్లేయర్ గా నిలవాలనుకున్న జోకొవిచ్ కు ఇదే మెద్వెదెవ్ షాకిచ్చాడు. ఆ ఏడాది ఫైనల్లో నొవాక్ ను మెద్వెదెవ్ ఓడించి తన కెరీర్లో తొలి మేజర్ టైటిల్ గెలిచాడు. ఇప్పుడా పరాజయానికి జోకొవిచ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ ఫైనల్లో జోకర్ కాస్త అసౌకర్యంగానే కనిపించినా.. తనకు మాత్రమే సాధ్యమైన పోరాట స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించాడు.

గతేడాది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఈ గ్రాండ్‌స్లామ్ కు దూరమైన అతడు.. ఈసారి చెలరేగిపోయాడు. రెండు నెలల కిందట వింబుల్డన్ ఫైనల్లో అల్కరాజ్ చేతుల్లో ఓటమితో కన్నీళ్లపర్యంతం అయిన జోకొవిచ్.. యూఎస్ ఓపెన్ లో ఆ అవకాశం ఇవ్వలేదు. హోరాహోరీగా జరిగిన రెండో సెట్లో మాత్రం అతడు ఇబ్బంది పడ్డాడు.

ప్రతి సుదీర్ఘ ర్యాలీ తర్వాత జోకొవిచ్ నేలపై పడిపోయాడు. అయినా పుంజుకొని మూడో సెట్లో సులువుగా మెద్వెదెవ్ ను బోల్తా కొట్టించాడు. ఒక ఏడాదిలో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడం జోకొవిచ్ కు ఇది నాలుగోసారి. గతంలో 2011, 2015, 2021లలోనూ మూడేసి గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు. అయితే కేలండర్ గ్రాండ్‌స్లామ్ కల మాత్రం అలాగే మిగిలిపోయింది. సోమవారం (సెప్టెంబర్ 11) జోకొవిచ్ మరోసారి నంబర్ వన్ ర్యాంకు అందుకోబోతున్నాడు.

Whats_app_banner