Virat Kohli Holiday Home: అలీబాగ్‌లోని విరాట్ కోహ్లి హాలీడే హోమ్ ఎంత అద్భుతంగా ఉందో చూశారా.. వీడియో
Virat Kohli Holiday Home: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ మహారాష్ట్రలోని అలీబాగ్ లో ఎంతో ముచ్చటపడి తమ హాలీడే హోమ్ కట్టించుకున్నారు. ఎంతో విలాసవంతంగా ఉన్న తన ఇంటిని చూపిస్తూ కోహ్లి ఓ వీడియో షేర్ చేశాడు.
Virat Kohli Holiday Home: క్రికెటర్లు, బాలీవుడ్ తారలు హాలీడే ఎంజాయ్ చేయడానికి మహారాష్ట్రలోని అలీబాగ్ వైపే చూస్తారు. ఇప్పటికే ఎంతో మందికి అక్కడ ఫామ్ హౌజ్‌లు, విల్లాలు ఉన్నాయి. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ కూడా ఈ మధ్యే ఇక్కడ ఓ విలాసవంతమైన ఇల్లు కట్టించుకున్నారు.
తాజాగా విరాట్ కోహ్లి తన హాలీడే హోమ్ చూపించాడు. బుధవారం (జనవరి 10) ఇన్‌స్టాగ్రామ్ లో కోహ్లి ఓ వీడియో షేర్ చేశాడు. అందులో అలీబాగ్ లోని తన విలాసవంతమైన ఇంటిని మనం చూడొచ్చు. ఈ సెలబ్రిటీ కపుల్ ఎంతో ముచ్చటపడి, తమకు టేస్ట్ కు తగినట్లుగా ఈ హాలీడే హోమ్ ను కట్టించుకున్నారు. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు ఓ ఇంద్రభవనంలా కనిపిస్తోంది.
కోహ్లి అలీబాగ్ ఇల్లు ఇదే..
విరాట్ కోహ్లి తానే ఈ ఇంటిని చూపిస్తూ ప్రత్యేకంగా వీడియో రూపొందించాడు. "బాగ్‌లో 2024ను మొదలు పెడుతున్నాను. అలీబాగ్ లోని ఆవాస్ లివింగ్ లో ఉన్న ఉన్న నా హాలీడే హోమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ నా ఒయాసిస్ అంతా మీకు చూపించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను" అనే క్యాప్షన్ తో ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ లో కోహ్లి షేర్ చేశాడు.
ఇందులో తన లివింగ్ రూమ్ నుంచి బెడ్ రూమ్ వరకూ ఇల్లు మొత్తం తిరుగుతూ చూపించాడు. హాలీడే హోమ్ అంటే బిజీ షెడ్యూల్ నుంచి రిలాక్స్ అవడానికి వచ్చే ఇల్లు అని, అందుకే అందుకు తగినట్లుగానే ఈ ఇల్లు కట్టించుకున్నట్లు విరాట్ చెప్పాడు. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాలిఫోర్నియన్ కొంకణ్ స్టైల్లో ఈ ఫోర్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించారు.
హాలీడే హోమ్ అంటే ఓ ఇల్లు కాని ఇల్లులా అనిపించాలి అని వీడియోలో కోహ్లి చెప్పడం చూడొచ్చు. లివింగ్ రూమ్ పరిచయం చేయడంతో కోహ్లి ఈ వీడియో మొదలుపెట్టాడు. అక్కడ ఎలాంటి టీవీలు, ఇతర ఎంటర్‌టైన్మెంట్ గాడ్జెట్స్ లేకపోవడాన్ని కోహ్లి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఫ్యామిలీతో కబుర్లు చెప్పుకుంటూ గడపాలన్నదే తన ఉద్దేశమని అన్నాడు.
ఇక తనకు ఫ్యామిలీ అంతా కూర్చొని భోజనం చేయడం బాగా అనిపిస్తుందని, తన చిన్నతనంలో ఆ అవకాశం తనకు ఎక్కువగా దక్కలేదని గుర్తు చేసుకున్నాడు. అందుకే ఈ హాలీడే హోమ్ లో డైనింగ్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పాడు. అలాగే ఇంటి బయట ఉన్న లాన్, బెడ్ రూమ్.. అన్నీ తిప్పి చూపించాడు. ఉదయాన్నే లాన్ లో ఉన్న డైనింగ్ టేబుల్ పై కూర్చొని కాఫీ తాగుతూ తన రోజును ప్రారంభించడం చాలా బాగా ఉంటుందని కోహ్లి చెప్పాడు.
ఇక ఈ లగ్జరీ ఇంటి మొత్తాన్నీ ఆటోమేట్ చేసేశారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ తో ఇంట్లోని కర్టెయిన్లతో సహా అన్నింటినీ కంట్రోల్ చేయొచ్చు. అది ఎలాగో కూడా విరాట్ ఈ వీడియోలో చూపించాడు. సౌతాఫ్రికాతో సిరీస్ ముగియగానే తన హాలీడే హోమ్ కే వెళ్లిన విరాట్.. అక్కడ ఈ వీడియో చేశాడు. ఇక ఈ నెల 11 నుంచి ఆఫ్ఘనిస్థాన్ తో జరగనున్న టీ20 సిరీస్ కోసం తిరిగి టీమ్ తో చేరనున్నాడు. 14 నెలల తర్వాత అతడు అంతర్జాతీయ టీ20 ఆడబోతున్నాడు.