Rishabh Pant: రిషబ్ పంత్‍ను వదిలేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ రెడీ అయిందా? ధోనీకి రీప్లేస్‍మెంట్‍గా..!
20 July 2024, 22:10 IST
- Rishabh Pant: కెప్టెన్ రిషబ్ పంత్‍ను వదులుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ రెడీ అవుతోందని సమాచారం బయటికి వచ్చింది. దీంతో ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ అతడిని దక్కించుకునేందుకు ప్రయత్నించనుందని తెలుస్తోంది.
Rishabh Pant: రిషబ్ పంత్‍ను వదిలేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ రెడీ అయిందా? ధోనీకి రీప్లేస్‍మెంట్‍గా..!
వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‍కు ముందు 10 జట్లలో భారీ మార్పులు రానున్నాయి. ఈ సీజన్‍కు ముందు మెగావేలం జరగనుంది. దీంతో ఎక్కువ మంది ఆటగాళ్లు ఫ్రాంచైజీలు మారనున్నాయి. అయితే ఒక్కో టీమ్ ఎంత మందిని రిటైన్ చేసుకోవచ్చనే నిబంధనలను బీసీసీఐ ఇంకా ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత రానుంది. అయితే, ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు ఓ పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. మాజీ కెప్టెన్, దిగ్గజం ఎంఎస్ ధోనీ వచ్చే ఏడాది సీజన్ ఆడకపోతే అతడికి రిప్లేస్‍మెంట్ ఎవరనే విషయంలో తర్జనభర్జన పడుతోంది. 2025 సీజన్‍ను ధోనీ ఆడకూడదనే భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో రిషభ్ పంత్ పేరును పరిశీలిస్తోందని రిపోర్టులు వస్తున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని ఈ ఏడాది 2024 సీజన్‍లోనే రుతురాజ్ గైక్వాడ్‍కు ఎంఎస్ ధోనీ అప్పగించాడు. ఈ సీజన్‍లో చెన్నై ప్లేఆఫ్స్ చేరకపోయినా.. చివరి వరకు పోరాడి ఐదోస్థానంలో నిలిచింది. అయితే, తనకు సరైన రిప్లేస్‍మెంట్ వచ్చాక ఐపీఎల్‍కు రిటైర్మెంట్ ప్రకటించాలని ధోనీ అనుకుంటున్నట్టుగా రూమర్లు వస్తున్నాయి. రెండేళ్లుగా ధోనీ ఫిట్‍నెస్ అంతంత మాత్రంగానే ఉంటోంది.
పంత్‍ను వదిలే యోచనలో ఢిల్లీ!
భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెప్టెన్సీపై ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం అసంతృప్తితో ఉందని దైనిక్ జాగరణ్ ఓ రిపోర్టులో పేర్కొంది. అందుకే 2025 సీజన్ కోసం పంత్‍ను రిటైన్ చేసుకోకూడదని ఆ జట్టు భావిస్తోందని తెలిపింది. ఆ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ.. పంత్ ఉండాలని అనుకుంటున్నా యాజమాన్యం మాత్రం వద్దంటోందని పేర్కొంది. ఈ ఏడాది ఐపీఎల్‍లో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.
ఢిల్లీ వద్దనుకుంటే.. రంగంలోకి చెన్నై
రిషబ్ పంత్‍ను రిలీజ్ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించుకుంటే ఐపీఎల్ 2025 సీజన్ కోసం రిషబ్ పంత్‍ను తీసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ఆలోచిస్తోంది. వేలంలోకి వెళ్లకుండానే ఢిల్లీతో పంత్‍ను చెన్నై ట్రేడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి.
ధోనీకి ఇప్పుడున్న సరైన రిప్లేస్‍మెంట్ రిషబ్ పంతేనని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం భావిస్తోందని తెలుస్తోంది. ఒకవేళ ధోనీ ఇక ఆడడం చాలనుకుంటే.. భారత టాప్ వికెట్ కీపర్ కోసం తమ జట్టు ప్రయత్నిస్తుందని చెన్నై ఫ్రాంచైజీ వర్గాలు చెప్పినట్టు ఆ రిపోర్ట్ వెల్లడించింది.
ఇటీవలే పాంటింగ్‍కు గుడ్‍బై
హెడ్ కోచ్ స్థానం నుంచి ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్‍ను ఇటీవలే తప్పించింది ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‍మెంట్. ఏడు సీజన్లు ఆ జట్టుతో ఉన్న రికీ ఎట్టకేలకు వైదొలిగాడు. దీంతో 2025 సీజన్ కోసం చాలా మార్పులు చేసేందుకు సిద్ధమయ్యామని ఢిల్లీ జట్టు సంకేతాలు ఇచ్చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్‍లో ఒక్కసారి కూడా టైటిల్ గెలువలేదు ఢిల్లీ. గత మూడు సీజన్లలో ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయింది.
ఐపీఎల్ 2025 సీజన్ కోసం మెగావేలం నిర్వహణ, నిబంధనలపై ఈనెలాఖరులో 10 ఫ్రాంచైజీలతో బీసీసీఐ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో ఫ్రాంచైజీ ఎంత మంది ఆటగాళ్లను రిటైన చేసుకోవచ్చనే విషయంపై ఈ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
టాపిక్