తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Csk Vs Srh: కాస్తలో సెంచరీ మిస్ చేసుకున్న రుతురాజ్.. మళ్లీ దూబే మెరుపులు.. చెన్నై భారీ స్కోర్

CSK vs SRH: కాస్తలో సెంచరీ మిస్ చేసుకున్న రుతురాజ్.. మళ్లీ దూబే మెరుపులు.. చెన్నై భారీ స్కోర్

28 April 2024, 21:59 IST

google News
    • CSK vs SRH IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. మొత్తంగా సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో మ్యాచ్‍లో చెన్నై భారీ స్కోరు చేసింది.
CSK vs SRH: కాస్తలో సెంచరీ మిస్ చేసుకున్న రుతురాజ్.. మళ్లీ దూబే మెరుపులు.. చెన్నై భారీ స్కోర్
CSK vs SRH: కాస్తలో సెంచరీ మిస్ చేసుకున్న రుతురాజ్.. మళ్లీ దూబే మెరుపులు.. చెన్నై భారీ స్కోర్ (AP)

CSK vs SRH: కాస్తలో సెంచరీ మిస్ చేసుకున్న రుతురాజ్.. మళ్లీ దూబే మెరుపులు.. చెన్నై భారీ స్కోర్

CSK vs SRH IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి సత్తాచాటాడు. గత మ్యాచ్‍లో లక్నోపై సెంచరీతో దుమ్మురేపిన రుతురాజ్.. నేడు (ఏప్రిల్ 28) సన్‍రైజర్స్ హైదరాబాద్‍పై మరోసారి రెచ్చిపోయాడు. అయితే, సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. చెన్నైలోని చెపాక్ వేదికగా సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో నేటి మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు చేసింది.

టాస్ గెలిచి ఈ మ్యాచ్‍లో ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు సన్‍రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. దీంతో చెన్నై ముందుగా బ్యాటింగ్‍కు దిగింది.

రుతురాజ్ సెంచరీ మిస్

సీఎస్‍కే కెప్టెన్, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‍లో అదరగొట్టాడు. 54 బంతుల్లోనే 98 పరుగులతో రెచ్చిపోయాడు. ముందు నుంచి దూకుడుగా ఆడాడు. మొత్తంగా 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో రాణించాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కుకు చేరాడు గైక్వాడ్. మరో ఎండ్‍లో మిచెల్ కూడా వేగంగా ఆడాడు. దీంతో 10.5 ఓవర్లలోనే 100 పరుగులను దాటింది చెన్నై. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించాడు గైక్వాడ్. శతకం దిశగా దూసుకెళ్లాడు. అయితే, హైదరాబాద్ పేసర్ నటరాజన్ వేసిన చివరి ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడాడు రుతురాజ్. అయితే, అది దూరం వెళ్లలేదు. ఆ బంతిని నితీశ్ కుమార్ రెడ్డి క్యాచ్ పట్టేశాడు. దీంతో సెంచరీకి రెండు పరుగుల దూరంలో రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. నిరాశగా పెవిలియన్‍కు నడుచుకుంటూ వెళ్లాడు. శతకం చేజారినా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు రుతురాజ్.

రుతురాజ్ ఔటయ్యాక ఎంఎస్ ధోనీ (5 నాటౌట్) బ్యాటింగ్‍కు దిగాడు. ఆ సమయంలో చెపాక్ స్టేడియం మోతెక్కిపోయింది. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఫోర్ కొట్టాడు ధోనీ. ఆ తర్వాత సింగిల్ తీశాడు.

మిచెల్ హాఫ్ సెంచరీ

చెన్నై బ్యాటర్ డారిల్ మిచెల్ కూడా అర్ధ శకతంతో మెరిపించాడు. 32 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, ఓ సిక్స్ కొట్టాడు. రెండో వికెట్‍కు రుతురాజ్ గైక్వాడ్, మిచెల్ 107 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అజింక్య రహానే (9) త్వరగా ఔటైనా రుతురాజ్, మిచెల్ దూకుడుగా ఆడారు. మిచెల్ ఔటయ్యాక కూడా గైక్వాడ్ జోరు కొనసాగించాడు. ఈ సీజన్‍లో వరుసగా విఫలమవుతున్న మిచెల్ ఎట్టకేలకు ఈ మ్యాచ్‍తో ఫామ్‍లోకి వచ్చేశాడు. 

చెన్నై యంగ్ స్టార్ శివమ్ దూబే మరోసారి మెరుపులు మెరిపించాడు. 20 బంతుల్లోనే అజేయంగా 39 పరుగులు చేశాడు. ఒక్క ఫోరే కొట్టిన దూబే 4 సిక్స్‌లు బాదాడు. రహానేను భువనేశ్వర్ ఔట్ చేస్తే.. డారిల్ మిచెల్‍ను ఉనాద్కత్ పెవిలియన్ పంపాడు. చివరి ఓవర్లో రుతురాజ్‍ను నటరాజన్ ఔట్ చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లో వేసి 49 పరుగులు సమర్పించుకున్నాడు. సన్‍రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, జయదేవ్ ఉనాద్కత్ చెరో వికెట్ తీసుకున్నారు.  ఇక,  హైదరాబాద్ ముందు 213 పరుగుల భారీ లక్ష్యం ఉంది.

తదుపరి వ్యాసం