Cricketer Murder: షాకింగ్.. భార్య, పిల్లల ముందే క్రికెటర్‌ను కాల్చి చంపిన దుండగుడు
17 July 2024, 14:29 IST
- Cricketer Murder: శ్రీలంక మాజీ క్రికెటర్ దమ్మిక నిరోషన (41)ను ఓ గుర్తు తెలియని వ్యక్తి అతని భార్య, పిల్లల ముందే కాల్చి చంపడం సంచలనం రేపుతోంది. ఈ ఘటన మంగళవారం (జులై 16) రాత్రి జరిగింది.
షాకింగ్.. భార్య, పిల్లల ముందే క్రికెటర్‌ను కాల్చి చంపిన దుండగుడు
Cricketer Murder: శ్రీలంకలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఆ దేశ మాజీ క్రికెటర్ దమ్మిక నిరోషన (41)ను ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. శ్రీలంక అండర్ 19 జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్న అతడు.. నేషనల్ టీమ్ కు ఆడలేదు. అయితే అతని హత్య వెనుక కారణం ఏంటి? ఎవరు, ఎందుకు హత్య చేశారన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
క్రికెటర్ కాల్చివేత
శ్రీలంకలోనే గాలె జిల్లాలో ఉన్న అంబలన్‌గోడా అనే చిన్న టౌన్ లో ఈ ఘటన జరిగింది. మంగళవారం (జులై 16) రాత్రి దమ్మిక నిరోషన ఇంట్లో ఉన్న సమయంలోనే ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అతనిపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో నిరోషన భార్య, ఇద్దరు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. అనుమానితుడిని పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు.
అంతేకాదు ఈ హత్య వెనుక అసలు ఉద్దేశం ఏంటన్నది కూడా తెలియలేదు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయితే ఓ క్రికెటర్ హత్య అనేది ఆ దేశంలో సంచలనం రేపుతోంది.
ఎవరీ నిరోషన?
దమ్మిక నిరోషన ఓ రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. లోయర్ ఆర్డర్ లో మంచి బ్యాటర్ కూడా. శ్రీలంక తరఫున అండర్ 19 జట్టుకు ఆడినా.. నేషనల్ టీమ్ కు మాత్రం ఎంపిక కాలేకపోయాడు. అతడు మొత్తంగా 2001 నుంచి 2004 మధ్య 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 8 లిస్ట్ ఎ మ్యాచ్ లు ఆడాడు. 300కుపైగా పరుగులు, 19 వికెట్లు తీసుకున్నాడు. రెండేళ్ల పాటు శ్రీలంక అండర్ 19 టీమ్ తరఫున టెస్టులు, వన్డేలు ఆడాడు.
అంతేకాదు అండర్ 19 జట్టుకు 10 మ్యాచ్ ల పాటు కెప్టెన్ గా ఉన్నాడు. శ్రీలంక క్రికెట్ లో ప్రముఖ ప్లేయర్స్ అయిన ఫర్వేజ్ మహరూఫ్, ఏంజెలో మాథ్యూస్, ఉపుల్ తరంగ లాంటి ప్లేయర్స్ కూడా నిరోషన కెప్టెన్సీలో ఆడారు. ఆ ప్లేయర్స్ లంక క్రికెట్ లో మంచి పేరు సంపాదించినా.. నిరోషన మాత్రం ఎప్పుడూ నేషనల్ జట్టు తలుపు తట్టలేకపోయాడు.
శ్రీలంక పర్యటనకు టీమిండియా
మరోవైపు త్వరలోనే శ్రీలంక పర్యటనకు టీమిండియా వెళ్లనున్న విషయం తెలిసిందే. జులై 27 నుంచి 30 వరకు మూడు టీ20లు, ఆగస్ట్ 4 నుంచి 7 వరకు మూడు వన్డేలు ఆడనుంది. ఈ టూర్ కోసం ఇంకా జట్టును అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే టీ20ల నుంచి రోహిత్ శర్మ రిటైరవడంతో ఈ పర్యటనలో ఎవరు కెప్టెన్ అన్నది తేలాల్సి ఉంది.
హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ లలో ఒకరు టీ20లకు కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వన్డేలకు కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ ఉండే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు. దీనిపై ఇంకా సెలక్టర్లు తుది నిర్ణయం తీసుకోలేదు.