Team India: టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో ట్విస్ట్.. హార్దిక్ పాండ్యా కాకుండా ఆ స్టార్ బ్యాటర్ సారథి అవనున్నాడా?-not hardik pandya suryakumar yadav may become india t20 captain till t20 world cup 2026 report ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో ట్విస్ట్.. హార్దిక్ పాండ్యా కాకుండా ఆ స్టార్ బ్యాటర్ సారథి అవనున్నాడా?

Team India: టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో ట్విస్ట్.. హార్దిక్ పాండ్యా కాకుండా ఆ స్టార్ బ్యాటర్ సారథి అవనున్నాడా?

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 16, 2024 11:34 PM IST

Team India - T20Is: టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్ ఎవరు అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. వైస్ కెప్టెన్‍గా ఉన్న హార్దిక్ పాండ్యా రేసులో ముందున్నట్టు అంచనాలు వచ్చాయి. అయితే, తాజాగా మరో స్టార్ ఆటగాడు పోటీలోకి వచ్చేశాడు. అతడే కెప్టెన్ కానున్నాడని సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే..

Team India: టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో ట్విస్ట్.. హార్దిక్ పాండ్యా కాకుండా ఆ స్టార్ బ్యాటర్ సారథి అవనున్నాడా?
Team India: టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో ట్విస్ట్.. హార్దిక్ పాండ్యా కాకుండా ఆ స్టార్ బ్యాటర్ సారథి అవనున్నాడా? (REUTERS)

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ గెలిచిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‍కు గుడ్‍బై చెప్పేశాడు. ఇక భారత్ తరఫున వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడేందుకు నిర్ణయించుకున్నాడు హిట్‍మ్యాన్. ఆ రెండు ఫార్మాట్లలో అతడు కెప్టెన్‍గా ఉండన్నాడు. అయితే, టీ20ల్లో భారత్‍కు కెప్టెన్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అవుతాడని అంచనాలు వస్తున్న తరుణంలో బిగ్ ట్విస్ట్ ఉండనుందని తెలుస్తోంది. టీమిండియా టీ20 జట్టుకు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‍ను కెప్టెన్ చేసేందుకు బీసీసీఐ ఆలోచిస్తోందని సమాచారం బయటికి వచ్చింది.

గంభీర్ మార్క్.. సూర్యకు సారథ్యం!

శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‍లను టీమిండియా తదుపరి ఆడనుంది. ఈ లంక టూర్ జూలై 27వ తేదీన మొదలుకానుంది. ఈ సిరీస్‍తో భారత జట్టు హెడ్‍కోచ్‍గా మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కోచ్‍గా భారత జట్టులో అతడు ప్రస్థానం మొదలుపెట్టనున్నాడు. టీ20 కెప్టెన్సీని హార్దిక్ పాండ్యా కంటే సూర్యకుమార్ యాదవ్‍కు ఇచ్చేందుకే గంభీర్ మొగ్గుచూపుతున్నాడని రూమర్లు బయటికి వచ్చాయి.

ఒకప్పుడు ఐపీఎల్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టులో గౌతమ్ గంభీర్ సారథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఆడాడు. అప్పట్లో కేకేఆర్ టీమ్ కాంబినేషన్ వల్ల సూర్యను పెద్దగా ప్రమోట్ చేయలేకపోయానని ఇటీవల ఈ సందర్భంలో గంభీర్ చెప్పారు. అయితే, కేకేఆర్ తర్వాత సూర్య ముంబై ఇండియన్స్ జట్టుకు వచ్చి అద్భుతంగా ఆడడం.. భారత జట్టులోకి వచ్చి టీ20ల్లో అత్యంత కీలకమైన ప్లేయర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 బ్యాటర్స్ ర్యాంకింగ్‍ల్లో సూర్య ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.

2026 టీ20 ప్రపంచకప్ వరకు..

శ్రీలంకతో టీ20 సిరీస్‍కు హార్దిక్ పాండ్యా అందుబాటులోనే ఉన్నా.. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్‍ను కెప్టెన్‍ను చేసే ఆలోచనలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారని పీటీఐ రిపోర్టు పేర్కొంది. 2026 టీ20 ప్రపంచకప్ వరకు భారత టీ20 టీమ్‍కు సూర్యనే కెప్టెన్‍గా కొనసాగించాలని వారు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

టీ20 కెప్టెన్సీ విషయంలో ప్లాన్ మార్చిన విషయాన్ని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్.. హార్దిక్ పాండ్యాకు కూడా వివరించారని తెలుస్తోంది. కెప్టెన్సీలో దీర్ఘకాల స్థిరత్వం కోసం నిర్ణయం తీసుకుంటామని చెప్పారట.

శ్రీలంక పర్యటనలో జూలై 27 నుంచి జూలై 30 మధ్య మూడు టీ20లను, ఆగస్టు 2 నుంచి ఆగస్టు 7 మధ్య మూడు వన్డేలను భారత్ ఆడనుంది. అయితే, టీ20 సిరీస్‍కు అందుబాటులో ఉంటానని చెప్పిన పాండ్యా.. వన్డే సిరీస్ నుంచి వ్యక్తిగత కారణాల వల్ల విశ్రాంతి కోరాడని తెలుస్తోంది.

ప్రస్తుతం హార్దిక్ పాండ్యాకు ఎలాంటి ఫిట్‍నెస్ సమస్యలు లేవని బీసీసీఐకు చెందిన ఓ అధికారి చెప్పినట్టు పీటీఐ రిపోర్ట్ వెల్లడించింది. సూర్యకు కెప్టెన్సీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు పేర్కొంది. “రోహిత్ శర్మ కెప్టెన్సీలో హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‍గా ఉన్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడేందుకు అతడు పూర్తిగా ఫిట్‍గా ఉన్నాడు. అయితే, శ్రీలంక సిరీస్‍కు మాత్రమే కాకుండా 2026 ప్రపంచకప్ వరకు సూర్య అయితే కెప్టెన్‍గా బాగుంటాడనే ఫీలింగ్ బలంగా ఉంది” అని ఆ అధికారి చెప్పినట్టు ఆ రిపోర్ట్ వెల్లడించింది.

శ్రీలంక పర్యటనలో టీ20, వన్డే సిరీస్‍లకు మరో రెండు రోజుల్లోగానే జట్లను బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. వన్డే సిరీస్‍ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోనున్నారని తెలుస్తోంది.

Whats_app_banner