Hardik Panyda: టీమిండియా కెప్టెన్ మళ్లీ మారాడు.. శ్రీలంకతో టీ20లకు కెప్టెన్ అతడే.. వన్డేలకు రేసులో ఆ ఇద్దరూ
Hardik Panyda: టీమిండియా కెప్టెన్ మళ్లీ మారిపోయాడు. శ్రీలంకతో జరగబోయే టీ20లకు కొత్తగా హార్దిక్ పాండ్యా రానుండగా.. వన్డే సిరీస్ కు ఇద్దరు ప్లేయర్స్ రేసులో ఉన్నట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు.
Hardik Panyda: టీమిండియా కెప్టెన్ గా మరోసారి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి రావడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీలంకతో ఈ నెల చివర్లో జరగబోయే టీ20 సిరీస్ కు కెప్టెన్ అతడే అని ఓ బీసీసీఐ అధికారి స్పష్టం చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. ఇక తర్వాత జరిగే వన్డే సిరీస్ కోసం ఇద్దరు ప్లేయర్స్ ను పరిశీలిస్తున్నట్లు కూడా ఆ అధికారి చెప్పారు.
టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20ల నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జడేజా రిటైరయ్యారు. ఇక హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ లాంటి వాళ్లు జింబాబ్వే సిరీస్ కు విశ్రాంతి తీసుకోవడంతో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ గా ఉన్నాడు. అక్కడ అతడు 4-1తో సిరీస్ గెలిపించాడు. అయితే శ్రీలంకతో ఇప్పుడు జరగబోయే మూడు టీ20ల సిరీస్ కు హార్దిక్ తిరిగి రానుండటంతో కెప్టెన్సీ అతనికే దక్కనుంది.
ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు పీటీఐ రిపోర్టు తెలిపింది. "హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మకు డిప్యూటీగా ఉన్నాడు. ఇప్పుడతడు పూర్తి ఫిట్‌గా మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు అందుబాటులో ఉంటాడు. టీమ్ కు సారథ్యం వహిస్తాడు" అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. అయితే ఆగస్ట్ తొలి వారంలో జరగబోయే వన్డే సిరీస్ కు మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల హార్దిక్ అందుబాటులో ఉండబోవడం లేదని కూడా ఆ అధికారి చెప్పారు.
ఇక టీ20ల్లో హార్దిక్ కు డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్ లేదా శుభ్‌మన్ గిల్ ఉండే అవకాశం ఉంది. జులై 27 నుంచి జులై 30 వరకు పల్లెకెలెలో ఈ సిరీస్ జరుగుతుంది.
వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్?
రోహిత్ శర్మ కేవలం టీ20ల నుంచే రిటైరయ్యాడు. వన్డేలకు అందుబాటులో ఉండనున్నా.. శ్రీలంక సిరీస్ మాత్రం ఆడనని అతడు ముందే చెప్పాడు. దీంతో వన్డే సిరీస్ కు మాత్రం మరో కెప్టెన్ ను ఎంపిక చేయాల్సి వస్తోంది. ఆగస్ట్ 2 నుంచి 7 వరకు జరగబోయే ఈ సిరీస్ కు కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ ఉన్నట్లు కూడా ఆ బీసీసీఐ అధికారి చెప్పారు.
ఈ మధ్యే జింబాబ్వేతో జరిగిన ఐదు టీ20ల సిరీస్ లో తొలిసారి టీమిండియా కెప్టెన్సీ చేపట్టిన శుభ్‌మన్ గిల్ 4-1తో గెలిపించిన విషయం తెలిసిందే. దీంతో భవిష్యత్తులో తాను కూడా పూర్తిస్థాయి కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు అతడు చెప్పకనే చెప్పాడు. గతంలో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్లు కూడా రోహిత్ శర్మ లేని సమయాల్లో కెప్టెన్లుగా ఉన్నారు.