Rohit Sharma Retirement: వన్డేలు, టెస్టుల నుంచి కూడా రోహిత్ శర్మ రిటైరవుతున్నాడా?.. ఇదీ అతని సమాధానం
Rohit Sharma Retirement: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలు, టెస్టుల నుంచి కూడా రిటైర్ కాబోతున్నాడా? దీనిపై తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో అతడు స్పందిస్తూ.. తాను మరికొంత కాలం ఆడతానని స్పష్టం చేశాడు.
Rohit Sharma Retirement: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వయసు 37 ఏళ్లు. చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించే వయసు ఇదే. ఇప్పటికే అతడు కూడా టీ20ల నుంచి తప్పుకున్నాడు. ఇక వన్డేలు, టెస్టుల నుంచి కూడా త్వరలోనే రిటైర్ కానున్నట్లు వస్తున్న వార్తలపై రోహిత్ స్పందించాడు. అమెరికాలోని డల్లాస్ లో జరిగిన ఓ ఈవెంట్లో ఈ ప్రశ్నకు అతడు స్పష్టంగా సమాధానమిచ్చాడు.
రోహిత్ శర్మ ఏమన్నాడంటే..
గత నెలలో జరిగిన టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా కూడా టీ20ల నుంచి రిటైరవుతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలుసు కదా. ఈ నేపథ్యంలో వీళ్ల వన్డే, టెస్టు భవిష్యత్తుపై కూడా సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాను మరికొంత కాలం క్రికెట్ లో కొనసాగనున్నట్లుగా రోహిత్ స్పష్టం చేశాడు.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియాకు వచ్చి ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్న రోహిత్ శర్మ ప్రస్తుతం ఓ క్రికెట్ అకాడెమీ లాంచ్ కోసం అమెరికాలోని డల్లాస్ లో ఉన్నాడు. అక్కడి ఈవెంట్లో అతని రిటైర్మెంట్ పై ప్రశ్న అడగగా.. అతడు ఇలా స్పందించాడు. "ఇప్పుడే చెప్పాను. నేను అంత దూరం ఆలోచించను. అందుకే మీరు నన్ను మరికొంత కాలం ఆడటం చూస్తారు" అని రోహిత్ అన్నాడు.
ఆ రెండూ అతని కెప్టెన్సీలోనే..
నిజానికి రోహిత్ శర్మ తన భవిష్యత్తు గురించి స్పందించే కంటే ముందే బీసీసీఐ సెక్రటరీ జై షా దీనిపై మాట్లాడాడు. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ (ఇండియా అర్హత సాధిస్తే)లో టీమిండియాకు సారథ్యం వహించేది రోహిత్ శర్మే అని గతంలో జై షా స్పష్టంగా చెప్పాడు. ఆ లెక్కన చూస్తే రోహిత్ కనీసం మరో ఏడాది పాటు వన్డేలు, టెస్టుల్లో కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పుడు రోహిత్ కూడా తాను మరికొంత కాలం ఆడనున్నట్లు చెప్పగానే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ గట్టిగా అరుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక టీమిండియా విషయానికి వస్తే ఈ నెల చివర్లో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ నుంచి హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఒకప్పుడు రోహిత్, కోహ్లిలాంటి వాళ్లతో కలిసి ఆడిన అతడు.. ఇప్పుడు వాళ్లకే కోచింగ్ ఇవ్వనుండటం విశేషం.
టీ20 వరల్డ్ కప్ తో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో గంభీర్ కొత్త హెడ్ కోచ్ అయిన విషయం తెలిసిందే. అయితే ద్రవిడ్ తో పోలిస్తే గంభీర్ వ్యూహాలు, కోచింగ్ తీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. మరి దీనికి ప్లేయర్స్ ఎంత త్వరగా అలవాటు పడతారన్నది చూడాలి. ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో టీమ్ లో మరింత దూకుడు పెంచడమే లక్ష్యంగా గంభీర్ కోచింగ్ ఉండనుంది అనడంలో సందేహం లేదు.
ఇక శ్రీలంక పర్యటన విషయానికి వస్తే ఈ టూర్ కు కూడా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.