Rohit Sharma: ఘనంగా రాహుల్ ద్రవిడ్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు .. మీరు నా భార్యంటూ ఎమోషనల్
Rohit Sharma About Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తప్పుకున్న విషయం తెలిసిందే. దీనిపై రోహిత్ శర్మ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. రాహుల్ ద్రవిడ్ వృత్తిపరమైన భార్య అని నా భార్య రతిక అనేదని టీమిండియా కెప్టెన్ భావోద్వేగం చెందాడు.
Rohit Sharma Rahul Dravid: టీమిండియా వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. 2021 నవంబర్‌లో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్ 2024 జూన్ 29న దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 వరల్డ్ కప్ గెలిచేందుకు తోడ్పాటు అందించారు. అలాగే ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకునేలా చేసి 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించారు.
ఇదిలా ఉంటే 2024 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘనంగా వీడ్కోలు అందించాడు. రాహుల్ ద్రవిడ్‌ను ఉద్దేశిస్తూ భావోద్వేగభరితమైన నోట్‌ను తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా రాసుకొచ్చాడు. అలాగే రాహుల్ ద్రవిడ్‌తో ఉన్న మధుర క్షణాల ఫొటోలను పంచుకున్నాడు.
"ప్రియమైన రాహుల్ భాయ్.. నేను చెప్పాలనుకున్న విషయాలు నా మనసులోని భావాలను తెలియజేసేందుకు సరైన పదాల కోసం వెతుకుతున్నా. పదాలు మారినా.. నేను చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం చెప్పి తీరుతాను. కోట్లాది మంది భారతీయ అభిమానుల లాగే నేను కూడా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగా. కానీ, వారెవరికీ రాని అద్భుతమైన అవకాశం నాకు వరించింది. క్రికెట్‌లో మీరు లెజెండ్" అని రోహిత్ శర్మ రాసుకొచ్చాడు.
"మీ పేరు ప్రఖ్యాతలు, మీరు సాధించిన రికార్డులను వదిలేసి కోచ్‌గా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టారు. మీతో ఏ విషయమైనా చెప్పేంత స్వేచ్ఛ ఇచ్చారు. ఇన్నేళ్లయినా ఆట పట్ల మీకు ప్రేమ తగ్గలేదు. మీ నుంచి చాలా నేర్చుకున్నా. మీతో పని చేసిన క్షణాలు శాశ్వతంగా ఉండిపోతాయి. మీతో కలిసి వరల్డ్ కప్ టైటిల్ సాధించినందుకు సంతోషంగా ఉంది" అని రోహిత్ శర్మ తెలిపాడు.
"మీరు నా వృత్తిపరమైన భార్య అని నా భార్య రితిక అంటూ ఉంటుంది. పనిలో ఉన్నప్పుడు రితికను పట్టించుకోకుండా మీతో ఉంటానని ఆమె అలా అనేది. అలా పిలిపించుకోవడం కూడా నా అదృష్టంగానే భావిస్తా. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను. అయితే మనం కలిసి సాధించిన విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. రాహుల్ భాయ్.. నా కోచ్, నా ఫ్రెండ్ అనుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది" అని ఎమోషనల్‌గా రోహిత్ శర్మ చెప్పాడు.
ఇదిలా ఉంటే, 2023 వన్డే వరల్డ్ కప్‌తోనే రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తి కావాల్సింది. కానీ, టీ20 ప్రపంచకప్ 2024 వరకు అతడిని బీసీసీఐ కొనసాగించింది. అయితే, బీసీసీఐ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని రాహుల్ ద్రవిడ్ నిలబెట్టుకున్నారు. ఇండియాకు టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ అందించి.. యావత్ భారతీయుల మనసులో గొప్ప స్థానం సంపాదించుకున్నారు. ఆటగాడిగా సాధించలేకపోయినా కోచ్‌గా కైవసం చేసుకున్నారు.