Rohit Sharma: రోహిత్ శర్మ కొత్త ప్రొఫైల్ ఫొటోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. ఎందుకు?
Rohit Sharma Profile Picture: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా తన ఎక్స్ (ట్విట్టర్) ప్రొఫైల్ ఫొటో మార్చాడు. అయితే, ఈ కొత్త ఫొటోపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పతాకాన్ని రోహిత్ అవమానించాడంటూ కొందరు ఫైర్ అవుతున్నారు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం సంతోషంలో మునిగితేలుతున్నాడు. గత నెల టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన జోష్‍లో ఉన్నాడు. జూన్ 29వ తేదీన బార్బోడోస్ వేదికగా ఫైనల్‍లో దక్షిణాఫ్రికాతో గెలిచి ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకుంది భారత్. 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కరువు తీర్చుకుంది. అలాగే, 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించింది. దీంతో టీమిండియాపై ప్రశంసల వర్షం కురిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ క్రేజ్ ఆకాశానికి చేరింది. అయితే, తాజాగా ఓ విషయంలో రోహిత్‍పై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాపై ఫైనల్ గెలిచాక ఆనందంలో బార్బడోస్ మైదానంపై భారత జాతీయ పతాకాన్ని నాటేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. అయితే, ఈ ఫొటోను తాజాగా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాకు కొత్త ప్రొఫైల్ ఫొటోగా రోహిత్ శర్మ సెట్ చేసుకున్నాడు. దీనిపైనే ఇప్పుడు నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి.
‘జాతీయ పతాకాన్ని అవమానించాడు’
రోహిత్ శర్మ మైదానంపై జాతీయ జెండాను పాతేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అది గ్రౌండ్‍కు కింద తాకుతోంది. అయితే, జాతీయ గౌరవ చట్ట నిబంధనల ప్రకారం జాతీయ జెండాను ఉద్దేశపూర్వకంగా నేలకు తాకించకూడదు. దీనిపైనే నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్‍కు తగిలేలా చేసి త్రివర్ణ పతాకాన్ని రోహిత్ శర్మ అవమానించాడంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
జాతీయ పతాకాన్ని ఉద్దేశపూర్వకంగా నేలకు తగిలించడం, నీటిలో ముంచడం లాంటివి చేయకూడదని ఉన్న నిబంధనను పోస్ట్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన రోహిత్ శర్మ అయినా.. ఎవరైనా ఇలా చేయడం సరికాదంటూ ఓ యూజర్ ట్వీట్ చేశారు. ఈ నిబంధన రోహిత్ శర్మకు తెలియదా అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. మొత్తంగా జాతీయ పతాకాన్ని రోహిత్ అవమానించారంటూ చాలా మంది నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.
గెలుపు సంబరాల్లో బార్బడోస్ గ్రౌండ్‍పై జాతీయ జెండా పాతేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించిన ఫొటో ఫైనల్ రోజే బయటికి వచ్చింది. అయితే, దేశంపై ప్రేమతోనే రోహిత్ ఆ పని చేసినట్టు స్పష్టమవుతోంది. ఆ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చాలా మంది ఈ ఫొటోను పోస్ట్ చేసి సంబరపడ్డారు. అయితే, ఇప్పుడు రోహిత్ ఆ ఫొటోను ప్రొఫైల్ ఫొటోగా పెట్టగా.. జాతీయ పతాకం నేలకు తాకుతోందని కొందరు నెటిజన్లు గుర్తించారు. దీంతో త్రివర్ణ పతకాన్ని అతడు అవమానించాడని కొందరు పోస్టులు చేశారు. ఇది కాస్త తీవ్రంగా మారింది. వేలాది మంది ఎక్స్ (ట్విట్టర్) నెటిజన్లు ఈ విషయంపై పోస్టులు చేస్తున్నారు. రోహిత్‍ను విమర్శిస్తున్నారు.
అంతర్జాతీయ టీ20లకు గుడ్‍బై
టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ఎమోషనల్ అయ్యాడు. దక్షిణాఫ్రికా విజయం సాధించిన వెంటనే గ్రౌండ్‍పై పడుకొని భావోద్వేగానికి లోనయ్యాడు. ఓ దశలో ఎమోషనల్‍గా కన్నీరు పెట్టుకున్నాడు. ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియాకు టైటిల్ అందడంతో సంబరాలు చేసుకున్నాడు. ఈ వరల్డ్ కప్ గెలిచాక అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ గుడ్‍బై చెప్పాడు. ఇక టీమిండియా తరఫున వన్డేలు, టెస్టుల్లో కెప్టెన్‍గా కొనసాగనున్నాడు.