T20 World Cup 2024: ఈ వరల్డ్ కప్‌లో ఒక్క సెంచరీ నమోదు కాలేదు - అత్యధిక వికెట్లు తీసింది భారత బౌలరే!
T20 World Cup 2024: 2024 టీ20 వరల్డ్ కప్‌లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. సెంచరీ లేకుండా వరల్డ్ కప్ ముగియడం ఇదే తొలిసారి. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్ నిలిచాడు.
T20 World Cup 2024: టీ20 ఫార్మెట్ లో బ్యాటర్లదే అధిపత్యం కనిపిస్తుంది. మెరుపు ఇన్నింగ్స్‌లు, సిక్సులు, ఫోర్లతో టీ20 మ్యాచ్‌లు ఆభిమానులను అలరిస్తుంటాయి. కానీ టీ20 వరల్డ్ కప్ 2024 అందుకు పూర్తి భిన్నంగా సాగింది. ఈ వరల్డ్ కప్ మొత్తం బౌలర్లదే డామినేషన్ నడిచింది.
జీరో సెంచరీలు...
ఈ వరల్డ్ కప్‌లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదంటే బౌలర్ల జోరు ఏ విధంగా కొనసాగిందో ఊహించుకోవచ్చు. 2007 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి వరల్డ్ కప్‌లో వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు సెంచరీలు చేస్తూ వచ్చారు. కానీ ఈ వరల్డ్ కప్‌లో ఒక్కరంటే ఒక్కరూ కూడా మూడు అంకెల స్కోరును అందుకోలేకపోయారు.
వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ చేసిన 98 పరుగులే ఈ వరల్డ్ కప్‌లో ఓ బ్యాట్స్‌మెన్ చేసిన హయ్యెస్ట్ స్కోరు కావడం గమనార్హం. సెంచరీకి రెండు పరుగుల దూరంలో పూరన్ ఔటయ్యాడు. ఈ వరల్డ్ కప్‌లో 90 పరుగుల స్కోరును కూడా కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే దాటారు. పూరన్‌తో పాటు అరోన్ జోన్స్ (94 రన్స్), రోహిత్ శర్మ (92 రన్స్) హయ్యెస్ట్ స్కోర్ సాధించిన బ్యాట్స్‌మెన్స్‌గా నిలిచారు.
రోహిత్ శర్మ సెకండ్...
ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ఆప్గానిస్థాన్‌కు చెందిన రహ్మనుల్లా గుర్బాజ్ నిలిచాడు. గుర్బాజ్ ఎనిమిది మ్యాచుల్లో 281 పరుగులు చేశాడు. ఈ జాబితాలో 257 పరుగులతో రోహిత్ శర్మ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. ట్రావిస్ హెడ్ (255 రన్స్) మూడో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మతో పాటు టాప్ టెన్‌లో సూర్యకుమార్ యాదవ్ (199 రన్స్...తొమ్మిదోస్థానంలో) మాత్రమే నిలిచాడు.
హయ్యెస్ట్ వికెట్స్...
2024 టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆప్గానిస్థాన్ కే చెందిన ఫజల్‌హక్ ఫరూఖీ టాప్ ప్లేస్‌లో నిలిచాడు.ఫరూఖీ 17 వికెట్లు తీశాడు. అతడితో సమానంగా పదిహేడు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.
పదిహేను వికెట్లతో బుమ్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. బెస్ట్ బౌలింగ్ రికార్డ్ కూడా ఫరూఖీ పేరు మీదనే నమోదు అయ్యింది. ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో ఫరూఖీ తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. భారత్ నుంచి అర్షదీప్ అత్యుత్యమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
ఎనిమిది మ్యాచుల్లో విక్టరీ...
ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక విజయాలు సాధించిన టీమ్‌గా ఇండియా నిలిచింది. మొత్తంగా వరల్డ్ కప్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఎనిమిదింటిలో విజయం సాధించింది. ఓటమే లేకుండా కప్ గెలుచుకొని చరిత్రను సృష్టించింది.