Cricketer Helmet: హెల్మెట్ తీసి బ్యాట్‌తో గ్రౌండ్ అవతలికి విసిరి కొట్టిన వెస్టిండీస్ క్రికెటర్.. వీడియో వైరల్
26 August 2024, 12:45 IST
- Cricketer Helmet: ఓ వెస్టిండీస్ క్రికెటర్ తలకు పెట్టుకున్న హెల్మెట్ ను తీసి తన బ్యాట్ తో గ్రౌండ్ అవతలికి విసిరి కొట్టాడు. ఓ బాల్ ఎలాగైతే గ్రౌండ్ బయటకు వెళ్లి పడుతుందో.. అతని ధాటికి ఆ హెల్మెట్ కూడా ముక్కలై బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
హెల్మెట్ తీసి బ్యాట్‌తో గ్రౌండ్ అవతలికి విసిరి కొట్టిన వెస్టిండీస్ క్రికెటర్.. వీడియో వైరల్
Cricketer Helmet: వెస్టిండీస్ కు చెందిన ఓ క్రికెటర్ తన హెల్మెట్ తీసి బ్యాట్ తో గ్రౌండ్ అవతలికి విసిరి కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ టీ10 లీగ్ లో భాగంగా ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఔటై డగౌట్ కు వెళ్తున్న సమయంలో అతడు చేసిన ఈ పనికి టీమ్ అంతా షాక్ తిన్నది. అసలు అతడు అలా చేయడానికి అంపైర్ ఇచ్చిన తప్పుడు నిర్ణయమే కారణం.
హెల్మెట్ సిక్సర్
వెస్టిండీస్ క్రికెట్ లో భారీ షాట్లకు పెట్టింది పేరైన కార్లోస్ బ్రాత్‌వెయిట్ ఇప్పుడు తన ప్రతాపాన్ని ఓ హెల్మెట్ పై చూపించాడు. అతని దెబ్బకు ఆ హెల్మెట్ ముక్కలై గ్రౌండ్ అవతలి పడిపోయింది. ఈ విండీస్ ఆల్ రౌండర్ కేమ్యాన్ ఐలాండ్స్ టీ10 లీగ్ లో ఆడుతున్నాడు. ఇందులో న్యూయార్క్ స్ట్రైకర్స్ టీమ్ తరఫున బరిలోకి దిగిన బ్రాత్‌వెయిట్ ఔటైన తీరు వివాదానికి దారి తీసింది.
ఈ మ్యాచ్ లో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన బ్రాత్‌వెయిట్ వచ్చీ రాగానే ఓ సిక్స్ కొట్టి ఊపు మీద కనిపించాడు. నాలుగు బంతుల్లో 7 పరుగులతో ఉన్న సమయంలో ఐదో బంతికి ఓ పుల్ షాట్ ఆడాడు. అతి కాస్తా అతని భుజానికి తగిలి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీంతో అంపైర్ ఔటిచ్చాడు. తన భుజానికి తగిలిందని అతడు చెబుతున్నా వినలేదు.
సహనం కోల్పోయిన బ్రాత్‌వెయిట్
దీంతో బ్రాత్‌వెయిట్ సహనం కోల్పోయాడు. డగౌట్ కు వెళ్తున్న సమయంలో బౌండరీ దగ్గరకు వెళ్లగానే సడెన్ గా తన హెల్మెట్ తీసి విసిరేసి బ్యాట్ తో కొట్టాడు. దీంతో అది కాస్తా బౌండరీ బయటకు వెళ్లి పడింది. అతడు అలా చేయడం చూసి బ్రాత్‌వెయిట్ టీమ్మేట్స్ కూడా షాక్ తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఈ మ్యాచ్ లో చివరికి న్యూయార్క్ స్ట్రైకర్స్ 8 పరుగుల తేడాతో గ్రాండ్ కానియన్ జాగ్వార్స్ పై గెలిచింది. మొదట న్యూయార్క్ 8 వికెట్లకు 104 పరుగులు చేయగా.. తర్వాత గ్రాండ్ కానియన్ జాగ్వార్స్ 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో బ్రాత్‌వెయిట్ 2 ఓవర్లు కూడా వేసి 16 పరుగులు ఇచ్చాడు. వికెట్ తీయలేకపోయాడు.
ఆ వరల్డ్ కప్ మెరుపులతో..
కార్లోస్ బ్రాత్‌వెయిట్ ఒక్క ఇన్నింగ్స్ తో వెస్టిండీస్ క్రికెట్ లోనే కాదు.. ప్రపంచ క్రికెట్ లోనే రాత్రికి రాత్రి హీరో అయిపోయాడు. 2016 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ పై బెన్ స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్ లు కొట్టి వెస్టిండీస్ ను గెలిపించాడు కార్లోస్ బ్రాత్‌వెయిట్.
క్రికెట్ చరిత్రలో మరుపురాని మ్యాచ్ లలో ఇదీ ఒకటిగా నిలిచిపోయింది. అలాంటి బ్రాత్‌వెయిట్ తర్వాత ఇలాంటి ఇన్నింగ్స్ ఏవీ ఆడలేదు. ఐదేళ్లుగా నేషనల్ జట్టుకు దూరంగా ఉన్నాడు.