Rinku Singh: తొలిసారి విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన రింకు సింగ్.. అతని రియాక్షన్ ఎలా ఉందో చూడండి
18 August 2023, 8:46 IST
- Rinku Singh: తొలిసారి విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించాడు స్టార్ బ్యాటర్ రింకు సింగ్. అతని రియాక్షన్ ఎలా ఉందో బీసీసీఐ ఓ వీడియో ద్వారా అభిమానులు ముందుకు తీసుకొచ్చింది.
ఐర్లాండ్ ఫ్లైట్ లో రింకు సింగ్, జితేష్ శర్మ
Rinku Singh: ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఇరగదీసిన రింకు సింగ్.. ఐర్లాండ్ సిరీస్ కోసం తొలిసారి టీమిండియాలోకి ఎంపికయ్యాడు. అంతేకాదు ఇండియన్ టీమ్ తో కలిసి తొలిసారి ఓ విమానంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణించాడు. దీంతో అతని ఆనందం మామూలుగా లేదు. మరో యంగ్ ప్లేయర్ జితేష్ శర్మతో కలిసి రింకు తన ఆనందాన్ని పంచుకున్నాడు.
తొలిసారి బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్న రింకు సింగ్ ని ఆ అనుభవం ఎలా ఉందో అడిగాడు జితేష్ శర్మ. విమానంలో ప్రయాణించే సమయంలో, తర్వాత ఐర్లాండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రింకుని జితేష్ ఇంటర్వ్యూ చేశాడు. టీమిండియా జెర్సీపై తన పేరు తొలిసారి చూసి చాలా భావోద్వేగానికి గురైనట్లు ఈ సందర్భంగా రింకు చెప్పాడు.
"చాలా బాగా అనిపిస్తోంది. టీమిండియాకు ఆడాలన్నది ప్రతి ప్లేయర్ కల. నేను నా గదిలోకి వెళ్లినప్పుడు నా జెర్సీ, దానిపై 35 నంబర్ ఉండటం చూసి భావోద్వేగానికి లోనయ్యాను. దీనికోసమే ఇన్నాళ్లూ నేను ఎంతో కష్టపడ్డాను. నన్ను టీమ్ లోకి ఎంపిక చేసినట్లు తెలిసినప్పుడు నేను నా ఫ్రెండ్స్ తో కలిసి నోయిడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. వెంటనే నాకు వెన్నంటి ఉండి ప్రోత్సాహం అందించే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను" అని రింకు వెల్లడించాడు.
2013లో తామిద్దరం తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడామని, పదేళ్ల తర్వాత ఇప్పుడు టీమిండియాకు ఎంపికైనట్లు జితేష్ శర్మ చెప్పాడు. మధ్యలో జోక్యం చేసుకున్న రింకు.. ఇద్దరం కలిసి ఐర్లాండ్ వెళ్తుండటం బాగుందని, అక్కడ తన ఇంగ్లిష్ కు సాయం చేయాలని సరదాగా అన్నాడు. ఆ తర్వాత ఐర్లాండ్ లో టీమ్ తో కలిసి తొలి ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా కూడా రింకు, జితేష్ మాట్లాడుకున్నారు.
ఇక ఐర్లాండ్ తో తొలి టీ20 శుక్రవారం (ఆగస్ట్ 18) జరగనుంది. ఈ మ్యాచ్ లో రింకు అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కు బుమ్రా కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే.
ఐర్లాండ్ టూర్ కు టీమిండియా
బుమ్రా , రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజూ శాంసన్, జితేష్ శర్మ, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, అవేష్ ఖాన్