Rinku Singh: ఐదు సిక్స్‌లతో నా జీవితం మారిపోయింది - రింకూ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rinku Singh: ఐదు సిక్సర్లు తన జీవితం మొత్తాన్ని మార్చేశాయని అన్నాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ హిట్టర్ రింకూ సింగ్. ఏషియన్ గేమ్స్ కోసం ఎంపిక చేసిన ఇండియన్ టీమ్‌లో చోటు దక్కడంపై రింకూ సింగ్ ఆనందం వ్యక్తం చేశాడు.
Rinku Singh: ఈ ఏడాది ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన క్రికెటర్లలో రింకూ సింగ్ ఒకరు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు రింకు సింగ్. ఈ మ్యాచ్‌తో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయాడు.
ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్ నాలుగు హాఫ్ సెంచరీలతో 474 రన్స్ చేశాడు. ఐపీఎల్ ప్రదర్శనతో టీమ్ ఇండియాలోకి వచ్చేందుకు అతడు దారులు తెరుచుకున్నాయి. ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో ఫస్ట్ టైమ్ క్రికెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఏషియన్ గేమ్స్ కోసం సెలెక్ట్ చేసిన జట్టులో రింకూ సింగ్ చోటు దక్కించుకున్నాడు.
జాతీయ జట్టుకు సెలెక్ట్ కావడంపై రింకూ సింగ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్ కు ముందు తానో క్రికెటర్‌ను అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసునని రింకూ అన్నాడు. తన పేరు తప్ప ఆటతీరు గురించి ఎవరికి పెద్దగా అవగాహన ఉండేది కాదని పేర్కొన్నాడు.
“ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టడంతో నా ప్రతిభాసామర్థ్యాలేమిటో అందరికి తెలిసిపోయాయి. ఆ మ్యాచ్ తర్వాత క్రికెటర్‌గా, వ్యక్తిగతంగా నా జీవితం మొత్తం మారిపోయింది. ఎక్కడకు వెళ్లిన ప్రతి ఒక్కరూ నన్ను గుర్తుపట్టడం ఆనందంగా ఉంది” అని రింకూ సింగ్ తెలిపాడు. ఇండియాకు ఆడాలనే తన కల ఆసియా కప్ ద్వారా తీరనుండటం ఆనందంగా ఉందని చెప్పాడు.
“నేను జాతీయ జట్టు తరఫున ఆడితే చూడాలని మా కుటుంబం మొత్తం ఎదురుచూస్తోంది. ఏషియన్ గేమ్స్‌కు సెలెక్ట్ అయిన విషయం తెలియంగానే అందరూ సంతోషంగా ఫీలయ్యారు. ఏషియన్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శనతో అందరూ మరోసారి నా గురించి గొప్పగా మాట్లాడుకునేలా చేయడంపైనే దృష్టిపెట్టా” అని రింకూ సింగ్ తెలిపాడు.
ఏషియన్ గేమ్స్ కోసం పదిహేను మంది యంగ్ క్రికెటర్స్‌తో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్‌లో రాణించిన ప్లేయర్లకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఏషియన్ గేమ్స్‌లో పాల్గొననున్న ఇండియన్ టీమ్‌కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.