Shreyas Iyer: సన్‌గ్లాసెస్ ధరించి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ - డకౌట్ కావడంతో దారుణంగా ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు
13 September 2024, 12:50 IST
Shreyas Iyer: దులీప్ ట్రోఫీలో సన్ గ్లాసెస్ ధరించి బ్యాటింగ్ దిగిన టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. శ్రేయస్ స్టైల్‌పై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. ఎక్స్‌ట్రాలు తగ్గించుకుంటేనే తిరిగి టీమిండియాలోకి వస్తావంటూ కామెంట్స్ చేస్తోన్నారు.
శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer: క్రికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడే ఆటగాళ్లు సన్ గ్లాసెస్ ధరిస్తారు. బౌలర్లు బౌలింగ్ చేసే టైమ్‌లో తమ గ్లాసెస్‌ను అంపైర్స్‌కు ఇస్తుంటారు. కానీ బ్యాటింగ్ చేసేప్పుడు క్రికెటర్లు సన్ గ్లాసెస్ ధరించడం చాలా అరుదు. దులీప్ ట్రోఫీలో టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ సన్ గ్లాసెస్ ధరించి బ్యాటింగ్ దిగాడు.
ఇండియా ఏ వర్సెస్ ఇండియా డి
దులీప్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం ఇండియా ఏ, ఇండియా డి జట్ల మధ్య అనంతరపురం వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఇండియా డి టీమ్‌కు శ్రేయస్ అయ్యర్ సారథిగా వ్యవహరిస్తోన్నాడు. శుక్రవారం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ సన్ గ్లాసెస్ ధరించి బ్యాటింగ్ దిగాడు. సినిమాల్లో హీరో మాదిరిగా స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు. కేవలం ఏడు బాల్స్ మాత్రమే ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అఖీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు.
సన్ గ్లాసెస్ ధరించి బ్యాటింగ్ దిగిన శ్రేయస్ అయ్యర్‌ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. ఈ ఎక్స్‌ట్రాలు తగ్గిస్తే మంచిదంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. హీరోలో ఫీలయితే రిజల్ట్ ఇలాగే ఉంటుందని ఓ నెటిజన్ శ్రేయస్ ఫొటోను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనినే మా ఏరియాలో బలుపు అంటారని ఓ నెటిజన్ ఫన్నీగా పేర్కొన్నాడు. ఆట మీద ఫోకస్ తగ్గితే రిజల్ట్ ఇలాగే ఉంటుందని నెటిజన్లు ట్రోల్ చేస్తోన్నారు.
సోషల్ మీడియాలో వైరల్...
శ్రేయస్ అయ్యర్ సన్ గ్లాసెస్ ధరించి బ్యాటింగ్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్‌తో పాటు మరో సీనియర్ ప్లేయర్ సంజూ శాంసన్ కూడా కేవలం ఐదు పరుగులకే ఔటై నిరాశపరిచాడు.
తిలక్ వర్మ పది రన్స్...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ జట్టు 290 పరుగులకు ఆలౌటైంది. శామ్స్ ములానీ 89 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తనుష్ 53 రన్స్ చేశాడు. రియాన్ 37 పరుగులతో ఆకట్టుకున్నాడు. మయాంక్ అగర్వాల్ (7 రన్స్), తిలక్ వర్మ (10 పరుగులు) నిరాశపరిచారు. ఇండియా డి బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు, కావేరప్ప, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
దేవదత్ పడిక్కల్
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ దిగిన ఇండియా డి లంచ్ బ్రేక్ టైమ్‌కు నాలుగు వికెట్లు నష్టపోయి 86 రన్స్ చేసింది. దేవదత్ పడిక్కల్ 40, రికీ భుయ్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. దులీప్ ట్రోఫీలో ఇండియా సీతో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 9, సెకండ్ ఇన్నింగ్స్‌లో 53 పరుగులు మాత్రమే చేశాడు శ్రేయస్ అయ్యర్.