Aus vs WI 1st Test: 85 ఏళ్లలో ఇదే తొలిసారి.. టెస్ట్ క్రికెట్‌లో తొలి బంతికే వికెట్
17 January 2024, 14:44 IST
- Aus vs WI 1st Test: టెస్ట్ క్రికెట్ లో తొలి బంతికే వికెట్ తీశాడు వెస్టిండీస్ పేస్ బౌలర్ షామార్ జోసెఫ్. అది కూడా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర స్టీవ్ స్మిత్ వికెట్ కావడం విశేషం.
స్మిత్ వికెట్ తీస్తున్న షామార్ జోసెఫ్
Aus vs WI 1st Test: వెస్టిండీస్ పేస్ బౌలర్ షామార్ జోసెఫ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో తాను వేసిన తొలి బంతికే వికెట్ తీశాడు. ఓ విండీస్ బౌలర్ ఇలా తొలి బంతికే వికెట్ తీయడం 85 ఏళ్లలో ఇదే తొలిసారి. ఓవరాల్ గా టెస్ట్ క్రికెట్ లో ఇలా జరగడం 23వసారి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజే జోసెఫ్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు. అది కూడా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వికెట్ కావడం మరో విశేషం.
ఆస్ట్రేలియా టీమ్ తరఫున టెస్టుల్లో తొలిసారి ఓపెనింగ్ కు వచ్చిన స్టీవ్ స్మిత్ నిరాశ పరిచాడు. 25 బంతుల్లో 12 పరుగులతో ఉన్నప్పుడు బంతి అందుకున్న షామార్ జోసెఫ్ తొలి బంతికే అతన్ని ఔట్ చేశాడు. ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతిని ఆడటానికి ప్రయత్నించిన స్మిత్.. స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో స్టార్ బ్యాటర్ లబుషేన్ ను కూడా అతడే ఔట్ చేశాడు.
85 ఏళ్లలో ఇదే తొలిసారి
వెస్టిండీస్ తరఫున టెస్ట్ క్రికెట్ లో తొలి బంతికే వికెట్ తీసిన ఘనతను తొలిసారి 1939లో టైరెల్ జాన్సన్ సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో అతడు ఈ రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పుడు షామార్ జోసెఫ్ ఆస్ట్రేలియాపై ఆ రికార్డు రిపీట్ చేశాడు. టెస్టుల్లో ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ బ్యాటర్ గా పేరుగాంచిన స్మిత్ వికెట్ కావడం ఈ రికార్డుకు మరింత వన్నె తెచ్చింది.
ఈ టెస్ట్ మ్యాచ్ కంటే ముందు కేవలం ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు మాత్రమే ఆడిన అనుభవం జోసెఫ్ కు ఉంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ కేవలం 188 రన్స్ కే ఆలౌటైంది. ఆ టీమ్ లో కిర్క్ మెకెంజీ మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. దీంతో విండీస్ 62.1 ఓవర్లలో 188 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ చెరో నాలుగు వికెట్లు.. స్టార్క్, లయన్ చెరొక వికెట్ తీసుకున్నారు.
తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియాకు కూడా మొదట్లోనే షాక్ తగిలింది. స్కోరు 25 రన్స్ దగ్గర విండీస్ తరఫున తొలి టెస్ట్ ఆడుతున్న జోసెఫ్.. ఓపెనర్ స్మిత్ వికెట్ తీశాడు. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఓపెనర్ గా ప్రమోట్ అయిన స్మిత్.. తొలి ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. ఆ కాసేపటికే మరో స్టార్ బ్యాటర్ లబుషేన్ ను కూడా జోసెఫ్ పెవిలియన్ కు పంపించాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 59 రన్స్ చేసింది. ప్రస్తుతం 129 పరుగులు వెనుకబడి ఉంది. ఖవాజా 60, కామెరాన్ గ్రీన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాపిక్