IND vs PAK: ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా ఢీ - లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎందులో అంటే?
19 July 2024, 11:03 IST
IND vs PAK: ఆసియా కప్ ఉమెన్స్ టోర్నీ శుక్రవారం (నేటి) నుంచి మొదలుకానుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో టీమిండియా...చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. శ్రీలంకలోని డంబుల్లా వేదికగా జరుగనున్న మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్‌లో వీక్షించవచ్చు.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్
IND vs PAK: ఆసియా కప్ ఉమెన్స్ టోర్నీ నేటి నుంచి మొదలుకాబోతోంది. మొత్తం ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీపడబోతున్నాయి. గ్రూప్ఏలో ఇండియా, పాకిస్తాన్‌తో పాటు నేపాల్ యూఏఈ ఉన్నాయి. గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా థాయిలాండ్ పోటీపడనున్నాయి.
టీ20 ఫార్మెట్‌లో...
ఈ సారి ఉమెన్స్ ఆసియా కప్‌ను టీ20 ఫార్మెట్‌లో నిర్వహించబోతున్నారు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే భారత ఉమెన్స్ జట్టు పాకిస్తాన్‌తో పోటీపడనుంది. శ్రీలంకలోని డంబుల్లా వేదికగా శుక్రవారం (నేడు) రాత్రి ఏడు గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ఈ మ్యాచ్‌ను లైవ్‌లో చూడొచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉండనుంది.
టీమిండియాదే డామినేషన్...
టీ20 ఫార్మెట్‌లో పాకిస్తాన్‌పై ఇండియా ఉమెన్స్‌టీమ్‌దే డామినేషన్ కనిపిస్తోంది. ఇండియా, పాకిస్థాన్ ఇప్పటివరకు 14 టీ20 మ్యాచుల్లో తలపడగా ఇందులో టీమిండియా పదకొండింటిలో విజయం సాధించింది. పాకిస్తాన్ మూడు మ్యాచులు మాత్రమే గెలిచింది. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసియా కప్‌లో ఈ రెండు టీమ్‌లు ఇప్పటివరకు ఆరు సార్లు తలపడగా టీమిండియా ఐదింటిలో గెలిచింది.
కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే పాకిస్తాన్ విజయాన్ని అందుకున్నది. చివరగా గత ఆసియా కప్‌లోనే టీమిండియా, పాకిస్తాన్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఆసియా కప్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ పరాజయాల పరంపరకు ఈ మ్యాచ్‌తోనే బ్రేక్ పడింది. అంతే కాకుండా గత జూలై నుంచి ఈ జూలై వరకు 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ ఏడింటిలోనే గెలిచింది. మరోవైపు ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను 1-1 తేడాతో టీమిండియా సమం చేసింది.
బౌలింగ్ లైనప్ అదుర్స్...
ఈ సిరీస్‌లో పూజ వస్త్రాకర్ ఎనిమిది వికెట్లతో రాణించింది. పాకిస్తాన్ మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా టీమిండియాకు పూజ కీలకం కానుంది. రాధాయాదవ్, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, సంజనలతో భారత బౌలింగ్ పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లోనూ స్మృతి మంథన, హర్మన్ ప్రీత్ కౌర్, షెఫాలీవర్మ రాణిస్తే పాకిస్తాన్‌కు కష్టాలు తప్పవు.
టీమిండియా అంచనా
హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంథన, షెఫాలీవర్మ, దీప్తి శర్మ, జేమైయా రోడ్రిగాస్, రిచా గోష్, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్, రాధాయాదవ్, శ్రేయాంక పాటిల్, సంజన