తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Asia Cup Controversy: పాకిస్థాన్ ఫ్యాన్స్ రచ్చరచ్చ.. ఆసియా కప్‌లో తీవ్ర దుమారం

Asia Cup controversy: పాకిస్థాన్ ఫ్యాన్స్ రచ్చరచ్చ.. ఆసియా కప్‌లో తీవ్ర దుమారం

Hari Prasad S HT Telugu

01 September 2023, 11:58 IST

google News
    • Asia Cup controversy: పాకిస్థాన్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. ఆసియా కప్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. తమ దేశం ఆతిథ్యమిస్తున్నా కూడా జెర్సీలపై పాకిస్థాన్ పేరు లేకపోవడంపై వాళ్లు మండిపడుతున్నారు.
ఇండియా, బంగ్లాదేశ్ జెర్సీలపై కనిపించని పాకిస్థాన్ పేరు
ఇండియా, బంగ్లాదేశ్ జెర్సీలపై కనిపించని పాకిస్థాన్ పేరు

ఇండియా, బంగ్లాదేశ్ జెర్సీలపై కనిపించని పాకిస్థాన్ పేరు

Asia Cup controversy: ఆసియా కప్ 2023ను ఓ వివాదం చుట్టుముట్టింది. ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ పేరు ఆయా జట్ల జెర్సీలపై లేకపోవడంతో పాక్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. వరల్డ్ కప్ కు ఆతిథ్యమిచ్చే ఇండియా పేరు జెర్సీలపై ఉన్నప్పుడు పాకిస్థాన్ పేరు మాత్రం ఎందుకు లేదని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్ జెర్సీలపై కేవలం టోర్నీ లోగో మాత్రమే ఉంది.

ఆసియా కప్ ఈసారి రెండు దేశాల్లో జరుగుతున్నా ఆతిథ్య హక్కులు మాత్రం పాకిస్థాన్ తోనే ఉన్నాయి. టోర్నీ కూడా పాకిస్థాన్ లోని ముల్తాన్ లోనే ఆగస్ట్ 30న ప్రారంభమైంది. అలాంటప్పుడు హోస్ట్ పేరు టోర్నీలో పాల్గొనే అన్ని జట్ల జెర్సీలపై ఉండాలి కదా అన్నది పాక్ అభిమానుల వాదన. తొలి మ్యాచ్ లోనే పాకిస్థాన్, నేపాల్ జట్ల జెర్సీలపై తమ దేశం పేరు లేకపోవడాన్ని పాక్ అభిమానులు గుర్తించారు.

గురువారం (ఆగస్ట్ 31) శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ లోనూ రెండు జట్ల జెర్సీలపై పాకిస్థాన్ పేరు కనిపించలేదు. ఈ జెర్సీల ఫొటోలను పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేశారు. ఈ వివక్షపై వాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి గతేడాది ఆసియా కప్ యూఏఈలో జరిగినా.. ఆతిథ్య దేశమైన శ్రీలంక పేరు జెర్సీలపై కనిపించింది.

ఆ ఫొటోలను కూడా బయటకు తీసి చూపిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు రషీద్ లతీఫ్, మోహ్‌సిన్ ఖాన్ లాంటి వాళ్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ పై మండిపడ్డారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, జెర్సీలను మార్చాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ దీనికి సమాధానమివ్వాలని వాళ్లు అన్నారు.

అయితే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం దీనిని లైట్ తీసుకుంది. నిజానికి ఆతిథ్య దేశం పేరు జెర్సీలపై ఉండొద్దని గతేడాదే ఏసీసీ నిర్ణయించినట్లు పీసీబీ చెబుతోంది. ఈ ఏడాది ఆతిథ్య హక్కులు తమ దగ్గర ఉన్నాయని తెలిసినా.. పాక్ బోర్డు దీనికి ఎందుకు అంగీకరించిందని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు ఈ ఏడాది జరిగిన ఏషియన్ ఎమర్జింగ్ నేషన్స్ కప్, ఏషియన్ అండర్ 16 టోర్నీల్లో మాత్రం ఆతిథ్య దేశం పేర్లను ఎందుకు ముద్రించారని మోహ్‌సిన్ ఖాన్ ప్రశ్నించాడు. దీనిపై ఏసీసీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీని వెనుక బీసీసీఐ సెక్రటరీ జై షా హస్తం ఉందని మరో పాక్ మాజీ క్రికెటర్ అనడం గమనార్హం.

తదుపరి వ్యాసం