SL vs BAN Asia Cup 2023: బంగ్లాదేశ్‍పై శ్రీలంక గెలుపు.. తడబడినా ఆ ఇద్దరి హాఫ్ సెంచరీలతో..
SL vs BAN Asia Cup 2023: ఆసియాకప్‍ను శ్రీలంక అదిరేలా మొదలుపెట్టింది. బంగ్లాదేశ్‍ను సునాయాసంగా ఓడించింది. వివరాలివే..
SL vs BAN Asia Cup 2023: ఆసియాకప్ 2023 టోర్నీలో ఆతిథ్య శ్రీలంక శుభారంభం చేసింది. ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్‍లో బంగ్లాదేశ్‍ను లంక చిత్తు చేసింది. నేడు (ఆగస్టు 31) లంకలోని పల్లెకెలె స్టేడియంలో జరిగిన గ్రూప్-బీ మ్యాచ్‍లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‍పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. నజ్ముల్ హుసేన్ షాంతో (89 పరుగులు) మినహా మరే బంగ్లా బ్యాట్స్‌మెన్ కూడా రాణించలేకపోయారు. లంక బౌలర్లలో మతీశ పతిరన నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. మహీశ్ తీక్షణ రెండు వికెట్లు తీశాడు. ఈ స్వల్ప లక్ష్యాన్ని 11 ఓర్లు మిగిలి ఉండగానే శ్రీలంక ఛేదించింది. 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి గెలిచింది లంక. ఆదిలో వికెట్లు కోల్పోయినా.. సదీర సమరవిక్రమ (54 పరుగులు), చరిత్ అసలంక (62 పరుగులు నాటౌట్) హాఫ్ సెంచరీలు చేసి శ్రీలంకను గెలిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో కెప్టెన్ షకీబుల్ హసన్ రెండు, తస్కిన్ అహ్మద్, షోఫియుల్ ఇస్లాం, మెహదీ హసన్ చెరో వికెట్ తీశారు. వివరాలివే..
షాంతో ఒక్కడే..
ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఏ దశలోనూ దీటుగా ఆడలేకపోయింది. నజ్ముల్ హుసేన్ షాంతో ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. తౌహిద్ హ్రిదోయ్ (20), మహమ్మద్ నయీమ్ (16) కాసేపు నిలిచారు. కెప్టెన్ షకీబుల్ హసన్ (5), ముష్ఫికర్ రహీమ్ (13) సహా మిగిలిన బ్యాట్స్‌మన్ విఫలమయ్యారు. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‍కే పరిమితమయ్యారు. శ్రీలంక పేసర్ మతీశ పతిరన నాలుగు వికెట్లతో బంగ్లాను వణికించాడు. మహీశ్ తీక్షణ రెండు, ధనంజయ డిసిల్వ, వెల్లలాగే, దసున్ శనక చెరో వికెట్ పడగొట్టారు. లంక బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి బంగ్లాను కుదురుకోనివ్వలేదు. దీంతో 42.4 ఓవర్లలోనే 164 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌటైంది.
అదరగొట్టిన సమరవిక్రమ.. అసలంక
స్వల్ప లక్ష్యఛేదనలో శ్రీలంక ప్రారంభంలో తడబడింది. దిముత్ కరుణరత్నె (1), పాతుమ్ నిస్సంక (14), కుషాల్ మెండిస్ (5) వెనువెంటనే ఔటవటంతో ఓ దశలో శ్రీలంక 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఆ తర్వాత సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక అదరగొట్టారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ ఇద్దరూ ఆ తర్వాత దూకుడుగా పెంచారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాది లక్ష్యాన్ని క్రమంగా కరిగించారు. ఈ క్రమంలో సమరవిక్రమ 59 బంతుల్లో అర్ధ శతకానికి చేరగా.. అసలంక 85 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే, సమరవిక్రమను బంగ్లా బౌలర్ మెహదీ హసన్ 30వ ఓవర్లో ఔట్ చేశాడు. అసలంక అలాగే దీటుగా ఆడాడు. ధనంజయ డిసిల్వ (2) త్వరగానే ఔటైనా కెప్టెన్ ధసున్ శనక (14 నాటౌట్)తో కలిసి లంకను గెలిపించాడు అసలంక. లంక పేసర్ మతీశ పతిరనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆసియాకప్‍లో ఇండియా, పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 2న మ్యాచ్ జరగనుంది.