తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Agni Chopra Ranji Trophy Record: వరుసగా ఐదు సెంచరీలు.. బాలీవుడ్ డైరెక్టర్ కొడుకు దూకుడు మామూలుగా లేదు

Agni Chopra Ranji Trophy Record: వరుసగా ఐదు సెంచరీలు.. బాలీవుడ్ డైరెక్టర్ కొడుకు దూకుడు మామూలుగా లేదు

Hari Prasad S HT Telugu

31 January 2024, 13:59 IST

google News
    • Agni Chopra: తండ్రి బాలీవుడ్‌లో ఫేమస్ డైరెక్టర్. కొడుకు మాత్రం క్రికెట్ ఫీల్డ్ లో అదరగొడుతున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీలో వరుసగా ఐదో సెంచరీ బాదాడు విధు వినోద్ చోప్రా తనయుడు అగ్ని చోప్రా.
అగ్ని చోప్రా
అగ్ని చోప్రా

అగ్ని చోప్రా

Agni Chopra: బాలీవుడ్‌లో ఈ మధ్యే 12th ఫెయిల్ మూవీతో సక్సెస్ సాధించిన డైరెక్టర్ విధు వినోద్ చోప్రా తనయుడు అగ్ని చోప్రా రంజీ ట్రోఫీలో వరుసగా ఐదో సెంచరీ కొట్టడం విశేషం.

తొలిసారి ఈ మెగా డొమెస్టిక్ టోర్నీలో ఆడుతున్న అగ్ని.. మిజోరం తరఫున ఈ సీజన్ లో వరుసగా ఐదో సెంచరీతో రికార్డు క్రియేట్ చేశాడు. ఈ వరల్డ్ రికార్డు సెంచరీ గురించి అగ్ని తల్లి అనుపమ చోప్రా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. తల్లిగా గర్వంగా ఫీలవుతున్నట్లు ఆమె చెప్పింది.

అగ్ని ఆన్ ఫైర్

పేరులోనే కాదు ఆటలోనూ తాను అగ్నినే అని నిరూపిస్తున్నాడు విధు వినోద్ చోప్రా, అనుపమ చోప్రా తనయుడు అగ్ని చోప్రా. ముంబై జట్టులో చోటు దొరక్క.. మిజోరం తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. ప్రస్తుతం మేఘాలయతో కెరీర్లో నాలుగో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్నాడు.

ఈ మ్యాచ్ లో అగ్ని 90 బంతుల్లోనే 105 పరుగులు చేశాడు. అందులో 13 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. అగ్ని సెంచరీతో మిజోరం తొలి ఇన్నింగ్స్ లో 359 రన్స్ చేసింది.

అదిరిపోయిన అగ్ని రంజీ అరంగేట్రం

అగ్ని చోప్రా రంజీ ట్రోఫీ అరంగేట్రం అదిరిపోయింది. నాలుగు మ్యాచ్ లలోనే అతడు ఐదు సెంచరీలు బాదడం విశేషం. సిక్కింతో తొలి మ్యాచ్ లో నే తొలి ఇన్నింగ్స్ లో 166, రెండో ఇన్నింగ్స్ లో 92 రన్స్ చేశాడు. అయినా ఆ మ్యాచ్ లో మిజోరం మాత్రం ఓడిపోయింది. తర్వాత రెండో మ్యాచ్ లో నాగాలాండ్ తో మరో సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 164, రెండో ఇన్నింగ్స్ లో 15 రన్స్ చేయడం విశేషం.

ఇక అరుణాచల్‌ప్రదేశ్ తో మూడో మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 110, రెండో ఇన్నింగ్స్ 10 రన్స్ చేశాడు. తాజాగా మేఘాలయతో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 105, రెండో ఇన్నింగ్స్ లో 101 రన్స్ చేయడంతో మేఘాలయను 191 పరుగులతో మిజోరం చిత్తు చేసింది. అగ్ని ఆడిన తొలి నాలుగు మ్యాచ్ లు, 8 ఇన్నింగ్స్ లోనే 767 రన్స్ తో చెలరేగాడు.

నిలకడగా ఆడుతున్న అగ్ని

నిజానికి రంజీ ట్రోఫీలో మిజోరం టీమ్ ఎలైట్ లో కాకుండా ప్లేట్ డివిజన్ లో ఉంది. ఈ డివిజన్ లో బలహీనమైన జట్లే ఉంటాయి. అందులోనూ అగ్ని ఇప్పటి వరకూ అన్ని నార్త్ ఈస్ట్ జట్లపైనే ఆడాడు. అయినా కూడా అతని నిలకడ మాత్రం క్రికెట్ పండితులను ఆశ్చర్యపరుస్తోంది. మిజోరం తమ తర్వాతి మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ తో ఆడనుంది.

అగ్ని జట్టులోకి వచ్చిన తర్వాత మిజోరం తొలి మ్యాచ్ లో సిక్కింతో ఓడిపోయింది. రెండో మ్యాచ్ లో నాగాలాండ్ తో డ్రా చేసుకుంది. మూడో మ్యాచ్ లో అరుణాచల్ ప్రదేశ్ పై, నాలుగో మ్యాచ్ లో మేఘాలయపై వరుస విజయాలు సాధించింది. ఇప్పుడు హైదరాబాద్ తో మ్యాచ్ లో అగ్ని ఏం చేస్తాడన్నది ఆసక్తి కరంగా మారింది. ఈ మధ్యే 12th ఫెయిల్ మూవీతో పెద్ద సక్సెస్ అందుకున్న విధు వినోద్ చోప్రా ఇప్పుడు తన తనయుడి ఆట చూసి మురిసిపోతున్నాడు.

తదుపరి వ్యాసం