12th Fail Director: రంజీ ట్రోఫీలో చెలరేగుతున్న 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. మూడో సెంచరీ బాదాడు-agni dev chopra son of 12th fail movie director vidhu vinod chopra hits his 3rd century in ranji trophy ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  12th Fail Director: రంజీ ట్రోఫీలో చెలరేగుతున్న 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. మూడో సెంచరీ బాదాడు

12th Fail Director: రంజీ ట్రోఫీలో చెలరేగుతున్న 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. మూడో సెంచరీ బాదాడు

Hari Prasad S HT Telugu
Jan 22, 2024 04:09 PM IST

12th Fail Director: రంజీ ట్రోఫీలో చెలరేగుతున్నాడు 12th ఫెయిల్ మూవీ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా డైరెక్టర్ కొడుకు అగ్ని దేవ్ చోప్రా. మిజోరం తరఫున ఈసారే అతడు రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాడు.

రంజీ ట్రోఫీలో వరుసగా మూడు సెంచరీలు బాదిన విధూ వినోద్ చోప్రా తనయుడు అగ్ని దేవ్
రంజీ ట్రోఫీలో వరుసగా మూడు సెంచరీలు బాదిన విధూ వినోద్ చోప్రా తనయుడు అగ్ని దేవ్ (instagram)

12th Fail Director: బాలీవుడ్ లో గతేడాది రిలీజై సంచలన విజయం సాధించిన 12th ఫెయిల్ మూవీ డైరెక్టర్ విధూ వినోద్ చోప్రా కొడుకు అగ్ని దేవ్ చోప్రా తండ్రికి తగిన తనయుడు అనిపించుకుంటున్నాడు. అయితే అగ్ని మాత్రం సినిమాల్లో కాకుండా క్రికెట్ లో సత్తా చాటుతున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీలో అతడు మూడో సెంచరీ బాదడం విశేషం. మిజోరం టీమ్ తరఫున అరుణాచల్ ప్రదేశ్ జట్టుపై అగ్ని సెంచరీ చేశాడు.

తండ్రికి తగిన తనయుడు

12th ఫెయిల్ మూవీతో తన కెరీర్లో మరో విజయం సాధించాడు విధు వినోద్ చోప్రా. గతంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, త్రీ ఇడియట్స్, సంజూలాంటి సినిమాలకు కథలు అందించడంతోపాటు 1942 ఎ లవ్ స్టోరీ, మిషన్ కశ్మీర్, శిఖారాలాంటి సినిమాలకు డైరెక్టర్ గానూ విజయం సాధించాడు. అతని తనయుడు అయిన అగ్ని దేవ్ చోప్రా క్రికెట్ లో రాణిస్తున్నాడు.

ఈ ఏడాదే రంజీ ట్రోఫీలో అగ్ని అరంగేట్రం చేశాడు. మిజోరం టీమ్ తరఫున బరిలోకి దిగిన అగ్ని.. అరుణాచల్ ప్రదేశ్ పై 114 రన్స్ చేశాడు. ఈ రంజీ ట్రోఫీలో అతనికిది వరుసగా మూడో సెంచరీ కావడం విశేషం. తాజాగా అరుణాచల్ టీమ్ పై 18 ఫోర్లు, 2 సిక్స్ లతో 114 రన్స్ చేయడం విశేషం. అతని ఇన్నింగ్స్ తో మిజోరం ఈ మ్యాచ్ లో విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్ లో అగ్ని సెంచరీతో 323 రన్స్ చేసిన మిజోరం టీమ్.. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ను 265, 134 రన్స్ కే కట్టడి చేసింది. తర్వాత 77 రన్స్ టార్గెట్ ను 2 వికెట్లు కోల్పోయి మిజోరం చేజ్ చేసింది. మూడు మ్యాచ్ లలోనూ అగ్ని సెంచరీలు చేసినా.. మిజోరం జట్టుకు మాత్రం ఇదే తొలి విజయం.

మొదట ముంబైకి ఆడినా..

డైరెక్టర్ విధూ వినోద్ చోప్రా తనయుడైన అగ్ని దేవ్ మొదట ముంబై జట్టుకు ఆడాడు. అయితే అక్కడ తగిన అవకాశాలు రాకపోవడంతో ఈ సీజన్లో మిజోరం జట్టుకు మారాడు. మిజోరం తరఫున ఇప్పటికే అతడు లిస్ట్ ఎ, టీ20 క్రికెట్ ఆడిన అతడు.. రంజీ ట్రోఫీతో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం కూడా చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ రూపంలో లిస్ట్ ఎ క్రికెట్ ఆడిన అగ్ని.. 7 మ్యాచ్ లలో 174 రన్స్ చేశాడు.

ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్ లలో 234 రన్స్ చేశాడు. అందులోనూ 150.96 స్ట్రైక్ రేట్ తో అతడు పరుగులు చేయడం విశేషం. అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక తాజా రంజీ సీజన్ లో మూడు మ్యాచ్ లలోనే ఏకంగా 561 రన్స్ చేశాడు. అతని సగటు 93.50గా ఉంది. మూడు మ్యాచ్ లలో 72 ఫోర్లు, 14 సిక్స్ లతో 106.85 స్ట్రైక్ రేట్ తో రన్స్ చేశాడు.

ఇక విధూ వినోద్ చోప్రా విషయానికి వస్తే 12th ఫెయిల్ మూవీతో అతడు మంచి విజయం అందుకున్నాడు. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా సక్సెసైంది.

Whats_app_banner