తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ab De Villiers About Virat Kohli: వరల్డ్ కప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్: డివిలియర్స్ సంచలన కామెంట్స్

AB de Villiers about Virat Kohli: వరల్డ్ కప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్: డివిలియర్స్ సంచలన కామెంట్స్

Hari Prasad S HT Telugu

26 September 2023, 8:42 IST

google News
    • AB de Villiers about Virat Kohli: వరల్డ్ కప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్ అంటూ అతని బెస్ట్ ఫ్రెండ్ ఏబీ డివిలియర్స్ సంచలన కామెంట్స్ చేశాడు. ఈ ట్రోఫీ ఇండియా గెలిస్తే కోహ్లి నుంచి ఈ ప్రకటన రావచ్చని అతడు అనడం గమనార్హం.
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ పై ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ పై ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (AP-Getty Images)

విరాట్ కోహ్లి రిటైర్మెంట్ పై ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

AB de Villiers about Virat Kohli: వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లి తనకెంతో ఇష్టమైన వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడా? కేవలం టెస్టులు, ఐపీఎల్ పైనే దృష్టి సారిస్తాడా? తన ఫ్యామిలీకే ఎక్కువ టైమ్ కేటాయిస్తాడా? అతని బెస్ట్ ఫ్రెండ్ ఏబీ డివిలియర్స్ చెబుతున్న మాట ఇది. 34 ఏళ్ల వయసున్న కోహ్లి.. టాప్ ఫామ్ లో ఇండియాకు మరో వరల్డ్ కప్ అందించడానికి సిద్ధమవుతున్న వేళ అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రెండేళ్ల పాటు దారుణమైన ఫామ్ తో సతమతమైన విరాట్ కోహ్లి గతేడాది నుంచి మళ్లీ గాడిలో పడ్డాడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ సమయానికి మరోసారి తన కెరీర్లోనే పీక్ స్టేజ్ కు చేరుకున్నాడు. ఇప్పటికే 34 ఏళ్ల వయసున్న విరాట్.. 2027లో జరగబోయే మరో వన్డే వరల్డ్ కప్ ఆడతాడని ఊహించలేం కానీ.. మరీ ఈ ఏడాది వరల్డ్ కప్ ముగియగానే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కూడా అంచనా వేయలేము.

కోహ్లి రిటైర్ కావచ్చు: ఏబీడీ

కానీ కోహ్లి బెస్ట్ ఫ్రెండ్ ఏబీ డివిలియర్స్ మాత్రం ఒకవేళ ఈసారి ట్రోఫీ ఇండియా గెలిస్తే విరాట్ ఆ పని చేయొచ్చని అనడం విశేషం. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ఏబీ.. ఈ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. "అతడు సౌతాఫ్రికా (2027 వరల్డ్ కప్ కోసం)కు రావడానికి ఇష్టపడతాడని నాకు తెలుసు. కానీ అది చెప్పడం చాలా కష్టం.

ఇంకా చాలా సమయం ఉంది. అందుకే దీనిపై మొదట దృష్టి సారిద్దాం. విరాట్ కోహ్లి కూడా ఇదే చెబుతాడని నేను భావిస్తున్నాను. ఒకవేళ వాళ్లు వరల్డ్ కప్ గెలిస్తే రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం కావచ్చు. థ్యాంక్యూ వెరీ మచ్. ఇక నుంచి నేను టెస్ట్ క్రికెట్, కాస్త ఐపీఎల్ మాత్రమే ఆడతాను.. నా కెరీర్ చివరి రోజులను ఎంజాయ్ చేస్తాను. ఫ్యామిలీతో కాస్త టైమ్ గడుపుతాను. మీ అందరికీ గుడ్ బై చెబుతాను అని కోహ్లి చెప్పొచ్చు" అంటూ డివిలియర్స్ అనడం విశేషం.

సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడా?

అయితే కోహ్లి ఇప్పటికీ చాలా ఫిట్ గా ఉన్నాడని, మధ్యమధ్యలో అతనికి విశ్రాంతినివ్వడం మంచి విషయమని ఏబీ అన్నాడు. వన్డేల్లో ప్రస్తుతం కోహ్లి 47 సెంచరీలు చేశాడు. మరో రెండు సెంచరీలు చేస్తే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ను సమం చేస్తాడు. అదే రానున్న వరల్డ్ కప్ లోనే సాధ్యమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఆ చారిత్రక సందర్భం కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు.

దీనిపైనా డివిలియర్స్ స్పందించాడు. "నాకు తెలిసి అతడు దానిపై దృష్టి సారించడం లేదు. ఇది అతని ప్రధాన లక్ష్యం కాదు. తన టీమ్ కోసం వరల్డ్ కప్స్ గెలిపించాలని అనుకుంటాడు. అన్ని ఫార్మాట్లలో సక్సెస్ కావాలని అనుకుంటాడు. అతడో టీమ్ ప్లేయర్. ఫీల్డ్ లో అతని నుంచి మనం అందుకే అన్ని రకాల ఎమోషన్లనీ చూస్తాం. గెలవడం అతనికి ఎంత ముఖ్యమో అవే చెబుతాయి" అని ఏబీ అన్నాడు.

కోహ్లి ఇప్పటి వరకూ ఇండియా తరఫున 111 టెస్టులు, 280 వన్డేలు, 115 టీ20లతోపాటు ఐపీఎల్లో 237 మ్యాచ్ లు ఆడాడు. ఇక 37 ఏళ్ల వయసులో క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఏబీ డివిలియర్స్ సౌతాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడటం విశేషం.

తదుపరి వ్యాసం