Zomato Q2 results : క్యూ2లో.. మరింత తగ్గిన జొమాటో నష్టాలు- పెరిగిన ఆదాయం
11 November 2022, 7:14 IST
- Zomato Q2 results 2022 : జొమాటో సంస్థ నష్టాలను క్రమంగా తగ్గించుకుంటోంది. క్యూ2 ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.
మరింత తగ్గిన జొమాటో నష్టాలు
Zomato Q2 results 2022 : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో.. 2023 ఆర్థిక ఏడాది క్యూ2 ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే.. జొమాటో నష్టాలు ఈసారి మరింత తగ్గాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జొమాటో నెట్ లాస్ రూ. 251కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో అది రూ. 430కోట్లుగా ఉండేది. ఇక కార్యకలాపాల నుంచి వచ్చిన ఆదాయం 62శాతం పెరిగి రూ. 1,661కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 1,024కోట్లుగా ఉండేది.
బ్లింకిట్‌ను జొమాటో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ ఒప్పందం ఆగస్టులో పూర్తైంది. ఫలితంగా.. బ్లింకిట్‌కు చెందిన 50రోజుల ఆర్థిక వ్యవహారాలను కూడా జొమాటో పోస్ట్ చేసింది.
Zomato Q2 results : ఫుడ్ డెలివరీ బిజినెస్‌తో పాటు హైపర్‌ప్యూర్ యూనిట్ నుంచి వచ్చే ఆదాయం పెరగడంతో.. జొమాటో నష్టాలు తగ్గాయి.
"మా ఫుడ్ బిజినెస్ నిత్యం వృద్ధిచెందుతూ ప్రాఫిట్వైపు దూసుకెళుతోంది. ప్రస్తుతం ఉన్న దాని కన్నా మా ఫుడ్ బిజినెస్ మరింత వేగంగా వృద్ధిచెందే అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నాను," అని షేర్హోల్డర్లకు రాసిన లేఖలో జొమాటో సీఎఫ్ఓ అక్షత్ గోయల్ తెలిపారు.
జొమాటో అడ్జస్టెడ్ ఎబిట్డా రూ. 192కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 310కోట్లుగా ఉండేది. ఫుడ్ డెలివరీ ఆపరేషన్స్ నుంచి వచ్చే అడ్జస్టెడ్ రెవెన్యూ కూడా 27శాతం పెరిగి రూ. 1,581కోట్లుగా నమోదైంది. గతేడాది ఇది రూ. 1,248కోట్లుగా ఉండేది. యావరేజ్ మంత్లీ ట్రాన్స్క్షన్ యూజర్లు 17.5మిలియన్లకు చేరారు. గతేడాది ఇదే త్రైమాసికంలో అది 15.5 మిలియన్లుగా ఉండేది.
అయితే.. ఈ త్రైమాసికంలో యాక్టివ్ రెస్టారెంట్ పార్టన్నర్స్ యావరేజ్ తగ్గింది. జూన్ త్రైమాసికంలో ఈ సంఖ్య 2,08,000గా ఉండగా ఇప్పుడది 2,07,000కి చేరింది. కానీ గతేడాది ఇదే త్రైమాసికంలో అది 1,70,000గా ఉంది.
Zomato quarterly results : జొమాటో బీ టు బీ(బిజినెస్ టు బిజినెస్) హైపర్‌ప్యూర్.. అడ్జస్టెడ్ రెవెన్యూ మూడు రెట్లు పెరగడం విశేషం. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అది రూ. 334కోట్లుగా నమోదైంది. అడ్జస్టెడ్ ఎబిట్డా లాస్ రూ. 53కోట్లకు పెరిగింది.
ఇక బ్లింకిట్ గ్రాస్ ఆర్డర్ వాల్యూ.. గత త్రైమాసికంతో పోల్చుకుంటే ఈసారి 26శాతం వృద్ధి చెంది. రూ. 1,482కోట్లుగా నమోదైంది. అడ్జస్టెడ్ రెవెన్యూ 44శాతం పెరిగి రూ. 236కోట్లకు చేరింది. ఎడ్జస్టెడ్ ఎబిట్డా లాస్ రూ. 259కోట్లుగా ఉంది.
జొమాటో ప్రోను సంస్థ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఫలితంగా జొమాటో ప్రో నుంచి వచ్చే ఆదాయం రూ. 9లక్షలకు పడిపోయింది.
జొమాటో షేర్ ప్రైజ్..
Zomato share price : గురువారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సరికి జొమాటో షేరు ధర రూ. 63.65గా ఉంది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో జొమాటో స్టాక్ ప్రైజ్ 2.09శాతం పెరిగింది. నెల రోజుల్లో మాత్రం 2.90శాతం పతనమైంది. ఇక ఆరు నెలల్లో.. జొమాటో షేరు ధర 17.44శాతం వృద్ధిచెందింది. కానీ ఈ ఏడాదిలో ఇప్పటివరకు.. జొమాటో స్టాక్ ప్రైజ్ 54.97శాతం మేర పడిపోయింది.