Zomato share price: జొమాటో జూమ్.. 17.71 శాతం పెరిగిన షేర్ ధర
Zomato share price: మొన్నటి వరకు నేల చూపులు చూసిన జొమాటో షేర్ ధర.. ఈరోజు ఏకంగా 17 శాతానికి పైగా పెరిగింది.
Zomato share price: జొమాటో షేర్ ధర ఈ రోజు ఉదయం 10.27 గంటల సమయానికి 17.71 శాతం పెరిగి రూ. 54.50కి చేరుకుంది. గ్రోఫర్స్ (బ్లింకిట్) టేకోవర్ చేసిన సందర్భంలో స్టాక్ ఏకంగా రూ. 40కి పడిపోయింది. తిరిగి క్రమంగా పుంజుకుంది.
అయితే తాజాగా జొమాటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలు వెలువరించిన నేపథ్యంలో స్టాక్ బాగా లాభపడింది. గత ఏడాది క్యూ1తో పోల్చితే నష్టాలు భారీగా తగ్గడంతో మదుపరుల్లో ఈ స్టాక్‌పై ఆసక్తి పెరిగింది.
గత ఏడాది క్యూ1లో రూ. 352.1 కోట్లుగా ఉన్న నష్టాలు ఈ క్యూ1లో రూ. 185.7 కోట్లకు తగ్గాయి. మొన్నటి మార్చితో ముగిసిన క్యూ4లో కూడా నష్టాలు రూ. 359 కోట్లుగా ఉన్నాయి.
ఫుడ్ డెలివరీ యాప్ నష్టాలు తగ్గడంతో మంగళవారం జొమాట్ స్టాక్ ధర అమాంతం పెరిగింది. ఒక దశలో మంగళవారం ఈ స్టాక్ ధర 54.95కు పెరిగింది.
గోల్డ్‌మాన్ సాక్స్ ఈ స్టాక్‌పై బయ్ రేటింగ్ కలిగి ఉంది. షేర్ ధర టార్గెట్ రూ. 100గా పేర్కొంది.
మోర్గాన్ స్టాన్లీ ఈ స్టాక్ పై రూ. 80 టార్గెట్ ధరను కలిగి ఉంది. అలాగే యూబీఎస్ సంస్థ ఈ స్టాక్ పై బయ్ కాల్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ రూ. 95గా ఇచ్చింది.