Vodafone Idea: ఒక్కసారిగా రాకెట్ లా దూసుకుపోతున్న వొడాఫోన్ - ఐడియా షేర్లు; కారణమేంటి?
26 November 2024, 14:48 IST
Vodafone Idea shares: రోజురోజుకీ కిందకు వెళ్తున్న వొడాఫోన్ - ఐడియా షేర్లు మంగళవారం, నవంబర్ 26వ తేదీన ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఒక్క వొడాఫోన్ - ఐడియానే కాదు దాదాపు అన్ని టెలీకాం షేర్లు నవంబర్ 26న బుల్లిష్ ట్రెండ్ లో ఉన్నాయి. ఈ పరుగు కారణాలేంటి?
రాకెట్ లా దూసుకుపోతున్న వొడాఫోన్ - ఐడియా షేర్లు
Vodafone Idea shares: టెలికాం ఆపరేటర్లకు బ్యాంకు గ్యారంటీల మాఫీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం ఉదయం ట్రేడింగ్ లో టెలికాం షేర్లు భారీగా పెరిగాయి. ఈ రంగం ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఈ చర్య ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
15 శాతం పెరిగిన వొడాఫోన్ ఐడియా షేర్లు
టెలికాం ఆపరేటర్లకు బ్యాంకు గ్యారంటీల మాఫీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్న వార్తల నేపథ్యంలో నవంబర్ 26 ఉదయం ట్రేడింగ్ లో టెలికాం షేర్లు భారీగా పుంజుకున్నాయి. వొడాఫోన్ ఐడియా (vodafone idea) షేర్లు 15 శాతం, ఎంటీఎన్ఎల్ షేర్లు 9 శాతం పెరిగాయి. వొడాఫోన్ ఐడియా షేర్లు నవంబర్ 26న 15 శాతం పెరిగి రూ.8 కి చేరుకోగా, ఎంటీఎన్ఎల్ షేరు దాదాపు 9 శాతం లాభపడి రూ.51.45 వద్ద ట్రేడవుతోంది. భారతీ ఎయిర్ టెల్ (airtel) కూడా స్వల్ప లాభాలతో 0.30 శాతం లాభపడి రూ.1583 వద్ద ట్రేడవుతోంది. 2022కు ముందు కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్ పై టెలికాం ఆపరేటర్లకు బ్యాంకు గ్యారంటీలను మాఫీ చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్న సమాచారం నేపథ్యంలో టెలీకాం (telecom) షేర్ల ర్యాలీ చోటు చేసుకుంది.
రూ.24,700 కోట్లకు పైగా బకాయి
బ్యాంక్ గ్యారంటీస్ (BG)లో ప్రభుత్వానికి రూ.24,700 కోట్లకు పైగా బకాయి పడిన వొడాఫోన్ ఐడియాకు ఈ చర్య ఉపశమనం కలిగించింది. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాతో సహా భారతీయ టెలికాం ఆపరేటర్లు కలిసి రూ .30,000 కోట్లకు పైగా బ్యంక్ గ్యారంటీలను కలిగి ఉన్నాయి. 2022కు ముందు కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్ పై టెలికాం ఆపరేటర్లకు బ్యాంక్ గ్యారంటీ (BG) నిబంధనలను రద్దు చేయాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) ప్రభుత్వాన్ని చాన్నాళ్లుగా కోరుతోంది.
టెలీకాంలకు గుడ్ న్యూస్
బ్యాంక్ గ్యారంటీలను మాఫీ చేయడం వల్ల నగదు ప్రవాహాన్ని మెరుగుపరచడం, ఎక్కువ నెట్వర్క్ పెట్టుబడులను అనుమతించడం వంటివి సాధ్యమవుతాయి. 2021 టెలికాం సంస్కరణలు 2022 నుండి కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్ కోసం బ్యాంక్ గ్యారంటీల ఆవశ్యకతను తొలగించినప్పటికీ, ఆపరేటర్లు 2022 ముందు స్పెక్ట్రమ్ పై వాయిదా చెల్లింపుల కోసం బీజీలను అందించాల్సి ఉంటుంది.
బ్యాంక్ ల నుంచి అదనపు రుణం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియాకు ప్రభుత్వ నిర్ణయం గొప్ప ఊరటనిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో సంస్థ చెల్లింపు భారం తగ్గుతుంది. బ్యాంకుల నుంచి అదనపు రుణం పొందేందుకు వీలు కలుగుతంది. నవంబర్ బకాయి రూ.350 కోట్లు, సెప్టెంబర్ బకాయి రూ.4,600 కోట్లను వొడాఫోన్ ఐడియా చెల్లించలేకపోయింది. ఎయిర్టెల్, జియో (JIO)లతో పోటీ పడేందుకు వొడాఫోన్ ఐడియా రూ.25,000 కోట్లతో పాటు లెటర్స్ ఆఫ్ క్రెడిట్ రూపంలో రూ.10,000 కోట్లు కోరుతోంది. కంపెనీ ఇటీవల ఈక్విటీ ద్వారా రూ.24,000 కోట్లు సమీకరించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా కన్సాలిడేటెడ్ నష్టాన్ని రూ.7,176 కోట్లకు తగ్గించుకుంది. క్యూ2లో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.10,716 కోట్ల నుంచి రూ.10,932 కోట్లకు పెరిగింది. కీలక పనితీరు సూచిక అయిన కస్టమర్ ఏఆర్పీయూ (ARPU) టారిఫ్ పెంపుతో రూ.154 నుంచి 7.8 శాతం పెరిగి రూ.166కు చేరుకుంది.
20 కోట్ల కస్టమర్లు
వొడాఫోన్ ఐడియాకు ప్రస్తుతం మొత్తం 205 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. వీరిలో 4 జీ చందాదారులు 125.9 మిలియన్లు. ఇది 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 126.7 మిలియన్ల నుండి స్వల్పంగా తగ్గింది. కంపెనీ క్యూ2 ఫలితాల అనంతరం గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ ఒక్కో షేరుకు రూ.10 ధర లక్ష్యంగా పేర్కొంది. నోమురా ఇండియా కూడా రూ.14 టార్గెట్ ధరతో స్టాక్ పై 'బై' రేటింగ్ ను పునరుద్ఘాటించింది.
సూచన: ఈ వ్యాసంలోని అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులవి. ఇవి హిందుస్తాన్ టైమ్స్ తెలుగు అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించవు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.