Veg thali prices : జేబుకు చిల్లు- కడుపు మాత్రం నిండదు! విపరీతంగా పెరిగిన వెజ్ థాలీ ధరలు..
05 October 2024, 11:52 IST
Veg thali price hike : దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో కూరగాయల ధరలు పెరిగాయి. ఫలితంగా వెజ్ థాలీ రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. కానీ చికెన్ రేట్లు తగ్గడంతో నాన్ వెజ్ థాలీ ధరలు పడ్డాయి.
విపరీతంగా పెరిగిన వెజ్ థాలీ ధరలు..!
దేశంలో నిత్యవసర ధరలు, కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ ప్రభావం సామాన్యుడి కుడుపు మీద పడుతోంది! గత నెలలో దేశవ్యాప్తంగా వెజ్ థాలీ ధరలు భారీగా పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. కానీ అదే సమయంలో చికెన్ ధరలు తగ్గడంతో నాన్-వెజ్ థాలీల రేట్లు కూడా పడ్డాయని స్పష్టం చేసింది.
వెజ్ థాలీ ధరలు పెరిగాయి..!
సెప్టెంబర్ 2024లో ఆహార ధరల ధోరణులను చూడటం చాలా ముఖ్యం. క్రిసిల్ శుక్రవారం విడుదల చేసిన నెలవారీ నివేదిక ప్రకారం.. అధిక కూరగాయల ధరలతో గత నెలలో వెజిటేరియన్ థాలీ రేట్లు 11 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగాయి.
అదే సమయంలో చికెన్ రేట్లు తగ్గడంతో నాన్-వెజ్ థాలీ రేటు 2 శాతం తగ్గింది! దేశవ్యాప్తంగా సగటున.. నాన్ వెజ్ థాలీ ధర రూ.59.3 కాగా, వెజ్ వేరియంట్ ధర సెప్టెంబర్ లో రూ.31.3గా నమోదైంది. భోజనంలో 37శాతం ఖర్చులకు కారణామైన కూరగాయల ధరలు పెరగడంతో వెజ్ థాలీ రేట్లు పెరిగాయని క్రిసిల్ తాజా నివేదిక తెలిపింది.
థాలీ ధరను ఎలా లెక్కిస్తారు?
ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతంలో ఉన్న ఇన్పుట్ ధరలను పరిగణనలోకి తీసుకుని ఇంట్లో థాలీ తయారీకి అయ్యే సగటు ఖర్చును లెక్కిస్తారు. నెలవారీ క్రిసిల్ నివేదికలు సామాన్యుల ఖర్చుల్లో వస్తున్న మార్పులు, వాటి ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, బ్రాయిలర్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, వంట నూనె, వంట గ్యాస్‌తో పాటు అనేక ముఖ్యమైన పదార్ధాల ప్రస్తుత ధరలను డేటా పరిగణనలోకి తీసుకుంటుంది. ఇవన్నీ థాలీ ధరలో మార్పును ప్రేరేపిస్తాయి.
సెప్టెంబర్‌లో వెజ్ థాలీ రేట్లు పెరగడానికి కారణం ఉల్లి, బంగాళాదుంప, టమోటా ధరలు వరుసగా 53%, 50%, 18% వృద్ధి చెందడం అని తెలుస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సప్లై చెయిన్ దెబ్బతిని ఉల్లి, బంగాళాదుంపల ధరలు పెరిగాయని క్రిసిల్ వెల్లడించింది.
వెజ్ థాలీ ధరలో పప్పు దినుసుల రేటు 9% ఉండటం గమనార్హం. గత ఏడాది ఉత్పత్తి తగ్గడంతో వీటి ధరలు 14 శాతం పెరిగాయి. ఫలితంగా ఈ ఈ ఏడాది ఓపెనింగ్ స్టాక్ తగ్గింది. దీంతో వెజ్ థాలీ ధరల మరింత పెరిగాయి.
వాస్తవానికి నాన్ వెజ్ థాలీ ధర వెజ్‌తో పోల్చుకుంటే రెండింతలు ఉంటుంది. కానీ ఈసారి.. వెజ్ థాలీ ధర పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో దిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.903 ఉండగా, ఈ ఏడాది మార్చిలో అది రూ.803కు చేరింది. ఫలితంగా థాలీ ధర మరింత పెరగడానికి అడ్డుకట్టవేసింది.