Tesla in India : 'టెస్లా కోసం ప్రత్యేక పాలసీలు ఉండవు'- తేల్చిన కేంద్రం!
23 July 2023, 15:15 IST
- Tesla in India : టెస్లా కోసం కొత్తగా, ప్రత్యేకంగా ఎలాంటి పాలసీలను రూపొందిచమని కేంద్రం తేల్చిచెప్పింది. మరి ఈ నిర్ణయంపై ఎలాన్ మస్క్ ఎలా స్పందిస్తారో చూడాలి..
'టెస్లా కోసం ప్రత్యేక పాలసీలు ఉండవు'- తేల్చిన కేంద్రం!
Tesla in India : ఇండియాలో ఎంట్రీపై టెస్లా కన్నేసిన విషయం తెలిసిందే. రోపో, మాపో ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఇండియాలో అడుగుపెడుతుందని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. జూన్‌లో అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ అవ్వడంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. కాగా.. టెస్లాకు కేంద్రం మళ్లీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది! ఈ ఒక్క ఆటోమొబైల్ సంస్థ కోసం తామేమీ కొత్త, ప్రత్యేక విధానాలను రూపొందించమని ప్రభుత్వం తేల్చిచెప్పినట్టు సమాచారం. మరి ఎలాన్ మస్క్ ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి!
'కొత్త పాలసీ ఉండవు..'
కేంద్రం అన్ని కంపెనీలను ఒకే విధంగా పరిగణిస్తుందని, టెస్లా కోసం కొత్తగా ఎలాంటి విధానాలు రూపొందించడం లేదని ఓ ప్రభుత్వ అధికారి పీటీఐకు చెప్పారు.
"ఇప్పుడున్న పాలసీలను మార్చమని టెస్లాకు చెప్పాము. అవసరమైతే వారు పీఎల్ఐ స్కీమ్‌కు అప్లై చేసుకోవచ్చు. ఒక్క సంస్థ కోసం ప్రత్యేక పాలసీలను కేంద్రం రూపొందించదు. టెస్లాకు బ్యాటరీలు సప్లై చేసే పానాసోనిక్ సంస్థ కూడా మమ్మల్ని సంప్రదించింది. ఇండియాలో బ్యాటరీలను తయారీని ప్రతిపాదించింది. పీఎల్ఐ స్కీమ్‌కు అప్లై చేసుకోవాలని చెప్పాము," అని సంబంధిత ప్రభుత్వ అధికారి తెలిపారు.
ఇదీ చూడండి:- Tesla in India : ఇండియా కోసం టెస్లా క్రేజీ ప్లాన్..
ఏసీసీ (అడ్వాంస్డ్ కెమిస్ట్రీ సెల్) బ్యాటరీ స్టోరేజ కోసం రూ. 18,100 కోట్లు విలువ చేసే పీఎల్ఐ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది కేంద్రం. ఆటో, ఆటో పరికరాలు, డ్రోన్ ఇండస్ట్రీలకు ప్రయోజనం చేకూరే విధంగా రూ. 26,058 కోట్లు విలువ చేసే స్కీమ్‌ను కూడా తీసుకొచ్చింది. స్థానికంగా మేన్యూఫ్యాక్చరింగ్ను దృష్టిలో పెట్టుకుని వీటిని అమలు చేస్తోంది.
టెస్లా ఇండియాకు వస్తుందా..?
ఇక టెస్లా విషయానికొస్తే.. ఇండియాలో ఎంట్రీ కోసం ఆ సంస్థ చాలా ఏళ్లుగా ఎదురుచూస్తోంది. కాకపోతే.. ఇక్కడి ట్యాక్స్ విధానాలపై ఎలాన్ మస్క్ చాలాసార్లు తన అసంతృప్తిని బయటపెట్టారు. ట్యాక్స్‌లు తగ్గిస్తే, ఇండియాలో తమ కార్లను విక్రయిస్తామని అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కానీ ఇండియా మాత్రం ట్యాక్స్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. స్థానికంగా ఫ్యాక్టరీని పెట్టి, ఇండియాలోనే ప్రొడక్షన్ చేయాలని, అప్పుడు వివిధ స్కీమ్స్‌తో ప్రోత్సహిస్తామని చెబుతూ వస్తోంది.