Tesla in India : ఇండియాలోకి టెస్లా రాకపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ప్లాన్స్‌కు సంబంధించిన ఓ వార్త బయటకొచ్చింది. దేశంలో ప్రతి యేటా కనీసం 5లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని ఎలాన్ మస్క్ సంస్థ ప్రణాళికలు రచించిందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని పేర్కొంది. అంతేకాకుండా.. ఇక్కడ తయారు చేసిన వాహనాలను ఇండో పెసిఫిక్ ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు కూడా సంస్థ ప్లాన్ చేస్తున్నట్టు తెలిపింది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. ఇండియాలో టెస్లా ఓ పెద్ద ఫ్యాక్టరీని సిద్ధం చేస్తుంది. ఇండియాను ఎక్స్పోర్ట్ హబ్‌గా తయారు చేస్తుంది.
ఇండియాలోకి టెస్లా రాక కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రయత్నాలు జరిగినా.. పెద్దగా ఫలితాల్ని ఇవ్వలేదు. కానీ ఇప్పుడు.. ఎలామ్ మస్క్‌కు చెందిన సంస్థ, ఇండియాలోకి అడుగుపెట్టడం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాహనాల ధరలు ఎంత ఉండొచ్చు? అన్న సందేహాలు మొదలయ్యాయి. సాధారణంగానే టెస్లా మోడల్స్ అంటే.. లగ్జరీ వాహనాలు అని గుర్తింపు ఉంది. ఇక ఇండియాలోనూ ఇదే విధంగా సంస్థ మోడల్స్ ఉండొచ్చు. సంబంధిత నివేదిక ప్రకారం.. ఇండియాలో టెస్లా కార్ల ప్రారంభ ఎక్స్‌షోరూం ధర 24,400.66 డాలర్లుగా ఉండొచ్చు. అంటే.. ఇండియన్ కరెన్సీలో ఇది సుమారు రూ. 20.02 లక్షలు! ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న అతి చౌకైన ఎలక్ట్రిక్ వాహనం ఎంజీ కామెట్ ఈవీతో పోల్చుకుంటే దీని ధర రెండింతల కన్నా ఎక్కువ! బెస్ట్ సెల్లింగ్ టాటా నెక్సాన్ ఈవీతో పోల్చుకుంటే.. రూ. 5లక్షల కన్నా ఎక్కువ.
Tesla cars in India : వాస్తవానికి భారత్‌లో ఉండే ట్యాక్స్ కారణంగానే టెస్లా ఇంతకాలం వెనకడుగు వేసింది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ కూడా చాలాసార్లు ప్రస్తావించారు. అయితే.. వాహనాలను ఇండియాలో తయారు చేస్తే పన్నులు తగ్గిస్తామని భారత ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. తొలుత ఈ ప్రతిపాదనని టెస్లా తోసిపుచ్చింది. ముందు ఈవీలను పంపిస్తామని, ఆ తర్వాత డిమాండ్ బట్టి తయారీ విషయాన్ని చూస్తామని పేర్కొంది. ఫలితంగా ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదరలేదు.
కొంతకాలం తర్వాత టెస్లా మనసు మార్చుకుంది! ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు ముందుకొచ్చింది. అదే సమయంలో గత నెలలో అమెరికాకు వెళ్లిన ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్‌తో చర్చలు జరిపారు. దేశంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
ఇక ప్రస్తుతం టెస్లా- ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఇరు పక్షాలు ఒక ఒప్పందానికి వస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంబంధిత కథనం