Elon Musk threatens Meta: ‘‘ట్విటర్ ను కాపీ చేసి.. థ్రెడ్స్ రూపొందించారు. మెటాపై కేసు వేస్తాం’’: ట్విటర్ సీఈఓ మస్క్-twitter threatens to sue meta for hiring employees elon musk had fired ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Elon Musk Threatens Meta: ‘‘ట్విటర్ ను కాపీ చేసి.. థ్రెడ్స్ రూపొందించారు. మెటాపై కేసు వేస్తాం’’: ట్విటర్ సీఈఓ మస్క్

Elon Musk threatens Meta: ‘‘ట్విటర్ ను కాపీ చేసి.. థ్రెడ్స్ రూపొందించారు. మెటాపై కేసు వేస్తాం’’: ట్విటర్ సీఈఓ మస్క్

HT Telugu Desk HT Telugu
Jul 07, 2023 07:33 PM IST

Elon Musk threatens Meta: ట్విటర్ నుంచి తొలగించిన ఉద్యోగులను జాబ్స్ లోకి తీసుకుని ట్విటర్ కు కాపీగా థ్రెడ్స్ ను రూపొందించారని ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ ఆరోపించారు. థ్రెడ్స్ లో కొత్తదనం లేదని, అది పూర్తిగా ట్విటర్ కు కాపీ అని విమర్శించారు.

ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్
ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ (AFP)

Elon Musk threatens Meta: ట్విటర్ నుంచి తొలగించిన ఉద్యోగులను జాబ్స్ లోకి తీసుకుని ట్విటర్ కు కాపీగా థ్రెడ్స్ ను రూపొందించారని ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ ఆరోపించారు. థ్రెడ్స్ లో కొత్తదనం లేదని, అది పూర్తిగా ట్విటర్ కు కాపీ అని విమర్శించారు.

ఉద్యోగుల తొలగింపు

ట్విటర్ ను కొనుగోలు చేసిన తరువాత ఆ సంస్థ కు ఉన్నసుమారు 8000 వేల మంది ఉద్యోగుల్లో.. పొదుపు చర్యల పేరుతో సగానికి పైగా ఉద్యోగులకు ఎలాన్ మస్క్ తొలగించారు. మరికొందరు ఉద్యోగులు మస్క్ వేధింపులు భరించలేక రిజైన్ చేసి వెళ్లిపోయారు. మస్క్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ వంటి సోషల్ మీడియా దిగ్గజాల యాజమాన్య సంస్థ ‘మెటా’ సంస్థ ఇప్పుడు థ్రెడ్స్ పేరుతో ట్విటర్ కు పోటీగా మరో మైక్రో బ్లాగింగ్ యాప్ ను లాంచ్ చేసింది.

కోర్టుకీడుస్తా..

ట్విటర్ కు పోటీగా లాంచ్ అయిన థ్రెడ్స్ కు నెటిజనుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. లాంచ్ అయిన నాలుగు గంటల్లోపే 5 మిలియన్ల యూజర్లను థ్రెడ్స్ సంపాదించింది. దాంతో, ఇప్పుడు ఎలాన్ మస్క్ మెటా పై మండిపడ్తున్నారు. థ్రెడ్స్ పూర్తిగా కాపీ యాప్ అని, అలా కాపీ చేయడం చట్టపరమైన నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్నారు. ట్విటర్ నుంచి తొలగించిన ఉద్యోగులకు మెటా జాబ్స్ ఇచ్చి, ట్విటర్ లో పొందిన అనుభవంతో వారు థ్రెడ్స్ ను రూపొందించేలా చేసిందని మస్క్ విమర్శిస్తున్నారు. మేథో హక్కుల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన మెటాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘ పోటీ మంచిదే కానీ, మోసం చేయడం మంచిది కాదు’ అని మస్క్ ట్వీట్ చేశారు.

ట్విటర్ మాజీ ఉద్యోగులు ఎవరూ లేరు..

ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ ఆరోపణలకు మెటా సమాధానమిచ్చింది. థ్రెడ్స్ ను రూపొందించిన టీమ్ లో ట్విటర్ మాజీ ఉద్యోగులు ఎవరూ లేరని మెటా స్పష్టం చేసింది. ‘థ్రెడ్స్ ఇంజనీరింగ్ టీమ్ లో ఏ ఒక్క ట్విటర్ మాజీ ఉద్యోగి కూడా లేరు’ అని థ్రెడ్స్ అధికార ప్రతినిధి యాండీ స్టోన్స్ వివరణ ఇచ్చారు. ట్విటర్ కు , థ్రెడ్స్ కు పోలిక లేదని, రెండు పూర్తిగా వేర్వేరు ప్లాట్ ఫామ్స్ అని స్పష్టం చేశారు.

Whats_app_banner