Tesla news : ఈ ఎలక్ట్రిక్ కారు రిపేర్‌కు రూ. 17.5లక్షల బిల్లు! కస్టమర్ షాక్..!
22 October 2023, 16:30 IST
- Tesla news : కారులో సమస్యలు వచ్చి సర్వీసుకు ఇస్తే.. అక్కడి సిబ్బంది మీకు రూ. 17.5లక్షల బిల్లు వేస్తే ఎలా ఉంటుంది? టెస్లా మోడల్ వై ఈవీ కొన్న ఓ వ్యక్తి పరిస్థితి ఇదే!
ఈ ఎలక్ట్రిక్ కారు రిపేర్‌కు రూ. 17.5లక్షల బిల్లు! కస్టమర్ షాక్..!
Tesla Model Y repair cost : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'టెస్లా'కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. అందుకు తగ్గట్టుగానే టెస్లా వాహనాల ధరలు కూడా ఉంటాయి. ఈ టెస్లా సంస్థ.. ఏదో ఒక విషయంతో నిత్యం వార్తల్లో ఉంటుంది. ఇక తాజాగా.. టెస్లా వెహికిల్‌కు సంబంధించిన ఓ షాకింగ్ వార్త.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి.. తన టెస్లా మోడల్ 'వై'ని రిపేర్ చేయించాలని భావించగా.. అందుకు ఏకంగా రూ. 17.5లక్షలు ఖర్చు అవ్వడమే ఈ వార్త..!
ఇదీ జరిగింది..
పలు నివేదికల ప్రకారం.. స్కాట్‌ల్యాండ్‌కు చెందిన ఓ వ్యక్తి దగ్గర టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ క్రాసోవర్ వెహికిల్ ఉంది. కాగా.. ఆ బండిని రిపేర్‌కు ఇవ్వగా.. ఆయనకు 21వేల డాలర్ల బిల్లు వచ్చింది! ఇండియన్ కరెన్సీలో అది రూ. 17.46లక్షలు. ఆ బిల్లు చూసి ఆ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. వర్షంలో ఈ వెహికిల్‌ను నడపడమే.. రిపేర్‌కు ఇంత మొత్తంలో ఖర్చు అవ్వడానికి కారణం.
Tesla Model Y : కొన్ని రోజుల క్రితం.. భారీ వర్షాల మధ్య తన ఎలక్ట్రిక్ వెహికిల్‌ని నడిపాడు ఆ వ్యక్తి. మొదట్లో ఈవీ బాగానే పనిచేసినప్పటికీ.. తర్వాత స్టార్ట్ అవ్వలేదు. 5 గంటల పాటు ఆయన రోడ్డు మీదే ఉండిపోవాల్సి వచ్చింది. చివరికి.. ఒక ట్రక్ వచ్చి.. టెస్లా మోడల్ వైని టో చేసుకుని వెహికిల్ వర్క్‌షాప్ వరకు తీసుకెళ్లింది.
"అంత కష్టపడి వర్క్‌షాప్‌కు వెళ్లిన తర్వాత అక్కడి సరైన సాయం లభించలేదు. కస్టమర్ సపోర్ట్ సిబ్బంది సరిగ్గా స్పందించలేదు," అని ఆ టెస్లా వెహికిల్ ఓనర్ మీడియాకు చెప్పారు.
"నా ఈవీ బ్యాటరీ పోయిందని, సంస్థ ఆఫర్ చేస్తున్న 8ఏళ్ల వారెంటీ పరిధిలో అది లేదని టెస్లా సిబ్బంది చెప్పారు. ఈవీలోని బ్యాటరీ ప్యాక్‌లోకి వర్షం నీరు ప్రవేశించిందట. ఆ భాగం పూర్తిగా నాశనమైపోయిందట. ఫలితంగా కారులోని ప్రొపల్షన్ సిస్టెమ్పై ప్రభావం పడిందని అన్నారు. చివరికి 21వేల డాలర్ల రిపేర్ బిల్లు వేశారు," అని తన అసంతృప్తిని బయటపెట్టారు టెస్లా మోడల్ వై ఓనర్.
Tesla latest news : "టెస్లా వెహికిల్‌ని అనవసరంగా కొన్నానని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. అంత పెద్ద బిల్లుకు.. సిబ్బంది చెప్పిన సమాధానం నాకు సంతృప్తికరంగా అనిపించలేదు. కస్టమర్ సర్వీస్ ఇంత దారుణంగా ఉంటుందని ముందే తెలిస్తే.. అసలు నేను ఈ కారు కొనుగోలు చేసి, ఇలా బాధపడే వాడిని కాదు," అని ఓనర్ తన ఆవేదన వ్యక్తం చేశారు.
టెస్లా కస్టమర్ కేర్ సిబ్బంది పనితీరుపై ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది. టెస్లా వెహికిల్ రిపేర్‌కు అయ్యే ఖర్చులు ఎక్కువగానే ఉంటాయన్న విషయం వాస్తవమే. కానీ ఈ రేంజ్లో వారు బిల్లు వేయడం ఇప్పుడు అందరిని షాక్‌కు గురిచేస్తోంది.