తనదైన శైలిలో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న టెస్లా కంపెనీ మరో రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే విద్యుత్ కార్లు, అటానమస్ కార్లతో దూసుకెళ్తున్న ఎలాన్ మస్క్.. ఇప్పుడు రోబోటిక్ రంగంలోనూ రాణించేందుకు సిద్ధమయ్యారు. టెస్లా కంపెనీ తయారు చేసిన భవిష్యత్ హ్యుమనాయిడ్ రోబో ‘ఆప్టిమస్’ కు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. హ్యుమనాయిడ్ రోబో యోగా చేస్తోంది. అంతేకాకుండా వస్తువులను గుర్తించి వాటిని క్రమ పద్ధతిలో పెడుతోంది. ఇది మనిషి కంటే వేగంగా చేయగలుగుతోంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వీడియోపై స్పందించారు. హ్యుమనాయిడ్ రోబో తయారీలో పురోగతి సాధించినట్లు చెప్పారు. టెస్లా నుంచి మరో అద్భుతమైన పురోగతి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.